breaking news
reception centres in police stations
-
ఠాణాల్లో రాచ మర్యాదలు!
నిజామాబాద్‌అర్బన్: ఒకప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే భయాందోళన.. పైగా సమస్య చెప్పుకోవడం, లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి. కానీ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు పోలీస్స్టేషన్లలో లేవు. ఫిర్యాదుదారులకు పోలీస్ స్టేషన్లలో ఎలాంటి సహాయసహకారాలు అయినా అందించేందుకు పోలీసుశాఖ నూతనంగా మహిళ రిసెప్షనిస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ విధానం ఎంతో సత్ఫలితాలనిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 32 పోలీస్స్టేషన్లలో మహిళ రిసెప్షనిస్టుల ఏర్పాటు చేసి ఫిర్యాదుదారులకు మరిన్ని సేవలందించేందుకు పోలీసుశాఖ శిక్షణ కల్పించింది. అనేక విధాలుగా సహాయం ఠాణాల్లో ఫిర్యాదుదారులకు వివిధ రకాల అభ్యంతరాలు, ఫిర్యాదుల సేకరణ, అభ్యంతరాలు, సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగిన సేవలు అందించడం ప్రధాన ఉద్దేశం. ఇందులో రిసెప్షనిస్టుల పాత్ర ఎంతో ముఖ్యం. దీనికి పోలీసు శాఖ ఈ విధానం కొనసాగిస్తోంది. పోలీసుస్టేషన్లలో రిసెప్షనిస్టుల ఏర్పాటు వల్ల పోలీస్ స్టేషన్ ను సందర్శించే ప్రతి పౌరుడి సమస్యపై సానుకూలంగా స్పందించి వారి మనస్సులో అభద్రతాభావాన్ని తొలగించి విశ్వాసం పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ అనేది ఒక సేవా కేంద్రం లాంటిదని ప్రతి ఫిర్యాదుదారుడికి తెలియజేసినట్లు అవుతుంది. పోలీస్ స్టేషన్‌లోని వివిధ అధికారులను సమన్వయం చేసుకొని వారి విధులు, ప్రజలపై రక్షణ, బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యవహారంలో రిసెప్షనిస్టుల పాత్ర కీలకంగా మారుతుంది. అందుకే పోలీసుశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ప్రతి రిసెప్షనిస్టు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఈ ఫిర్యాదును సీసీటీఎన్ఎస్లో పొందుపరిచి ఫిర్యాదుదారుడికి ఆన్లైన్ ద్వారా రశీదు ఇస్తారు. ఫిర్యాదుదారలు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఫిర్యాదుదారుడికి రిసెప్షనిస్టుల నుంచి సమాచారం చేరవేయడం జరుగుతుంది. ఇందుకు మహిళా రిసెప్షనిస్టులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చారు. దీనివల్ల ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అమలై ఉత్తమ సేవలు అందుతాయి. ఇప్పటి వరకు 8,824 కేసులు మహిళా రిసెప్షనిస్టుల వల్ల 32 పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు 8,824 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. 2018లో 3,803 కేసులు స్వీకరించారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 5,741 కేసులను మహిళా రిసెప్షనిస్టులు సేకరించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఫిర్యాదుదారులు నేరుగా ఫిర్యాదు చేయడంతో తగిన న్యాయం జరుగుతుంది. రిసెప్షనిస్టులకు శిక్షణ మహిళా రిసెప్షనిస్టులకు పోలీసు కమాండ్ కంట్రోల్‌రూంలో సోమవారం శిక్షణ ప్రారంభమైంది. అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి శిక్షణ ప్రారంభించారు. వీరికి ఫిర్యాదుదారులతో ఎలా మా ట్లాడాలి, వారికి ఎలాంటి సేవలు అందించాలి, తదితర విషయాలను తెలియజేశారు. కేసుల సేకరణ, ఆన్లైన్లో నమోదు చేయడం వంటి విషయాలను సైతం శిక్షణలో నేర్పనున్నారు. ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి మెరుగైన సేవలందిస్తాం. పోలీస్ స్టేషన్ అభద్రతా భావం లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కల్పిస్తాం. పోలీస్ స్టేషన్ ద్వారా ప్రతి ఫిర్యాదుదారుడికి సరైన సహాయం అందుతుంది. అందులో భాగంగా రిసెప్షనిస్టులను అందుబాటులోకి తీసుకువచ్చాం. మంచి సేవలు అందించనున్నాం. – కార్తికేయ, పోలీస్ కమిషనర్ -
పోలీసు స్టేషన్లలో ఇక ఆత్మీయ పలకరింపులు
