పోలీసు స్టేషన్లలో ఇక ఆత్మీయ పలకరింపులు

Female Receptionists To Receive Complaints At Police Stations - Sakshi

పోలీసు స్టేషన్లలో మారిన పద్ధతులు

ఫిర్యాదులు స్వీకరించేందుకు మహిళా రిసెప్షనిస్టులు

రండి... కూర్చోండి... మీ సమస్యేమిటో చెప్పండంటూ ఆత్మీయ పలకరింపులు

ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికీ రసీదు 

సాక్షి, చీరాల రూరల్‌: ఏదైనా సమస్యపై పోలీసు స్టేషన్‌కు వెళ్లామంటే అక్కడ ఉన్న పోలీసులు.. బాధితులతో కాస్త కటువుగా మాట్లాడటం ఇప్పటి దాకా చూశాం. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఆదేశాలతో ఇక నుంచి అటువంటి గదమాయింపులు ఏ పోలీసు స్టేషన్‌లో వినిపించే అవకాశంలేదు. ఒకవేళ ఎవరయినా పొరపాటున ఆ విధంగా ప్రవర్తిస్తే నేరుగా సీఎం పేషీకి ఫోన్‌ చేయవచ్చు. ఏదైనా సమస్యపై పోలీసు స్టేషన్‌లకు వెళ్లిన బాధితులను అక్కడ ఉన్న సిబ్బంది నవ్వుతూ పలకరించాలి..రండి..కూర్చోండి..ముందు మంచినీళ్లు తాగండి ఆ తర్వాత మీ సమస్య ఏమిటో చెప్పండి అంటూ ఆప్యాయంగా పలకరించాలనే ఆదేశాలను జారీచేశారు. అందుకు గాను గతంలో రిసెప్షనిస్టులుగా పురుష పోలీసులు ఉన్న స్థానంలో మహిళా పోలీసులను నియమించారు.

మార్పు మంచికే..
రాష్ట్ర సర్కారు సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. పరిపాలనలో కిందిస్థాయి అధికారులు కూడా బాధ్యతా యుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఫిర్యాదు దారులతో మర్యాదగా మెలగటానికి మహిళా పోలీసు కానిస్టేబుళ్లను రిసెప్షనిస్టులుగా నియమించారు. దీంతో ఫిర్యాదు దారులు, బాధితులు పోలీసు స్టేషన్లకు వస్తే ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను, బాధలను, కష్టాలను ఓపికతో విని వారిని ఓదార్చుతున్నారు. దీంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లేవారికి కాస్త ఊరట కలుగుతుండడంతో నూతన ఒరవడిని అమలు చేస్తున్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.  చీరాల పట్టణంలోని ఒన్‌టౌన్, టూ టౌన్, ఈపురుపాలెం రూరల్, వేటపాలెం, కారంచేడు పోలీసు స్టేషన్లతో పాటు అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా పోలీసులను రిసెప్షనిస్టులుగా ఏర్పాటు చేశారు. 

గతంలో కస్సుబుస్సులే..
బాధితులు, ఫిర్యాదు దారులు స్టేషన్‌కు రావడంతోనే విధుల్లో ఉన్న మేల్‌ రిసెప్షనిస్టులు వారిపై కస్సు బుస్సుమని కసురుకునేవారు. ఎవరైనా చదువులేని వారు స్టేషన్‌కు వస్తే వారి మాటలు సావదానంగా వినేవారు కాదు. పైపెచ్చు బయటకు వెళ్లి ఎవరితోనైనా ఫిర్యాదు రాసుకొని రావాలని ఉచిత సలహాలు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసిన మహిళా రిసెప్షనిస్టులు మాత్రం రండి కూర్చోండంటూ బాధితులను పలకరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. బాధితులు చెప్పే సమస్యలను ఓపిగ్గా వింటూ వారే కాగితంపై ఫిర్యాదు రాస్తున్నారు.

రెండు షిఫ్టులుగా..
పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే ప్రతి బాధితునికి మహిళా రిసెప్షనిస్టులు ఫిర్యాదుకు సంబంధించిన రశీదును అందిస్తున్నారు. అలానే ఫిర్యాదు దారులను వారే దగ్గరుండి సంబంధిత సీఐ, ఎస్సైల దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడిస్తున్నారు. ఈ నూతన ప్రక్రియ వలన న్యాయం కోసం స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులు మారిన పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతున్నారు. స్టేషన్‌లో రిసెప్షనిస్టులుగా విధులు నిర్వర్తించే మహిళా పోలీసులు రెండు షిప్టులుగా పనిచేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు రెండో షిప్టుగా విభజించారు. ఆయా షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే మహిళా రిసెప్షనిస్టులు డ్యూటీ ముగిసే వరకు ఎటూ కదలకుండా కుర్చీల్లో కూర్చుని వచ్చిన ప్రతి ఫిర్యాదితో నవ్వుతూ పలకరిస్తున్నారు. 

సిబ్బందికి జవాబుదారీ తనం పెరిగింది
గతంలో మగ పోలీసులు రిసెప్షనిస్టులుగా ఉండేవాళ్లు. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలతో ప్రతి స్టేషన్‌లో మహిళా పోలీసులతో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులను వారు చక్కగా రిసివ్‌ చేసుకుంటూ బాధితులు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకిస్తున్నారు. బాధితులు చెప్పే మాటలను ఫిర్యాదుల రూపంలో రాస్తున్నారు. రశీదును కూడా అందిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా పుస్తకాన్ని కేటాయించాం. అలానే ప్రతి సోమవారం అన్ని స్టేషన్లలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
వన్‌టౌన్‌ సీఐ ఎన్‌. నాగమల్లేశ్వరరావు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top