ఠాణాల్లో రాచ మర్యాదలు! | Establishment of Women Receptionist at Nizamabad District Police Stations | Sakshi
Sakshi News home page

ఠాణాల్లో రాచ మర్యాదలు!

Sep 18 2019 9:50 AM | Updated on Sep 18 2019 9:51 AM

Establishment of Women Receptionist at Nizamabad District Police Stations - Sakshi

కమిషనరేట్‌లో మహిళా రిసెప్షనిస్టుల శిక్షణను పరిశీలిస్తున్న అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌: ఒకప్పుడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలంటేనే భయాందోళన.. పైగా సమస్య చెప్పుకోవడం, లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి. కానీ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు పోలీస్‌స్టేషన్లలో లేవు. ఫిర్యాదుదారులకు పోలీస్‌ స్టేషన్లలో ఎలాంటి సహాయసహకారాలు అయినా అందించేందుకు పోలీసుశాఖ నూతనంగా మహిళ రిసెప్షనిస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ విధానం ఎంతో సత్ఫలితాలనిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 32 పోలీస్‌స్టేషన్లలో మహిళ రిసెప్షనిస్టుల ఏర్పాటు చేసి ఫిర్యాదుదారులకు మరిన్ని సేవలందించేందుకు పోలీసుశాఖ శిక్షణ కల్పించింది.

అనేక విధాలుగా సహాయం
ఠాణాల్లో ఫిర్యాదుదారులకు వివిధ రకాల అభ్యంతరాలు, ఫిర్యాదుల సేకరణ, అభ్యంతరాలు, సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగిన సేవలు అందించడం ప్రధాన ఉద్దేశం. ఇందులో రిసెప్షనిస్టుల పాత్ర ఎంతో ముఖ్యం. దీనికి పోలీసు శాఖ ఈ విధానం కొనసాగిస్తోంది. పోలీసుస్టేషన్లలో రిసెప్షనిస్టుల ఏర్పాటు వల్ల పోలీస్‌ స్టేషన్‌ ను సందర్శించే ప్రతి పౌరుడి సమస్యపై సానుకూలంగా స్పందించి వారి మనస్సులో అభద్రతాభావాన్ని తొలగించి విశ్వాసం పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పోలీస్‌ స్టేషన్‌ అనేది ఒక సేవా కేంద్రం లాంటిదని ప్రతి ఫిర్యాదుదారుడికి తెలియజేసినట్లు అవుతుంది. పోలీస్‌ స్టేషన్‌లోని వివిధ అధికారులను సమన్వయం చేసుకొని వారి విధులు, ప్రజలపై రక్షణ, బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది.

ఈ వ్యవహారంలో రిసెప్షనిస్టుల పాత్ర కీలకంగా మారుతుంది. అందుకే పోలీసుశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ప్రతి రిసెప్షనిస్టు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఈ ఫిర్యాదును సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరిచి ఫిర్యాదుదారుడికి ఆన్‌లైన్‌ ద్వారా రశీదు ఇస్తారు. ఫిర్యాదుదారలు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఫిర్యాదుదారుడికి రిసెప్షనిస్టుల నుంచి సమాచారం చేరవేయడం జరుగుతుంది. ఇందుకు మహిళా రిసెప్షనిస్టులకు కంప్యూటర్‌ శిక్షణ ఇచ్చారు. దీనివల్ల ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ అమలై ఉత్తమ సేవలు అందుతాయి.

ఇప్పటి వరకు 8,824 కేసులు
మహిళా రిసెప్షనిస్టుల వల్ల 32 పోలీస్‌ స్టేషన్లలో ఇప్పటి వరకు 8,824 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. 2018లో 3,803 కేసులు స్వీకరించారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 5,741 కేసులను మహిళా రిసెప్షనిస్టులు సేకరించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఫిర్యాదుదారులు నేరుగా ఫిర్యాదు చేయడంతో తగిన న్యాయం జరుగుతుంది.

రిసెప్షనిస్టులకు శిక్షణ
మహిళా రిసెప్షనిస్టులకు పోలీసు కమాండ్‌ కంట్రోల్‌రూంలో సోమవారం శిక్షణ ప్రారంభమైంది. అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి శిక్షణ ప్రారంభించారు. వీరికి ఫిర్యాదుదారులతో ఎలా మా ట్లాడాలి, వారికి ఎలాంటి సేవలు అందించాలి, తదితర విషయాలను తెలియజేశారు. కేసుల సేకరణ, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వంటి విషయాలను సైతం శిక్షణలో నేర్పనున్నారు.

ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి మెరుగైన సేవలందిస్తాం. పోలీస్‌ స్టేషన్‌ అభద్రతా భావం లేకుండా ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థను కల్పిస్తాం. పోలీస్‌ స్టేషన్‌ ద్వారా ప్రతి ఫిర్యాదుదారుడికి సరైన సహాయం అందుతుంది. అందులో భాగంగా రిసెప్షనిస్టులను అందుబాటులోకి తీసుకువచ్చాం. మంచి సేవలు అందించనున్నాం. – కార్తికేయ, పోలీస్‌ కమిషనర్‌ 

1
1/1

4వ టౌన్‌లో ఏర్పాటు చేసిన రిస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement