రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలని..
ఆదిలాబాద్: రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలని.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన రైతు కిషోర్‌రావు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ గత నెల 26న మార్కెట్‌యార్డులోనే పత్తి కొనుగోలు ప్రారంభించారన్నారు. అక్కడ వేలం పాట ద్వారా ధర నిర్ణయించిన అనంతరం తేమ సాకుతో కొనుగోలుకు నిరాకరిస్తున్నారని చెప్పారు.
మొదటి రోజు మాత్రమే రైతులు తీసుకొచ్చిన పత్తిని తేమ చూడకుండా వ్యాపారులు కొనుగోలు చేశారని, తదుపరి పరిస్థితి అధ్వానంగా తయారైందని తెలిపారు. రైతులకు మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధరలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రూ.4,100 మద్దతు ధర చెల్లించి ఆదుకునే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.