న్యాయం చేస్తారా.. చావమంటారా!

న్యాయం చేస్తారా.. చావమంటారా! - Sakshi


జగదేవ్‌పూర్ : తన పేరుతో ఉన్న భూమిని మరో రైతు భార్య పేరుతో పట్టా చేసిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఓ రైతు రెవెన్యూ అధికారులను నిలదీశాడు. అయినా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు పాపమొల్ల లింగయ్యకు 707బైఅ2 సర్వే నంబర్‌లో 37 గుంటల భూమి ఉంది. అలాగే 707బైఇ4బై4 సర్వే నంబర్‌లో ఆరున్నర గుంటల భూమి ఉంది.



అయితే ఈ భూమిలో కొన్నేళ్లుగా కుమారుడు రామచంద్రంతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే పై పేర్కొన్న భూమి 2010 వరకు లింగయ్య పేరు మీద ఉన్నా.. 2012వ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఐలపురం ఐలయ్య భార్య నర్సమ్మ పేరుపై రెవెన్యూ అధికారులు పట్టా చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రైతు లింగయ్య.. రెవెన్యూ అధికారులను సంప్రదించి తనకు న్యాయం చేయాలని కోరాడు. అయినా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోయింది. కాగా ఇటీవల నర్సమ్మ మృతి చెందింది. దీంతో గతంలో తన పేరుతో ఉన్న పట్టా భూమిని తిరిగి తనపేరుతో మార్చాలని లింగయ్య ఐదారు నెలలుగా గ్రామ వీఆర్‌ఓ, ఆర్‌ఐ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.



ఈ క్రమంలో అధికారులు లింగయ్యను పట్టించుకోకుండా.. నర్సమ్మ కుమారుడు రాంబాబు పేరుతో మార్చారు. దీంతో చేసేది లేక శుక్రవారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లింగాయ్య, ఆయన కుమారుడు రాంచంద్రంలు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ శ్రీనివాసులుకు తమ గోడును విన్నవించుకుంటేనే.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను రాంచంద్రం ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశాడు. దీంతో తహశీల్దార్, సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం వీఆర్‌ఓ, ఆర్‌ఐలకు తన వద్దకు పిలుచుకుని పూర్తి వివరాలను తెలుసుకున్నారు. తనకు తెల్వకుండా ఎలా పట్టా చేశారంటూ వారి తీరుపై మండి పడ్డారు.

 

విచారణ చేసి రైతుకు న్యాయం చేస్తాం..

రైతు రాంచంద్రంకు జరిగిన పట్టా మార్పిడిపై పూర్తి వివరాలు తెలుసుకుని న్యాయం చేస్తా. ఈ విషయంలో వీఆర్‌ఓ, ఆర్‌ఐ నుంచి వివరాలను సేకరిస్తున్నా.

- శ్రీనివాసులు, తహశీల్దార్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top