మా కంటికి వెలుగెప్పుడు సారూ..!

Eye Tests And Surgeries Stopped in Telangana - Sakshi

కంటి శస్త్ర చికిత్స కోసం వేలాది మంది ఎదురుచూపు

అట్టహాసంగా కంటివెలుగు శిబిరాలు

కళ్లజోళ్ల పంపిణీ తరువాత పట్టించుకోరా

చికిత్స కోసం ఎదురు చూస్తున్న 41,628 మంది

సాక్షి, మేడ్చల్‌ జిల్లా : కంటి పరీక్షలు చేశారు.. చాలా మందికి కళ్లజోళ్లిచ్చారు..మరి మాకు శస్త్ర చికిత్స ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు వేలాది మంది నిరుపేదలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా వేలాదిమందికి కంటిపరీక్షలు చేయించింది. అయితే పరీక్షలు చేయించింది కానీ కొందరికే కంటి ఆపరేషన్లు చేశారు. మిగతావారంతా మాకెప్పుడుఅంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 42,148 మందికి  శస్త్ర చికిత్సలు చేయాల్సి రావటంతో, జిల్లాలో గుర్తించిన  పది ఆసుపత్రులకు సిఫారసు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 520 మందికి మాత్రమే కంటి శస్త్ర చికిత్సలు చేయగా, మిగతా 41,628 మంది శస్త్ర చికిత్సల కోసం ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ శస్త్ర చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవటంతో ఆరోగ్యశ్రీ తదితర పథకం కింద మిగతా వారికి ఆపరేషన్లు చేయటం జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తున్నది.  

జిల్లాలో కంటి వెలుగు సాగిందిలా..
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 89 గ్రామాలు, బస్తీల్లో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం జోరుగా సాగింది. ఆగష్టు 15 నుంచి ఏప్రిల్‌ 15 వరకు  6,366 కంటి వెలుగు  శిబిరాలు నిర్వహించి 12,86,434 మందికి  కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో కంటి పరీక్షల కోసం 52 బృందాలను ఏర్పాటు చేశారు. అర్బన్‌ పరిధిలో 43 , రూరల్‌ ప్రాంతాల్లో 9 బృందాలు కంటి పరీక్షలు చేపట్టాయి. 

1.27 లక్షల మందికి కంటి అద్దాలు..
జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహించిన 12,86,434  మందిలో కంటి అద్దాలు అవసరంగా భావించి 1,27,144 మందికి ఉచితంగా కళ్ల జోళ్లు పంపిణీ చేశారు. మరో 82,157 మందికి దృష్టి లోపం ఉందని గుర్తించారు. ఇందులో 56,227 మందికి  కంటి  అద్దాలు పంపిణీ చేయగా, మరో 878 కంటి అద్దాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మిగతా కంటి అద్దాలు రాగానే దృష్టి లోపం ఉన్న వారందరికి అందజేయనున్నట్లు  వైద్యాధికారులు తెలిపారు. 

మరి శస్త్ర చికిత్సల మాటేమిటి
అట్టహాసంగా శిబిరాలు నిర్వహించి దృష్టి లోపం ఉందని గుర్తించి  తీరా ఆపరేషన్‌ వద్దకు వచ్చేసరికి పట్టించుకోవటం లేదని పలువురు వాపోతున్నారు. కంటి సమస్య తీవ్రంగా ఉందని.. రోజూ ఆస్పత్రికి వెళ్లి ఎప్పుడు చేస్తారని అడుగుతున్నామని బాధితులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు శస్త్ర చికిత్స నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

12.86 లక్షలుకంటి పరీక్ష చేయించుకున్న వారు
1.27లక్షలుకళ్లజోళ్ల పంపిణీ
42,148  శస్త్ర చికిత్సల కోసం సిఫార్సు
520ఇప్పటి వరకు చేసిన కంటి ఆపరేషన్లు
41,628  శస్త్ర చికిత్స కోసంఎదురు చూస్తున్న వారు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top