కరోనా ఎఫెక్ట్‌ : విద్యా సంస్థలు, మాల్స్‌ మూసివేత

Education Institutions And Malls Closed In Telangana In Wake Of Corona - Sakshi

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాల్స్‌, సినిమా హాల్స్‌ బంద్‌

సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్‌, మాల్స్‌ను కూడా మూసివేయాలని సీఎం నిర్ణయించారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్‌ ప్రకారం జరుగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. (కరోనాపై సీఎం కేసీఆర్ ప్రకటన)

కాగా తెలంగాణలో ఇప్పటికే రెండు కరోనా కేసులు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. గాంధీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య కేంద్రాల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వైరస్‌ లక్షణాలు కనిపించిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అ‍య్యింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల వద్దనే పరీక్షలు నిర్వహిస్తోంది.

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్టాలు సైతం పాఠశాలలు, మాల్స్‌ మూసివేశారు.

  • ముంబైలో థియేటర్లు, మాల్స్‌ మూసివేత
  • గోవాలో మార్చి 31వరకు విద్యాసంస్థలకు సెలవులు
  • కర్ణాటకలో వారంపాటు మాల్స్‌, థియేటర్లు, స్కూల్స్‌, కాలేజీలు బంద్‌
  • బిహార్‌లో మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌
  • ఢిల్లీలో మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత
  • రాజస్థాన్‌లో ఈనెల 30 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్
  • యూపీలో మార్చి 22 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌
  • హర్యానాలో మార్చి 31 వరకు విద్యాసంస్థలు మూసివేత
  • కోల్‌కత్తాలో మార్చి 31 వరకు పాఠశాలలు, మాల్స్‌ మూసివేత
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top