డీఎస్సీకి మోక్షం

DSC recruitment rules are released by telangana govt

నియామక నిబంధనలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మొత్తం పోస్టులు    8,792

వెయిటేజీ ఇలా.. 80% రాత పరీక్షకు.. 20% టెట్‌కు..

‘టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ రూల్స్‌–2017’ పేరిట ఉత్తర్వులు

టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం విద్యార్హతల వర్తింపు

గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్‌లో..

కసరత్తు మొదలు పెట్టిన టీఎస్‌పీఎస్సీ

15 రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం!

పోస్టులు లేని జిల్లాల్లో ఇస్తే పెరగనున్న పోస్టులు!

పలు పోస్టులకు అర్హతలు, నిబంధనల్లో అస్పష్టత ఉందంటున్న ఉపాధ్యాయ సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ.. మంగళవారం నియామక నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ‘టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ రూల్స్‌–2017 (జీవో 25)’పేరిట విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య ఉత్తర్వులు వెలువరించారు. దీంతో పది పదిహేను రోజుల్లో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశముంది. మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే టీఎస్‌పీఎస్సీ సమావేశమై పోస్టుల భర్తీపై చర్చించినట్లు తెలిసింది. మొత్తంగా ఉమ్మడి రాష్టంలో (2012లో) నియామకాలు చేపట్టిన ఐదేళ్ల తరువాత ఇప్పుడు టీచర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి.

నోటిఫికేషన్‌పై కసరత్తు మొదలు..
విద్యాశాఖ ఇప్పటికే కొత్త, పాత జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ వివరాలను టీఎస్‌పీఎస్సీకి పంపించినట్లు తెలిసింది. వాటిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు ఒకటి రెండు రోజుల్లో విద్యాశాఖ అధికారులతో చర్చించి.. అవసరమైన వివరణలు తీసుకోనున్నారు. అనంతరం నోటిఫికేషన్‌ జారీకి సంబంధించిన ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థుల వడపోత కోసం స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహిస్తారా? లేదా ఒకే పరీక్ష నిర్వహించి మెరిట్‌ ప్రకారం ఖరారు చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. దీనిపై టీఎస్‌పీఎస్సీ ఒకటీ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఎస్‌పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించి మెరిట్‌ జాబితాను ఇస్తే 31 జిల్లాల్లో జిల్లా యూనిట్‌గా పోస్టింగ్‌లు ఇస్తారు.

పోస్టులు పెరుగుతాయా?
ప్రస్తుత లెక్క ప్రకారం 8,792 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సుప్రీంకోర్టుకూ ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే ప్రస్తుతం 31 జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో.. కొన్ని పట్టణ జిల్లాల్లో పోస్టులు లేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో పోస్టులను ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. వాస్తవానికి విద్యాశాఖ 2018 వరకు ఏర్పడే ఖాళీల వివరాలను కూడా సేకరించింది. పట్టణ జిల్లాల్లో పోస్టులు లేకుండా నోటిఫికేషన్‌ ఇస్తే ఆయా ప్రాంతాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రభుత్వం భావిస్తే.. అక్కడ 2018 వరకు ఏర్పడే ఖాళీలను కూడా నోటిఫై చేయవచ్చని భావిస్తున్నారు. అదే జరిగి మొత్తంగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య పెరగనుంది.

