ఇక ఓట్ల పండుగ | elections time in telangana | Sakshi
Sakshi News home page

ఇక ఓట్ల పండుగ

Mar 11 2014 2:17 AM | Updated on Sep 2 2017 4:33 AM

ఇక ఓట్ల పండుగ

ఇక ఓట్ల పండుగ

మరో స్థానిక సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

 జాతరలా ఎన్నికలు
 ఉక్కిరిబిక్కిరవుతున్న నాయకులు
 తాజాగా జిల్లా, మండల ప్రాదేశికాలకు నోటిఫికేషన్
 జిల్లాలో 46 జెడ్పీటీసీ, 685 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
 17 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
 ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
 జిల్లాలో  వేడెక్కుతున్న రాజకీయాలు

 
 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్:
 మరో స్థానిక సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 46 జెడ్పీటీసీ, 685 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ నున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు తోడుగా మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. పరిస్థితుల ప్రభావం కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చింది.
 
 ఒకేసారి నాలుగు రకాల ఎన్నికలు రావడంతో అటు ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు, ఇటు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ మేరకు అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నమయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలకుల నియామకం జరగనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ జెడ్పీ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల అధికారిగా జెడ్పీ సీఈఓ వ్యవహరించే అవకాశం ఉంది.  బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తుండడంతో అధికారులు బ్యాలెట్ బాక్సులు సమకూర్చుకోవడంపై దృష్టిసారిస్తున్నారు.
 
 పల్లెల్లో మొదలైన సందడి
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవుల కోసం నిర్వహించే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో గ్రామాల్లో సందడి మొదలైంది. గ్రామాల్లోని ఓటర్లు ఈ దఫా అసెంబ్లీ, పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వేర్వేరుగా అంటే మొత్తంగా నాలుగేసి ఓట్లు వేయనున్నారు. మున్సిపల్ తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. నామినేషన్లకు వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి. టికెట్లు ఆశిస్తున్న ఆభ్యర్థులు ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement