బ్యాంకును బురిడీ కొట్టించిన ఫీల్ట్‌ ఆఫీసర్‌

field officer frauds bank account holders - Sakshi

సమభావన సంఘాల పేరిట నకిలీ ఖాతాలు

గ్రూపులకు లోన్లు మంజూరు చేస్తూ డబ్బులు మింగేసిన వైనం

‘మిర్యాల’లో ఆలస్యంగా వెలుగుచూసిన ఫీల్డ్‌ ఆఫీసర్‌ నిర్వాకం

బ్యాంకు మేనేజర్‌తోపాటు మరో ఆరుగురిపై వేటు

బ్యాంకులో  ఫీల్డ్‌ ఆఫీసర్‌గా నమ్మకంగా పనిచేశాడు. అతనికున్న సాంకేతిక పరిజ్ఞానం మరింత కలిసివచ్చింది. అంచెలంచెలుగా ఎదిగిన ఆ బ్యాంకు చైర్మన్‌కు దగ్గరయ్యాడు. అదే బ్యాంకులో పనిచేసిన ఉన్నతాధికారి సహకారంతో అక్రమాలకు తెరతీశాడు. లక్ష కాదు..రెండు లక్షలు కాదు..ఏకంగా రూ.4.5కోట్లు స్వాహా చేశాడు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు రోడ్డులో గల ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో చోటు చేసుకున్న ఈ అవినీతి బాగోతం వివరాలు ఇలా... 

మిర్యాలగూడ అర్బన్‌ : సంతోష్‌..ఇతను సదరు బ్యాంక్‌ నందిపాడు శాఖలో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మూడున్నరేళ్ల కాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానం మెండుగా ఉంది. ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూనే బ్యాంకులో ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు సరిచేసేవాడు. ఇలా సిబ్బందికి దగ్గరయ్యాడు. ఒకానొక దశలో ఏపీజీవీబీ చైర్మన్‌కు దగ్గరయ్యాడు. దీంతో డివిజన్‌లోని ఏ శాఖలో సాంకేతిక సమస్య వచ్చినా ఇతనినే పంపించేవారు. 

సాంకేతిక పరిజ్ఞానంతో తప్పుడుమార్గం
తనకున్న పరిజ్ఞానంతో తప్పుడు మార్గం పట్టాడు. లేని సమభావన సంఘాలను సృష్టించాడు. ఆన్‌లైన్‌లో పలువురి ఆధార్‌కార్డులు డౌన్‌లోడ్‌చేసి తన మిత్రుల కుటుంబ సభ్యులతో బ్యాంకు అకౌంట్లు తెరిపించాడు. తను సృష్టించిన సమభావన సంఘాలకు రుణాలు మంజూరు చేయడం ప్రారంభించాడు. ఈ విషయంలో బ్యాంకు ఉద్యోగుల ఐడీలను హ్యాక్‌చేశాడు. ఈ తతంగం 2017 మార్చి నుంచి నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. సదరు ఉద్యోగి ఒకేరోజు 20 డాక్యుమెంట్లను పూర్తిచేసి వాటికి రుణాలు మంజూరు చేశాడు. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బంది ఐడీలను సైతం సంపాదించడంతో పాటు మేనేజర్‌ ఐడీని సైతం హ్యాక్‌చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు వివిధ సంఘాల పేరుతో రూ.4.50కోట్లను నకిలీ సంఘాలకు మంజూరుచేసి స్వాహా చేశాడు. ఒకేసారి 20సంఘాలకు రుణాలు మంజూరు చేసినందుకు గాను సదరు ఉద్యోగిని బ్యాంకు చైర్మన్‌ సైతం ప్రసంశించాడు. అంతే కాకుండా అతడి ఫొటోనే బ్యాంకు వెబ్‌సైట్‌లో పెట్టి ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. 

వెలుగులోకి ఇలా..
బ్యాంకులో ఎలాంటి ఖాతాలేని ఒక మహిళ సెల్‌నంబర్‌కు సమభావన సంఘం రుణాల డబ్బులు మంజూరైనట్లు మెసేజ్‌ వచ్చింది. కంగుతిన్న ఆ మహిళ బ్యాంకులో ఎలాంటి ఖాతాలేదు. నేను ఏ సమభావన సంఘంలో సభ్యురాలిని కాను కాని నాసెల్‌ఫోన్‌కు బ్యాంకునుంచి మెసేజ్‌ రావండమేంటి అని బ్యాంకు అధికారులను సంప్రదించింది. దీంతో అక్రమాల విషయం వెలుగులోకి వచ్చింది. 

గత ఐదురోజులుగా విచారణ.. 
బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై నిజాలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన స్టేట్‌ విజిలెన్స్, సీబీఐ, నాబార్డు సిజియన్స్‌కు సైతం ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్‌ బృందాలు  ఐదురోజులుగా విచారణను వేగవంతం చేసింది. పూర్తిస్థియిలో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంది. అక్రమాల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు విచారణ చేపట్టి తొలుత సదరు ఉద్యోగిని బదిలీచేసినట్లు తెలిసింది. కానీ ఆ బదిలీ స్థానంలోకి విధుల్లోకి చేరలేదు. అధిక మొత్తంలో బ్యాంకు సొమ్ము స్వాహా కావడంతో ఉన్నా«తాధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. 
బ్యాంకు మేనేజర్‌తో పాటు మరో 

ఆరుగురిపై వేటు..
కాగా ఏపీజీవీబీ ప్రధాన బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేస్తున్న బృందం ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆరుగురిపై వేటు వేసినట్లు సమాచారం. బ్యాంకులో భారీ మొత్తంలో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్‌ను నల్లగొండలో ఈ నెల 7న జరిగిన జిల్లా ఏపీజీవీబీ బ్యాంకర్ల సమావేశంలో విచారించి విధులనుంచి విధులనుంచి తొలగించినట్లు తెలిసింది. ఫలితంగా మూడు రోజులుగా ఆయన విధుల్లోకి రావడంలేదని తెలిసింది. కాగా సోమవారం నుంచి నూతన మేనేజర్‌ విదుల్లో చేరుతారని సమాచారం. బ్యాంకులో ఎంతసోమ్ము స్వాహా అయ్యింది..? ఎన్నికోట్ల కుంబకోణం జరిగిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించి త్వరలో బ్యాంకులపై క్రిమినల కేసులు నమోదు చేసేందుకు విజిలెన్స్‌ బృందం విచారణను వేగవంతం చేసినట్లు తెలిసింది. 

చర్యలు తీసుకుంటాం
మిర్యాలగూడ ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో అక్రమాలు జరిగిన విషయం అంతర్గత సమస్య. ఫీల్డ్‌ ఆఫీసర్‌ అక్రమాలకు పాల్పడినట్టు తెలసింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్య తీసుకుంటాం.  –రఘునాథరెడ్డి జీఎం ఏపీజీవీబీ, నల్లగొండ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top