బడుగులు బాగైతేనే ‘బంగారు తెలంగాణ’

etala rajender in open meeting - Sakshi

ప్రజల కన్నీళ్లు తుడవటం ప్రభుత్వ బాధ్యత: ఈటల  

కులవృత్తుల వారిని ఆదుకుంటాం: జోగు రామన్న

సామాజిక న్యాయం కోసం ఆరె కటికల ‘శంఖారావం’

హైదరాబాద్‌: ‘బలహీనవర్గాలు బాగుపడినప్పుడే బంగారు తెలంగాణ నిర్మాణమైనట్టు’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆరె కటికలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆరె కటికల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్‌ సుధాకర్‌ నేతృత్వంలో గురువారం సరూర్‌నగర్‌ స్టేడియంలో ఆరె కటికల శంఖారావం బహిరంగసభ జరిగింది. ఈటలతోపాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరయ్యారు.

ఈటల మాట్లాడుతూ ‘ప్రజల కన్నీరు తుడవటమే మా బాధ్యత, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఆసక్తిగా చూస్తున్నారు’అని అన్నారు. ఆరె కటికలకు వంద శాతం సబ్సిడీ రుణాలు అందించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో నాన్‌వెజ్‌ మార్కెట్‌లు నిర్మించి ఆరె కటికలకు మార్గం చూపిస్తామని అన్నారు.

ఎన్నికల సమయంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసే సంస్కృతి గతంలో ఉండేదని, ప్రస్తుతం ఆత్మగౌరవ సభలు నిర్వహిస్తున్నారని, హక్కుల కోసం, బతుకు బాగు కోసం ఆత్మగౌరవ జాతరలు జరపటం అభినందనీయమన్నారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ఆరె కటికలకు వాటా ఇస్తేనే సామాజిక న్యాయం అందినట్టని పేర్కొన్నారు.  

మీ డిమాండ్‌ సీఎం దృష్టికి తీసుకెళ్తా
మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కులాలవారీగా సమస్యలు తెలుసుకుని, కులవృత్తుల వారిని ఆదుకుంటున్నారని చెప్పారు. ఆరెకటికల డిమాండ్‌లను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. రూ.500 కోట్లతో ఆరె కటికలకు ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. ఆరె కటికలందరికీ ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల వరకు రుణాలు అందేలా చూస్తామన్నారు.

సుధాకర్‌ మాట్లాడుతూ దేశంలోని 18 రాష్ట్రాల్లో ఆరె కటికలు ఎస్సీ జాబితాలో ఉన్నారని, తెలంగాణలో ఆరె కటికల సంఖ్యను తక్కువగా చూపుతూ అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల మంది ఆరె కటికలున్నా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సభకు భారీసంఖ్యలో ఆరె కటికలు హాజరుకావడంతో బహిరంగ సభాప్రాంగణం జనసందో హంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్‌ సభ్యులు కృష్ణమోహన్, భాగ్యలక్ష్మి, సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top