పేదల జాగాకు ‘పెద్దల’ ఎసరు

Elders' to the poor - Sakshi

రూ.8 లక్షల స్థలం కబ్జాకు యత్నం

చక్రం తిప్పుతున్న రియల్టర్‌

పదేళ్ల క్రితం ప్రభుత్వమే అందించిన స్థలం

పట్టా ఉన్నా కాదంటున్న పెద్దమనిషి

సాక్షి, సిరిసిల్లటౌన్‌ :  అది 2007 అక్టోబర్‌ 10 పితృఅమావాస్య. అదే రోజు పితృదేవతలకు సంతర్పణలు సమర్పించుకునేందుకు ముగ్గురు రోడ్డు మీదకు వచ్చారు. ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు వచ్చి వారిని కబళించింది. ఈ సంఘటనలో సిరిసిల్లఅర్బన్‌ మండలం పెద్దూరుకు చెందిన గీతకార్మికుడు చనిపోగా.. వారి కుటుంబానికి ప్రభుత్వం రెండు గుంటలు  పంపిణీ చేసింది. ఇప్పుడు అదే భూమిని ఓ పెద్దమనిషి కబ్జా చేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు.

భూపంపిణీ చేసిన జీవన్‌రెడ్డి
బాధితులు ఆదిపెల్లి భాగ్య, సాగర్‌ కథనం ప్రకారం. పెద్దూరుకు చెందిన ఆదిపెల్లి పర్శరాములు వార్డుసభ్యుడు. పెద్దలకు బియ్యం ఇచ్చేందుకు అయ్యగారి వద్దకు మరో ఇద్దరు బంధువులతో కలసి రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంఓనే ఆర్టీసీ బస్సు ఢీకొని పర్శరాములుతోపాటు మరో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో పర్శరాములు కుటుంబం పేదరికానికి చలించిన అప్పటి సర్కారు.. మంత్రి జీవన్‌రెడ్డి చేతుల మీదుగా గ్రామశివారులోని సర్వేనంబరు 405/1లో రెండుగుంటలు అందజేసింది. భర్త మ రణంతో కొద్దిరోజులు అందులో కాస్తు చేసుకున్న భార్య భాగ్య.. ఇంటిపనుల భారంతో చాలారోజులుగా ఖాళీగా వదిలేసింది. పిల్లల భవిష్యత్‌కు ఉపకరిస్తుందని స్థలాన్ని కాపాడుతూ వస్తోంది.

ఆ స్థలం విలువ రూ.8 లక్షలు
అప్పట్లో ఊరిచివరన ఉన్న ఆ స్థలానికి ఇప్పుడు డిమాండ్‌ వచ్చింది.  ప్రస్తుతం దాని మార్కెట్‌ విలువ సుమారు రూ.8 లక్షలు పలుకుతుంది. దీంతో ఓ రియల్‌వ్యాపారి కన్ను పడింది. తనకు పరిచయమున్న ప్రజాప్రతినిధులు, అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కబ్జా చేశాడు. స్థల యజమాని భాగ్య, ఆమె కుమారుడు సాగర్‌ న్యాయం చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితం సదరు రియల్‌వ్యాపారి ‘స్థలం వదిలించుకుంటే మీకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పిస్తానని’ చెబుతున్నాడు. ‘మా తండ్రి చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమి అది.. దానిని మాకు కాకుండా చేయొద్దు’ అని బతిమిలాడినా వినలేదు. తనపై దాడికి పాల్పడ్డట్లు వారిపై రియల్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 
మంత్రి గారూ ఆదుకోవాలి
అటు పోలీసులు, ఇటు అధికారుల నుంచి తమకు న్యాయం జరగడం లేదని మంత్రి కేటీఆర్‌ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కుటుంబ పెద్దచనిపోతే స్పెషల్‌ కేసు కింద భూమిని సర్కారు తమకు ఇస్తే.. దానిని పెద్దలు కబ్జా చేశారని, తద్వారా తమ కుటుంబం భవిష్యత్‌ ఏమిటని రోదించారు. ఈ విషయంపై కలెక్టర్‌ స్పందించి సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

హద్దులు చూపించాలని ఆదేశాం: రియల్టర్‌
పెద్దూరు శివారులోని 405/1 సర్వేనంబర్‌లో నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. 2007లో గ్రామంలో నెలకొన్న పరిస్థితుల దృష్యా్ట ఆ సర్వే నంబరులో స్థలం లేకున్నా.. రాత్రికి రాత్రే పట్టా తయారు చేయించి పర్శరాములు కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు. రెవెన్యూ సర్వేయర్‌తో వారి స్థలానికి హద్దులు చూపించాలని నేను కోరుతున్నా. నేను ఏ స్థలాన్ని కబ్జా చేయలేదు. నాపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top