తెలంగాణలో కళారంగానికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి
సాక్షి: హైదరాబాద్: తెలంగాణలో కళారంగానికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇన్నాళ్లు నిరాదరణకు గురైన కళలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపా రు. కళలకు జీవం పోయడానికి ప్రత్యేకంగా సాంస్కృతిక సారథి అనే విప్లవాత్మకమైన విధానానికి శ్రీకారం చుట్టామన్నారు.
ఇలాంటి వ్యవస్థను ఏ రాష్ట్రం అమలు చేయలేదని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలోని కళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తమ భవిషత్తు లక్ష్యమని చెప్పారు. కొత్త రాష్ట్రంలో.. కొత్త సంవత్సరంలో సరికొత్త విధానాలతో ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన పేరిణి నృత్యానికి జవజీవాలు పోసి అద్భుతమైన కళగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని తెలిపారు.
ఏడు సూత్రాల పథకాన్ని అమలు చేస్తాం: మామిడి హరికృష్ణ
నూతన సంవత్సరంలో ఏడు సూత్రాల పథ కం తో సాంస్కృతిక శాఖ ముందుకు వెళ్లనున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎం.హరికృష్ణ తెలిపారు. తెలంగాణలోని కళల ను ఆదరించడంతో పాటు గ్రామీణ, జాన పద, ప్రజా కళారూపాలు, కళాకారులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. పేద కళాకారుల సంక్షేమానికి పింఛన్ల మొత్తాన్ని రూ.1500 పెంచినట్లు గుర్తుచేశారు. తెలంగాణ కళారూపాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ‘తానా’ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటామన్నారు.