70 ఏళ్ల వరకు రైతు బీమా!

Farmers insurance up to 70 years! - Sakshi

పథకం మార్గదర్శకాలపై సర్కారు కసరత్తు

పట్టాదారు పాస్‌ పుస్తకాలున్న రైతులందరికీ వర్తింపు

ప్రీమియం ఏడాదికి రూ.800– 1,100 మధ్య ఉండే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బీమా’కు వయో పరిమితి 70 ఏళ్ల వరకు నిర్ణయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సాధారణంగా బీమా వయోపరిమితి 55 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది. కానీ రైతుల కోసం ఈ వయోపరిమితిని 70 ఏళ్ల వరకు పెంచేలా సర్కారు ఎల్‌ఐసీ వర్గాలతో సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రావతరణ దినోత్సవం రోజున రైతు బీమాను ప్రారంభించాలన్న యోచన మేరకు.. వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు వెంటనే సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.

ప్రీమియం ఎక్కువైనా సరే..
రైతు బీమా కోసం ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ బీమా కింద రైతులు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది. సాధారణ మరణం పొందినా, ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదంలో చనిపోయినా ఆయా రైతుల కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందజేస్తారు. సాధారణంగా బీమా వయో పరిమితి 55 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ ‘రైతు బీమా’కింద ప్రత్యేకంగా రైతులకు 70 ఏళ్ల వరకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఎల్‌ఐసీని కోరనున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రీమియం అధికమైనా సరే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎల్‌ఐసీకి సూచించనున్నారు. రైతు బీమా అంశంపై ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో ఇదే విషయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. రైతు బీమా ప్రీమియం సగటున రూ.800 నుంచి రూ.1,100 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

58 లక్షల మందికి ప్రయోజనం
భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులు ఉన్నట్టు సర్కారు గుర్తించింది. ఆ ప్రకారమే ప్రస్తుతం ‘రైతు బంధు’ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది. ఆ రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకొస్తారు. ఒకవేళ ఎవరైనా రైతులు ఇప్పటికే బీమా సదుపాయం కలిగి ఉంటే, వ్యవసాయ భూమి ఉన్న ఉద్యోగులు బీమా కలిగి ఉంటే.. వారిని ఈ పథకం పరిధిలోంచి మినహాయిస్తారు. ఇక పట్టాదారు పాస్‌ పుస్తకమున్న 18 ఏళ్లలోపు మైనర్లకు బీమా కల్పించాలా వద్దా అన్న విషయంపై వ్యవసాయశాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇక 70 ఏళ్లు పైబడిన వారు ఉంటే.. వారికి రైతు బీమా వర్తించదు. ఇప్పుడున్న లెక్క ప్రకారం 58.33 లక్షల మందిలో 58 లక్షల మందికి బీమా ప్రయోజనం అందుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కరికి సగటున రూ.వెయ్యి ప్రీమియంగా లెక్కిస్తే.. ప్రభుత్వం ఏటా ఎల్‌ఐసీకి ఏటా రూ.580 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే అర్హుల జాబితా తయారయ్యాక రైతుల సంఖ్య మారే అవకాశముందని చెబుతున్నారు. కాగా ఆత్మహత్య, సాధారణ మరణం ఏదైనా కూడా రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల మేర బీమా పరిహారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా తయారు చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.

కౌలు రైతులకు బీమా ఉండదు
రాష్ట్రంలో భూమిలేని కౌలు రైతులు 15 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబీమాను వర్తింపజేస్తున్నందున కౌలు రైతులను ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రైతుబంధు పథకం కింద కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దీనితోపాటు రైతు బీమా కూడా అందకుంటే విమర్శలు వచ్చే అవకాశముందన్న చర్చ కూడా జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top