ఎంసెట్‌లో మెరిసిన పల్లె కుసుమాలు

EAMCET Rankers In Karimnagar - Sakshi

హుజూరాబాద్‌ : తెలంగాణ విద్యాశాఖ శనివారం ప్రకటించిన ఎంసెట్‌ ఫలితాల్లో హుజూరాబాద్‌ విద్యార్థులు రాష్ట్ర్‌రస్థాయి ర్యాంకులు సా«ధించి మండలానికి పేరు తెచ్చారు. మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మండల అభిషేక్‌ 783 ర్యాంక్‌ సాధించగా, పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన బోయినపల్లి అనూప్‌రావు 910 ర్యాంక్‌ సాధించాడు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులిద్దరూ గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కావడం విశేషం. పట్టణంలోని మాంటిస్సోరి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల్లో పదో తరగతి పూర్తి చేసి.. ఉన్నత చదవుల కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో విద్యనభ్యసించారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించి భవిష్యత్తులో ఏ కావాలనుకుంటున్నారో  వారి మాటల్లోనే..

తల్లిదండ్రుల సహకారంతోనే
అధ్యాపకులు, తల్లిదండ్రులు సహాదేవ్‌–వసంత సహకారంతో ఎంసెట్‌లో 783 రాష్ట్రస్థాయి ర్యాంక్‌ సాధించాను. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి మంచి ఇంజినీర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. 
– మండల అభిషేక్, 783 ర్యాంక్‌ 

మెకానికల్‌ ఇంజినీర్‌ లక్ష్యం 
అధ్యాపకులు, తల్లిదండ్రులు ఉమాపతిరావు–నవ్యశ్రీ సూచనలు అనుసరిస్తూ 910 రాష్ట్రస్థాయి ర్యాంక్‌ సాధించా. మెకానికల్‌ ఇంజినీర్‌గా రాణించి దేశానికి సేవలందించాలని భావిస్తున్నాను. 
 – బోయినపల్లి అనుప్‌రావు, 910 ర్యాంక్‌  

మొగిలిపేట విద్యార్థికి 813 ర్యాంకు
మల్లాపూర్‌(కోరుట్ల): తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన ఎంసెట్‌ ఫలితాల్లో మల్లాపూర్‌ మండలంలోని మొగిలిపేట విద్యార్థిని ర్యాగల్ల మనీషా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 813 ర్యాంకు సాధించింది. మొగిలిపేటకు చెందిన ర్యాగల్ల వెంకటేశ్వర్‌–గౌతమి దంపతుల ఏకైక కుమార్తె మనీషా మెట్‌పల్లిలోని ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతిలో 9.8 జీపీఏ, కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ కళాశాలలో ఇంటర్మీడియేట్‌లో భైపీసీలో 984 మార్కులతో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. ఎంసెట్‌ ఫలితాల్లో మనీషా రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చడంతో ఎంపీపీ బద్దం విజయ, జెడ్పీటీసీ దేవ ముత్తమ్మ, తహసీల్దార్‌ రాజేశ్వర్, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్, ఎస్సై సతీశ్, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, మండల అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ ఉసికెల మల్లవ్వ, ఎంపీటీసీ దండవేని వెంకవ్వ, ఉపసర్పంచ్‌ ఎనడ్ల రాములు పలువురు ప్రజాప్రతినిధులు,  అధికారులు తదితరులు హర్షం వ్యక్తంచేసి ప్రత్యేకంగా అభినందించారు. 

ప్రతిభచూపిన హర్షవర్ధ్దన్‌

మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్‌ ఎల్మి ప్రదీప్‌ కుమారుడు హర్షవర్దన్‌ శనివారం ప్రకటించిన ఎంసెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో 355 ర్యాంకు సాధించాడు. హర్షవర్దన్‌ 1 నుంచి 5 తరగతి వరకు స్థానిక జయ కాన్వెంట్‌ స్కూల్‌లో చదివాడు. 6 తరగతికి జవహర్‌ నవోదయకు ఎంపికయ్యాడు. అందులోనే 10 తరగతి వరకు చదివి అనంతరం హైదరాబాద్‌ నారాయణ కళాశాల నుంచి ఇంటర్‌ (ఎంపీసీ) పూర్తి చేశాడు. తర్వాత ఐఐటీ(జేఈఈ) ఎంసెట్‌ పరీక్షలకు హాజరయ్యాడు. కొన్ని రోజుల క్రితం జేఈఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 1348 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం ఎంసెట్‌ ఫలితాల్లో 355 ర్యాంకు పొందాడు. ప్రతిభచూపిన హర్షవర్దన్‌ను పలువురు అభినందించారు.  
సత్తాచాటిన జైహింద్‌రెడ్డి

మల్యాల (చొప్పదండి) : మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల మహిపాల్‌రెడ్డి కుమారుడు నల్ల జైహింద్‌రెడ్డి ఎంసెట్‌లో 63 ర్యాంకు సాధించి సత్తాచాటాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చొప్పదండి నవోదయ పాఠశాలలో చదివిన జైహింద్‌ ఇంటర్మీడియేట్‌ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి అభినందించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top