రుణాలు అందేనా?! 

Farmers Problems With Crop Loan Medak - Sakshi

సాక్షి, మెదక్‌: పంట రుణాల కోసం రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ రుణాలు పొందాలంటే రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులో తనఖా(కుదువ) పెట్టాల్సిందే. తనఖా పెట్టినా రైతులకు సకాలంలో రుణాలు అందని పరిస్థితి ఉంది. మరోవైపు పంటల సాగు పెట్టుబడి ఏటా పెరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గురువారం ప్రకటించిన పరపతి విధానంలో పూచీకత్తు లేకుండా పొందే పంట రుణ పరిమితిని రూ.1.60 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రైతులకు మేలు చేయనుంది. ఇకపై రైతులు తనఖా పెట్టకుండానే రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఇది అమలు కానుంది. దీంతో జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. మెదక్‌ జిల్లాలో 2.50 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో ప్రతీ ఏడాది 1.50 లక్షల మంది రైతులు వేర్వేరు బ్యాంకుల్లో వ్యవసాయ పంట రుణాలు తీసుకుంటున్నారు.

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పరిగణలోకి తీసుకుని పంటల వారిగా రైతులకు బ్యాంకర్లు రుణాలు అందిస్తుంటారు. రైతులు పంట రుణాలు పొందాలంటే తప్పనిసరిగా తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు బ్యాంకుల వద్ద తనఖా పెట్టాల్సిందే. ఎలాంటి పూచీకత్తు లేకుండా రైతులకు రూ. లక్షలోపు రుణాలు ఇవ్వాలని నిబంధన ఉంది. అయినప్పటికీ చాలా చోట్ల బ్యాంకర్లు తప్పనిసరిగా తనఖా పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి తనఖా లేకుండా రైతులు రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. రుణ పరిమితి పెరగడం వల్ల రైతులు పంటల సాగుకు అవసరమైన డబ్బుల కోసం ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఎకరాకు ఇచ్చే ఆర్థిక సహాయం రూ.10వేలకు పెంచనుంది. దీంతో రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు రూ.6 ఆర్థిక సహాయ అందజేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులకు పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి.

బ్యాంకర్ల తీరు మారేనా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఆర్‌బీఐ రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. అయితే బ్యాంకర్ల తీరు మాత్రం రైతులకు ఏమాత్రం మింగుడుపడని విధంగా ఉంది. ప్రతీ ఏటా బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యం పెట్టుకున్నప్పటికీ  రెండేళ్లుగా లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.720 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.450 కోట్ల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. రబీలో రూ.480 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా డిసెంబర్‌ వరకు రూ.60 కోట్ల రుణాలు ఇచ్చారు. రైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. తనఖా లేకుండా రుణాలు ఇచ్చే మొత్తాన్ని రూ.1.60 లక్షలకు పెంచిన నేపథ్యంలో రుణాల మంజూరులో బ్యాంకర్ల వైఖరి మారుతుందో లేదో వేచి చూడాలి.

ఆర్‌బీఐ నిర్ణయంతో రైతులకు మేలు : పరశురాం నాయక్‌
తనఖా లేకుండా ఇచ్చే పంట రుణాల పరిమితిని ఆర్‌బీఐ రూ.1.60 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం రైతులకు మేలు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్‌ తెలిపారు. తనఖా లేకుండా పంట రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుతాయన్నారు. ఆర్‌బీఐ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇచ్చి అన్నదాతలకు అండగా నిలవాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top