కన్న కొడుకే కాలయముడు..!

Father Murder In Khammam By Son - Sakshi

ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం తండ్రిని చంపిన తనయుడు

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

మధిరరూరల్‌: ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం కన్న కొడుకే కాలయముడుగా మారి తండ్రిని హత్యచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. మధిర మండల పరిధిలోని మాటూరుపేట గ్రామానికి చెందిన మేడిశెట్టి ఉద్దండయ్య (55) అనుమానాస్పద స్థితిలో ఈనెల 15న మృతి చెందినట్లు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మధిర రూరల్‌ ఎస్‌ఐ లవణ్‌కుమార్‌ సోమవారం విలేకరులకు వివరాలు తెలిపారు. ఉద్దండయ్యకు కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఉద్దండయ్య చనిపోతే ఇన్సూరెన్స్‌ వస్తుందని, ఆ ఆడబ్బుతో తనకు ఉన్న అప్పులను తీర్చుకోవచ్చని కృష్ణ ఆలోచించి తండ్రిని ఈనెల 13న హత్య చేసేందుకు పథకం పన్నాడు.  

హత్యలో స్నేహితుడి సహకారం..
ఈ హత్యకు అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు, గుంటూరులో నివసిస్తున్న దుర్గారెడ్డిని సహాయం కోరాడు. అంతేకాకుండా ఒక పాత ఆటో కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేస్తానని అతనికి చెప్పాడు. నాన్నా.. నీకు బట్టలు కొనిస్తానని చెప్పి కృష్ణ తండ్రి ఉద్దండయ్యను మోటారుసైకిల్‌పై ఎక్కించుకుని మధిరకు వచ్చాడు. అక్కడ రెండు లుంగీలు, రెండు కండువాలు కొనుగోలు చేశాడు. దుర్గారెడ్డి గుంటూరు నుంచి ఇంటర్‌సిటీ రైలులో మధిరకు వచ్చాడు. కృష్ణ తన తండ్రితో పాటు దుర్గారెడ్డిని కూడా మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని రాయపట్నం, దెందుకూరులో ఉన్న వైన్‌షాపుల్లో మద్యం సేవించారు. ఉద్దండయ్యను ఎక్కించుకుని సఖినవీడు వెళ్లే రోడ్డు వైపునకు తీసుకెళ్లి కండువాతో మెడకు బిగించి హత్యచేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కనే లోతైన కందకంలో పడేసి వెళ్లిపోయారు. కృష్ణ ఇంటికి వెళ్లగా స్నేహితుడు దుర్గారెడ్డి అదేరోజు రాత్రి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైలులో గుంటూరుకు తిరిగి వెళ్లాడు.

ఏమీ తెలియనట్లు బంధువులకు ఫోన్లు..
ఎవరికీ అనుమానం రాకుండా కృష్ణ తన తండ్రి ఇంటికి రాలేదని ఏమీ తెలియనట్లు బంధువులు, స్నేహితులకు ఫోన్‌చేశాడు. ఉద్దండయ్య మృతదేహాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో కృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి బంధువులకు ఇక్కడ మృతదేహం ఉందని సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనపై బంధువులకు పలు అనుమానాలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని కృష్ణకు చెప్పాడు. దీంతో అతని ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ లవణ్‌కుమార్‌ కేసు విచారించారు. ఈ విచారణలో అక్కడ మృతదేహం ఉందని నీకు ఎలా తెలిసిందని కృష్ణను ప్రశ్నించగా మధిరలోని లడక్‌బజారుకు చెందిన రత్తమ్మ అనే మహిళ చెప్పిందన్నాడు. అయితే రత్తమ్మ అనే మహిళ లేకపోవడంతో కృష్ణను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై మధిర సీఐ కరుణాకర్‌ దర్యాప్తు చేసి నిందితులను కోర్టుకు రిమాండ్‌Š చేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top