స్టాల్స్‌ నిర్వాహకులను ఆదుకుంటాం : ఈటల

Etela Rajender Comments On Nampally Exhibition Fire Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)లోజరిగిన అగ్ని ప్రమాద నష్టంపై విచారణ జరుపుతున్నామని, నివేదిక ఆధారంగా స్టాల్స్‌ నిర్వాహకులను ఆదుకుంటామని మాజీ మంత్రి, ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 79ఏళ్ల నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ చరిత్రతలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదన్నారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులతో పాటు సొసైటీ తీవ్రంగా బాధపడుతుందని తెలిపారు. నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. (నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం)

‘షాప్‌ ఓనర్లు ఎన్నో ఏళ్లుగా మాలో ఒక కుటుంబంలా ఉన్నారు. వాళ్లకు నష్టం వచ్చిందంటే మాకు నష్టం వచ్చినట్లే. గొప్ప ఆశయం కోసం ఈ సోసైటీ ఏర్పాటైంది. ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రయివేటు సంస్థ కాదు.. వ్యాపార సంస్థ కాదు.. పేద ప్రజల కోసం పని చేస్తోంది. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం వినియోగిస్తుంది. ప్రతి పైసా విద్యకోసం ఖర్చు పెడుతోంది. జరిగిన సంఘటనను రాజకీయం చేయొద్దు. మొత్తం 300 షాపుల వరకు ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఒక స్టాల్‌ వద్ద అగ్రిప్రమాదం జరగడంతో చుట్టుపక్కల మంటలు చెలరేగాయి. ఇలాంటివి జరగకుండా ఇకపై ఫైర్ ఇంజన్లతో సంబంధం లేకుండా ప్రతి షాప్కు ప్రత్యేకంగా మోటర్ లు ఏర్పాటుచేస్తాం. రాబోయే కాలంలో షాపుల కట్టెలతో కాకుండా దృడంగా ఉండేలా నిర్మిస్తాం. పూర్తి విచారణ జరిగిన తర్వాత ఎవరిది తప్పు అనేది చెబుతాం. ప్రమాదం దృష్ట్యా నేడు, రేపు ఎగ్జిబిషన్‌ను నిలిపివేస్తున్నాం’ అని ఈటల పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top