సాక్షి, చీరాల రూరల్: ఏదైనా సమస్యపై పోలీసు స్టేషన్‌కు వెళ్లామంటే అక్కడ ఉన్న పోలీసులు.. బాధితులతో కాస్త కటువుగా మాట్లాడటం ఇప్పటి దాకా చూశాం. అయితే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఆదేశాలతో ఇక నుంచి అటువంటి గదమాయింపులు ఏ పోలీసు స్టేషన్లో వినిపించే అవకాశంలేదు. ఒకవేళ ఎవరయినా పొరపాటున ఆ విధంగా ప్రవర్తిస్తే నేరుగా సీఎం పేషీకి ఫోన్ చేయవచ్చు. ఏదైనా సమస్యపై పోలీసు స్టేషన్లకు వెళ్లిన బాధితులను అక్కడ ఉన్న సిబ్బంది నవ్వుతూ పలకరించాలి..రండి..కూర్చోండి..ముందు మంచినీళ్లు తాగండి ఆ తర్వాత మీ సమస్య ఏమిటో చెప్పండి అంటూ ఆప్యాయంగా పలకరించాలనే ఆదేశాలను జారీచేశారు. అందుకు గాను గతంలో రిసెప్షనిస్టులుగా పురుష పోలీసులు ఉన్న స్థానంలో మహిళా పోలీసులను నియమించారు. మార్పు మంచికే.. రాష్ట్ర సర్కారు సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. పరిపాలనలో కిందిస్థాయి అధికారులు కూడా బాధ్యతా యుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఫిర్యాదు దారులతో మర్యాదగా మెలగటానికి మహిళా పోలీసు కానిస్టేబుళ్లను రిసెప్షనిస్టులుగా నియమించారు. దీంతో ఫిర్యాదు దారులు, బాధితులు పోలీసు స్టేషన్లకు వస్తే ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను, బాధలను, కష్టాలను ఓపికతో విని వారిని ఓదార్చుతున్నారు. దీంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లేవారికి కాస్త ఊరట కలుగుతుండడంతో నూతన ఒరవడిని అమలు చేస్తున్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. చీరాల పట్టణంలోని ఒన్‌టౌన్, టూ టౌన్, ఈపురుపాలెం రూరల్, వేటపాలెం, కారంచేడు పోలీసు స్టేషన్లతో పాటు అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా పోలీసులను రిసెప్షనిస్టులుగా ఏర్పాటు చేశారు. గతంలో కస్సుబుస్సులే.. బాధితులు, ఫిర్యాదు దారులు స్టేషన్‌కు రావడంతోనే విధుల్లో ఉన్న మేల్ రిసెప్షనిస్టులు వారిపై కస్సు బుస్సుమని కసురుకునేవారు. ఎవరైనా చదువులేని వారు స్టేషన్‌కు వస్తే వారి మాటలు సావదానంగా వినేవారు కాదు. పైపెచ్చు బయటకు వెళ్లి ఎవరితోనైనా ఫిర్యాదు రాసుకొని రావాలని ఉచిత సలహాలు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసిన మహిళా రిసెప్షనిస్టులు మాత్రం రండి కూర్చోండంటూ బాధితులను పలకరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. బాధితులు చెప్పే సమస్యలను ఓపిగ్గా వింటూ వారే కాగితంపై ఫిర్యాదు రాస్తున్నారు. రెండు షిఫ్టులుగా.. పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే ప్రతి బాధితునికి మహిళా రిసెప్షనిస్టులు ఫిర్యాదుకు సంబంధించిన రశీదును అందిస్తున్నారు. అలానే ఫిర్యాదు దారులను వారే దగ్గరుండి సంబంధిత సీఐ, ఎస్సైల దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడిస్తున్నారు. ఈ నూతన ప్రక్రియ వలన న్యాయం కోసం స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులు మారిన పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతున్నారు. స్టేషన్లో రిసెప్షనిస్టులుగా విధులు నిర్వర్తించే మహిళా పోలీసులు రెండు షిప్టులుగా పనిచేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు రెండో షిప్టుగా విభజించారు. ఆయా షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే మహిళా రిసెప్షనిస్టులు డ్యూటీ ముగిసే వరకు ఎటూ కదలకుండా కుర్చీల్లో కూర్చుని వచ్చిన ప్రతి ఫిర్యాదితో నవ్వుతూ పలకరిస్తున్నారు. సిబ్బందికి జవాబుదారీ తనం పెరిగింది గతంలో మగ పోలీసులు రిసెప్షనిస్టులుగా ఉండేవాళ్లు. అయితే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రతి స్టేషన్లో మహిళా పోలీసులతో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులను వారు చక్కగా రిసివ్ చేసుకుంటూ బాధితులు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకిస్తున్నారు. బాధితులు చెప్పే మాటలను ఫిర్యాదుల రూపంలో రాస్తున్నారు. రశీదును కూడా అందిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా పుస్తకాన్ని కేటాయించాం. అలానే ప్రతి సోమవారం అన్ని స్టేషన్లలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వన్‌టౌన్ సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు -
