మోటార్లకు తగ్గట్టే తిరగనున్న మీటర్లు!

Electricity requirements will be heavily grown for irrigation conduction schemes - Sakshi

రాష్ట్రంలోని సాగునీటి ఎత్తిపోతల పథకాలకు భారీగా పెరగనున్న విద్యుత్‌ అవసరాలు 

6 వేల మెగావాట్లను దాటుతుందని అంచనా వేస్తున్న నీటిపారుదల శాఖ 

కాళేశ్వరంలో 3,800 మెగావాట్ల గరిష్ట అవసరాలుంటాయని అంచనా 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ, మధ్యతరహా ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది నుంచి విద్యుత్‌ అవసరాలు భారీగా పెరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడనుందని నీటిపారుదల, విద్యుత్‌ శాఖలు అంచనా వేస్తున్నాయి. గరిష్టంగా 6 వేల మెగావాట్ల మేర విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని, ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకే గరిష్టంగా 3,800 మెగావాట్లు అవసరం ఉంటుందని గుర్తించాయి. అవసరాలకు తగ్గట్లే విద్యుత్‌ సరఫరా చేసే విషయంపై దృష్టి సారించాయి.  

6 వేల మెగావాట్లు..: రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తయినా, కొనసాగుతున్న 22 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 61.65 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, మరో 27.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తే 12,084 మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరం ఉంటుంది. ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. నీటిని తీసుకునే మోటార్ల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్‌ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి 1,410 మెగావాట్ల మేర విద్యుత్‌ వినియోగిస్తున్నారు. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు రూ.6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి కల్వకుర్తితోపాటు బీమా, నెట్టెంపాడులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లకు వెట్‌రన్‌ నిర్వహిస్తున్నారు. సీతారామలో కొన్ని పంపులైనా నడపాలని భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది నుంచి అదనంగా మరో 4,500 మెగావాట్ల మేర విద్యుత్‌ వినియోగం అదనంగా అవసరం ఉంటుంది. ఇప్పటికే ఉన్న విద్యుత్‌ అవసరాలను కలుపుకొని మొత్తంగా 6 వేల మెగావాట్ల డిమాండ్‌ దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కాళేశ్వరానికే భారీ డిమాండ్‌... 
కాళేశ్వరంలో మేడిగడ్డ మొదలు అన్నిదశల్లో ఉన్న పంప్‌హౌస్‌ల్లో 82 మోటార్లను ఏ ర్పాటు చేస్తుండగా, ఇందులో ప్యాకేజీ–8లో 139 మెగావాట్లు, ప్యాకేజీ–6లో 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భారీ మోటార్లను వాడుతున్నారు. ఈ మొత్తం మోటార్ల ను నడిపించేందుకు 4,800 మెగావాట్ల విద్యుత్‌ అవసరాలను గుర్తించారు. వచ్చే ఖరీఫ్‌లో అన్ని మోటార్లను నడిపించే వీలులేకున్నా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు 70 మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇందులో మేడిగడ్డ మొదలు మిడ్‌మానేరు వరకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకే 1,600 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుందని అధికారులు గుర్తించారు. అనుకున్నది అనుకున్నట్టుగా పనులు పూర్తయితే గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని 6 నెలలపాటు ఎత్తిపోసేందుకు ఈ ఏడాది గరిష్టంగా 3,800 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని ట్రాన్స్‌కో, నీటి పారుదల శాఖలు  అంచనా వేశాయి. జూలై నుంచి నీటిని ఎత్తిపోయనుండగా, జూలైలో 600 మెగావాట్ల విద్యుత్‌ అవసరాలతో మొదలై గోదావరిలో వరద ఎక్కవగా ఉండే అక్టోబర్, నవంబర్, డిసెం బర్‌ నెలల్లో 3,800 మెగావాట్ల డిమాండ్‌ ఉంటుందని తేల్చాయి. దీనికి గాను రెండు శాఖలు ప్రణాళికలు రూపొందించుకోవాలని గురువారం  సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top