
బంజారాలను ఎస్టీల్లో చేర్చాలని మహారాష్ట్రలో వినూత్న నిరసన
జల్నా/థానే: తమ హక్కులు సాధించుకునేందుకు శాంతియుత మార్గంలో చేపట్టే నిరసనల్లో ప్రధానమైనది నిరాహారదీక్ష. సాధారణంగా ఓ ప్రాంతంలో టెంటు వేసుకొని నిరాహారదీక్షలు చేయటం మనం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒక చెట్టుకు నులక మంచాన్ని వేలాడదీసి, అందులో కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. మహారాష్ట్రలో బంజారాలను ఎస్టీలుగా పరిగణించరు. వారిని విముక్త, సంచార జాతుల (వీజేఎన్టీ) జాబితాలో చేర్చారు. అయితే, హైదరాబాద్ గెజిట్ ప్రకారం తమను ఎస్టీల్లో చేర్చాలని వారు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
ఆ డిమాండ్ సాధనకోసం మహారాష్ట్రలోని జల్నా పట్టణానికి సమీపంలో ఉన్న అంబద్ చౌఫుల్లీ ప్రాంతంలో విజయ్ చవాన్ అనే వ్యక్తి ఇలా మంచాన్ని చెట్టుకు వేలాడదీసి శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లో తమ జాతిని ఎస్టీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చారని, మండల్ కమిషన్ సమయంలో మహారాష్ట్రలోని బంజారాలను వీజేఎనీ్టలుగా వర్గీకరించటంతో ఆ హోదా కోల్పోయామని ఆగ్రహం వ్యక్తంచేశాడు.
తిరిగి ఎస్టీ హోదా సాధనకోసమే తీను నిరాహార దీక్షకు పూనుకున్నట్లు వెల్లడించాడు. నిజానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దే దీక్షకు ప్రయత్నించినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలిపాడు. ఎస్టీ హోదా కోసం మహారాష్ట్రలో బంజారాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మరాఠాలను ఓబీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించటంతో ఇతర వర్గాలు కూడా తమ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు ఉధృతం చేశాయి. ఎస్టీ హోదా కోసం నవంబర్ 9న ముంబైలోని శివాజీ పార్కులో నిరసన చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ హరిభావ్ రాథోడ్ ప్రకటించారు.