కౌలు రైతులపై పిడుగు

Farmers Died Due To Thunderbolt In Mancherial District - Sakshi

వేకువ జామున పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం

ఆరెపల్లిలో వరి ధాన్యానికి కాపలా ఉండగా ఘటన

పరిశీలించిన ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, కలెక్టర్‌

బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

తక్షణ సహాయంగా రూ.50 వేల చొప్పున అందజేత

సాక్షి, భీమారం(చెన్నూర్‌): మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు కౌలు రైతులు ఆదివారం తెల్లవారుజామున పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఆరెపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి రాజయ్య(32), ముడిపల్లిరాజం(50), జాడి రమేశ్‌(28) వరి కల్లాల వద్ద ఉన్న వరిధాన్యానికి కాపలా ఉండేందుకు వెళ్లి అక్కడే  నిద్రించారు. ఆదివారం తెల్లవారజామున మూడు గంటల  ప్రాంతంలో వర్షంతో పాటు ఏకధాటిగా పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో వారిపై పిడుగులు పడి అక్కడిక్కడే మృతి చెందారు.

గ్రామ శివారుల్లో ఉన్న వరి కల్లం వద్దకు సుధాకర్‌ అనే వ్యక్తి గమనించి  వచ్చే వరకు రైతుల మరణ వార్తను గ్రామస్తులకు చెప్పాడు. ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరణించిన రైతు కుటుంబాలకు ఒక్కొరికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు విప్‌ ఓదెలు, కలెక్టర్‌ కర్ణన్‌ హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.50 వేలు చెక్కులను అందజేశారు. జెడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్‌నాయక్, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు చేకూర్తి సత్యనారాయణరెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్‌ భూమేశ్వర్, జైపూర్‌ ఏసీపీ సీతారామలు, సీఐ నారాయణ ఆరేపల్‌ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. 

తెల్లారితే వడ్లని తీసుక పోయేవారు: రైతులు
ఆరెపల్లిలో రైతులు ఆరబెట్టిన వడ్లను భీమారంలోని కొ నుగోలు కేంద్రం నిర్వాహులు ఆదివారం తరలిస్తామని చెప్పినట్లు స్థానిక రైతులు తెలిపారు. గ్రామంలో కొనుగోలు కేంద్రం లేక ఆరెపల్లి వరిధాన్యం మొత్తం భీమారం తరలిస్తుంటారు. ఈమేరకు శనివారం ఐకేపీ వీవో సభ్యులు ఆరెపల్లికి వెళ్లి వరి ధాన్యం పరిశీలించారు. తేమ శాతం సరిపోను ఉందని ఆదివారం తీసుకెళ్తామని చెప్పి వెళ్లినట్లు రైతులు పేర్కొన్నారు. ఇంతలోనే అంత పనిజరిగిందా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వీధిన పడ్డ కుటుంబాలు
పిడుగుపాటు గురై మృతి చెందిన ముగ్గురు రైతులకు స్వంత భూమి కూడా లేదు. వీరు ఇతురుల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఆరెపల్లిలో గతంలో కన్నా ఇప్పుడు వ్యవసాయం అభివృద్ధి చెందడంతో వ్యవసాయంపై కూలీలు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ముగ్గురు రైతులు కూలీ పనులు మానుకుని నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ముడిపల్లి రాజం ఏడెకరాలు, రాంటుంకి రాజయ్య నాగుగెకరాలు, జాడి రమేశ్‌ ఆరెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల మరణంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. మృతి చెందిన జాడిరమేశ్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. మిడిపల్లి రాజంకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాటెంకి రాజయ్యకు భార్య రాజేశ్వరి, కూతురు రవళి, కుమారుడు అంజి ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top