చేప ప్రసాదంపై నమ్మకం పెరిగింది!

Fish Medicine Starts At Nampally Exhibition Grounds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేపమందు పంపిణీని మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మందు కోసం తరలివస్తున్నారు.  ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు పంపిణీ కోసం 1.60 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన సోదరులు 175 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 

చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. 40 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ కూపన్లు అందజేస్తున్నారు. కాగా, రెండు మొబైల్‌ కౌంటర్లు, మరో రెండు వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ అదనంగా 133 బస్సులు నడుపుతుండటం గమనార్హం. చేప మందు కోసం వచ్చే వారి కోసం రూ.5 భోజన కేంద్రాలతోపాటు మంచి నీరు, పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.

అన్ని రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు
బత్తిన కుటుంబం 173 ఏండ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంచుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ప్రజలకు చేప ప్రసాదంపై నమ్మకం పెరిగింది.
 రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వర్షం ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అన్ని శాఖల అనుసంధానాన్ని చేసి పూర్తి జాగ్రత్తలను తీసుకున్నాం. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బందులు ఉండవు. చేప ప్రసాదం పంపిణీ విషయంలో సీఎం కేసీఆర్ సైతం జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి తలసాని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top