రైతులు సతమతం

Farmers Face To land Survey - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): రైతు సమగ్ర సర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఓవైపు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు పరిషత్‌ ఎన్నికల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవసాయ శాఖలో అన్ని హోదాల్లో ఉన్న ఉద్యోగులకు అప్పగించింది. ఇలా ఏక కాలంలో రెండు ప్రధాన బాధ్యతలను నిర్వర్తించాల్సి రావడంతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. రైతులు పండించే పంటలు, వారికి ఉన్న భూమి వివరాలు, వ్యవసాయ పరికరాలు తదితర అంశాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు సమగ్ర సర్వేను ప్రారంభించింది. మే 20వ తేదీలోగా సర్వే పూర్తి చేసి, ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించింది.

మరోవైపు, పరిషత్‌ ఎన్నికల నిర్వహణ కోసం వివిధ శాఖల ఉద్యోగులతో పాటు వ్యవసాయ శాఖ ఉద్యోగులను కూడా ఎన్నికల సంఘం నియమించింది. వ్యవసాయ శాఖలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులను జెడ్పీటీసీ స్థానాలకు రిటర్నింగ్‌ అధికారులుగా, మండల వ్యవసాయాధికారులను ఎంపీటీసీ స్థానాలకు రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు. ఏఈవోలను పోలింగ్‌ అధికారులుగా, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులుగా నియమించి వారికి శిక్షణ ఇస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారులుగా నియమితులైన అధికారులు నామినేషన్ల స్వీకరణలో బిజీగా ఉన్నారు.

పీవో, ఏపీవోలుగా నియమితులైన వారు ఎన్నికల నిర్వహణ శిక్షణలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో రైతు సమగ్ర సర్వేను నిర్వహించాల్సి ఉంది. అటు ఎన్నికల బాధ్యతలు, ఇటు రైతు సర్వేను ఒకే సమయంలో నిర్వహించడం తమకు సాధ్యం కావడం లేదని, అందువల్ల ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయించింది.

అయితే, ఎన్నికల సంఘం మాత్రం వ్యవసాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి తప్పించలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి ముందుగానే వ్యవసాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించామని, అందువల్ల రైతు సమగ్ర సర్వే కోసం వారిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించడం కుదరదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఎక్కువగా ఉండటంతో అన్ని శాఖల ఉద్యోగులకు ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు వారు పేర్కొంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభానికి ముందుగానే రైతు సమగ్ర సర్వే పూర్తి చేయాల ని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సూచించింది. ఎన్నికలకు సంబంధించిన విధుల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తినా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ శాఖ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కనీసం ప్రభుత్వం పునరాలోచన చేసి సమగ్ర సర్వేకు గడువు పెంచితే బాగుంటుందని వారు కోరుతున్నారు. 

తప్పడం లేదు 
ఎన్నికల విధుల నిర్వహణ, రైతు సమగ్ర సర్వే ఏకకాలంలో నిర్వహించాల్సి రావడం కొంత ఇబ్బందే. కానీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో తప్పనిసరిగా ఎన్నికల విధులను నిర్వహించాల్సిందే. సమగ్ర సర్వేకు ఆటంకం కలుగకుండా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నాం. 
– మేకల గోవింద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top