ప్రజల సౌకర్యార్థమే రిసెప్షన్ సెంటర్
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సౌకర్యార్థం రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ కార్తికేయ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నాల్గోటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన పోలీస్ రిసెప్షన్ సెంటర్‌ను సీపీ అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి, 6వ డివిజన్ కార్పొరేటర్ పురుషోత్తం, పాంగ్రా గ్రామ సర్పంచ్ భీంసింగ్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో మొదటి రిసెప్షన్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని, ఇందుకు ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో మొదటి విడత కింద ఐదు రిసెప్షన్ సెంటర్లు మంజూరయ్యాయన్నారు. ఇం దులో నిజామాబాద్‌లో రిసెప్షన్ సెంటర్‌ను ప్రారంభం కాగా, ఆర్మూర్, నవీపేట్, మాక్లూర్ పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ సెంటర్లు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయని, త్వరలోనే వీటిని కూడా ప్రారంభిస్తామని సీపీ తెలిపారు. డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ సెంటర్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో, ఎస్ఐ, సిబ్బంది, లాకప్ గదులు, లాకర్లు ఉంటాయి. అయితే పోలీస్‌స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే బాధితులకు ఒక గది ఉండాలని, అందుకు ప్రభుత్వం రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తోందని సీపీ చెప్పారు. వివిధ పనుల కోసం స్టేషన్‌కు వచ్చేవారు స్టేషన్లో ఎస్ఐ లేకుంటే ఆయన వచ్చేంత వరకు స్టేషన్ బయట చెట్ల కింద పడిగాపులు కాసేవారన్నారు.వారు ఇబ్బందులు పడకుండా వచ్చిన పని పూర్తి అయ్యేంతవరకు రిసెప్షన్ సెంటర్లో వేచి ఉండేలా అన్ని వసతులు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. రిసెప్షన్ సెంటర్లో 15 నుంచి 20 మంది వరకు కూర్చునే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇందులో తాగునీటి, టీవీ, పేపర్లు, కు ర్చీలు ఏర్పాటు చేశామన్నారు. సెంటర్లో ఎస్ఐకు ప్రత్యేక గది, కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది సేద తీరేందుకు ప్రత్యేక వసతులు కల్పించినట్లు పేర్కొ న్నారు. రిసెప్షన్ సెంటర్లో సిబ్బంది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారు మొదట రిసెప్షన్ సెంటర్లో సిబ్బందిని కలువాలని, వారు ఏ పనిమీద స్టేషన్‌కు వచ్చారో, స్టేషన్లో ఎవరిని కలుస్తే పని అవుతుందో సూచనలు చేస్తారని, అవసరం అనుకుంటేనే వారిని పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై వద్దకు పంపుతారని తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లకు దశల వారిగా రిసెప్షన్ సెంటర్లు రానున్నాయని సీపీ కార్తికేయ తెలిపారు. కార్యక్రమంలో నగర సీఐ సుభాష్‌చంద్రబోస్, ఎస్ఐలు కృష్ణ, రుక్మావత్ శంకర్, ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. త్వరలోనే మోడల్ పీఎస్‌ను ప్రారంభిస్తాం.. జిల్లాలో తొలి మోడల్ పోలీస్‌స్టేషన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సీపీ కార్తికేయ తెలిపారు. నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌ను మోడల్ పీఎస్‌గా తీర్చిదిద్దేందుకు పనులు కకొనసాగుతున్నాయన్నారు. వచ్చే రెండు వారాల్లో పనులు పూర్తి కాగానే దీనిని ప్రారంభించనున్నట్లు సీపీ తెలిపారు.