కు.ని.. సక్సెస్‌

Family Control Oparations Success In District Hospital - Sakshi

 84 మంది మహిళలకు శస్త్రచికిత్స

ఏడాది తర్వాత  నిర్వహణతో భారీగా తరలివచ్చిన వైనం

ఏర్పాట్లు చేసినా తప్పని తిప్పలు

వనపర్తి అర్బన్‌: స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు మహిళలు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఆవరణ అంతా అలజడి నెలకొంది. సుమారు ఏడాది తర్వాత కు.ని. శస్త్రచికిత్సలు చేపట్టడంతో భారీ సంఖ్యలో తరలించారు. కలెక్టర్‌ శ్వేతామహంతి ఆదేశానుసారం నూతన జిల్లా అయ్యాక వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ప్రత్యేక మిషన్లను తెప్పించి ల్యాప్రోస్కోపిక్‌ విధానం ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించారు. పెబ్బేరు, కడుకుంట్ల, పీపీ యూనిట్ల పరిధిలోని మహిళలకు శస్త్రచికిత్సలు జరిపారు. వందలాదిగా మహిళలు ఆస్పత్రికి తరలిరావడం, టోకెన్లు లభించకపోవడంతో చాలామంది మహిళలు వెనుదిరిగారు. గ్రామాల నుంచి మహిళలను ఆస్పత్రికి తీసుకువస్తే వైద్యసిబ్బంది తమను అసభ్యకర పదాలతో తిట్టి బయటకు పంపారని కొందరు ఆశలు ఆరోపించారు. ఆపరేషన్ల కోసం వచ్చే వారికి ప్రత్యేకంగా తాగునీరు, టెంట్లు వేసినా సరిపోకపోవడంతో చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు.

84 మందికి శస్త్రచికిత్స
జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాసులు, హైదరాబాద్‌ నుంచి వచ్చిన ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌ జోయెజ్, మత్తుమందు నిపుణులు డాక్టర్‌ ప్రభు తదితరులు 84 మందికి కు.ని. ఆపరేషన్లను నిర్వహించారు. 50 మందికి మాత్రమే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. కొందరు రికమండేషన్లు తీసుకురావడంతో 84కి చేరుకుంది. మంచాలు సరిపోకపోవడంతో కొంద రిని నేలపైనే పడుకోబెట్టారు. మహిళలు డీపీఎల్‌ శస్త్రచిక్తిత్సకు వెళ్లడంతో  పిల్లలను వారి బంధువులు చెట్ల కింద పెట్టుకొని ఆడిపించడం, ఎండ అధికంగా ఉండడంతో చిన్నారులు అవస్థలకు గురయ్యారు. హెడ్‌నర్స్‌ గౌరీదేవి, స్టాఫ్‌నర్స్‌ నిర్మల, కౌసల్య, భాగ్య సిబ్బంది ఆపరేషన్లకు సహకరించారు.

సద్వినియోగం చేసుకోండి
చాలాకాలం తర్వాత నిర్వహిస్తున్న డీపీఎల్‌ శిబిరాన్ని జిల్లాలోని ఇతర పీహెచ్‌సీల్లోనూ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీన ఖిల్లాఘనపురం పీహెచ్‌సీ, 19న రేవల్లి పీహెచ్‌సీ, 23న ఆత్మకూర్‌ పీహెచ్‌సీ, 26న వనపర్తిలో శస్త్రచిక్తిత్స నిర్వహిస్తామని, ఆయా పీహెచ్‌సీల పరిధిలోని ఆశలు, వైద్య సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. వేసవి కావడంతో జూన్‌ నుంచి రెగ్యులర్‌గా జిల్లాకేంద్రంలో డీపీఎల్‌ శిబిరం నిర్వహిస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top