నియామక నిబంధనల్లోని ప్రధానాంశాలివీ..
– ‘తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ పోస్టుల ప్రత్యక్ష నియామక నిబంధనలు–2017’ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ పాఠశాలల్లోని అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులకు వర్తిస్తాయి.
– జిల్లా విద్యాశాఖాధికారే నియామకపు అధికారి. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం విద్యార్హతలు వర్తిసాయి.
– టీఎస్‌పీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష నిర్వహణ.
– టీఎస్‌ టెట్, సెంట్రల్‌ టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. (2.06.2014 కంటే ముందు ఏíపీ టెట్‌ ఉత్తీర్ణులైన వారూ అర్హులే). స్కూల్‌ అసిస్టెంట్, తత్సమాన పోస్టులకు టెట్‌ పేపర్‌–2, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు టెట్‌ పేపర్‌–1 అర్హత తప్పనిసరి.
– ఉపాధ్యాయ నియామకాల్లో రాతపరీక్షకు 80 శాతం వెయిటేజీ, టెట్‌ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
– వ్యాయామ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు. రాత పరీక్ష 100 శాతం మార్కులకు ఉంటుంది. ఉంటాయి.
– స్కూల్‌ అసిస్టెంట్, తత్సమాన పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ మరియు సంబంధిత మెథడాలజీతో బీఎడ్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 45 శాతం మార్కులు ఉంటే చాలు.
– సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టుల కోసం ఇంటర్మీడియట్‌లో జనరల్‌ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. అలాగే రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) లేదా నాలుగేళ్ల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి.
– 2007 సంవత్సరం నాటికి రెండేళ్ల డీఎడ్‌లో చేరిన జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు సరిపోతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం ఉన్నా చాలు.
– ఏదైనా మాధ్యమం (మీడియం)లో బోధించేందుకు.. భాషేతర సబ్జెక్టుల ఉపాధ్యాయ అభ్యర్థులు టెన్త్‌ లేదా ఇంటర్‌ లేదా డిగ్రీలో సంబంధిత భాషా మాధ్యమంలో చదివి ఉండాలి. లేదా టెన్త్‌లో మొదటి భాషగాను, ఇంటర్‌/ డిగ్రీలో ద్వితీయ భాషగాను చదివి ఉండాలి.
– ఏ మీడియంలో పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంటే.. రాత పరీక్ష (టీఆర్‌టీ) ప్రశ్నపత్రం ఆ మీడియంలోనే ఉంటుంది.
– భాషా పండిట్‌ పోస్టులకు సంబంధిత భాష డిగ్రీలో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం మార్కులతో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా పీజీ అర్హతతోపాటు సంబంధిత మెథాడాలజీతో బీఎడ్, లేదా పండిట్‌ శిక్షణ పొంది ఉండాలి.
– వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు వ్యాయామ విద్యలో డిప్లొమా చేసి ఉండాలి. లేదా డిగ్రీ, బీపీఈడీ చేసి ఉండాలి.
– 2016 అక్టోబర్‌ 10న ఏర్పడిన కొత్త రెవెన్యూ జిల్లాల ప్రాతిపదిపక ఉపాధ్యాయ ఖాళీలను నిర్ణయించి పాఠశాల విద్యా డైరెక్టర్‌ సూచించిన మేరకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.
– జీవో–3 ప్రకారం (10.01.2000) ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులకు స్థానిక గిరిజన అభ్యర్థులు మాత్రమే అర్హులు. మైదాన ప్రాంత పాఠశాలల్లో నియామకాలకు కూడా ఏజెన్సీ గిరిజనులు అర్హులు.
– రాష్ట్ర ప్రభుత్వ సాధారణ సర్వీసు నిబంధనల ప్రకారం గరిష్ట వయసును నోటిఫికేషన్‌లో ప్రకటిస్తారు.
– రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థుల రిజర్వేషన్లు వర్తిస్తాయి. 80 శాతం స్థానిక. 20 శాతం ఓపెన్‌ కేటగిరీ ఉంటుంది.
– ఉపాధ్యాయ నియమాకాలకు సంబంధించి 2009 జనవరి 23న విడుదల చేసిన జీవోలు 11, 12లలోని విద్యార్హతలను ఈ జీవో ద్వారా సవరించారు.

మరింత స్పష్టత అవసరం
ఉపాధ్యాయ నియామకాల నిబంధనల్లో మరింత స్పష్టత అవసరమని ఉపాధ్యాయ సంఘాల నేతలు, అభ్యర్థులు పేర్కొంటున్నారు. మంగళవారం ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం పలు అంశాలపై వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు కేటగిరీల పోస్టులకు సంబంధించిన అర్హతలకు సంబంధించి స్పష్టమైన వివరణలు అవసరమని యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి పేర్కొన్నారు.

స్పష్టత కోరుతున్న అంశాలివే..
– ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) పోస్టుల అర్హతల్లో.. ఇంటర్‌ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఈడీ) పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మినహాయింపు వివరాలు చెప్పలేదు. ఇక అదే పోస్టులకు డిగ్రీతోపాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. కానీ డిగ్రీలో కనీస మార్కుల వివరాలను పేర్కొనలేదు.
– ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం.. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జనరల్‌ అభ్యర్థులు డిగ్రీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, బీఎడ్‌ పూర్తి చేసి ఉండాలని, టెట్‌ పేపర్‌–2 అర్హత సాధించి ఉండాలని పేర్కొన్నారు. అయితే ఎన్‌సీటీఈ ఉత్తర్వులు వచ్చిన 2010 సంవత్సరానికి ముందే డిగ్రీ పూర్తి చేసిన జనరల్‌ అభ్యర్థులకు పరిగణనలోకి తీసుకునే మార్కులను పేర్కొనలేదు.
– ఎస్జీటీ పోస్టులకు అర్హతల్లో.. జనరల్‌ అభ్యర్థులు 2009కు ముందు ఇంటర్‌ పూర్తి చేసి ఉంటే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనా చాలనే స్పష్టత ఇచ్చారు. కానీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీ మార్కుల విషయంలో ఇవ్వలేదు.
– గిరిజన సంక్షేమ పాఠశాలల నియామక ప్రక్రియ అంశాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. వాటికి వేరుగా నిబంధనలు ఇస్తారా? స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
– భాషా సబ్జెక్టు పోస్టులను పండిట్‌ కోర్సులు చేసిన వారికే ఇవ్వాలని ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. కానీ ఏదేని సబ్జెక్టులో పీజీ చేసిన వారు బీఎడ్‌లో ఆ సబ్జెక్టు మెథాడాలజీ చేసి ఉంటే భాషా పండిట్‌ పోస్టుకు అర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇది కొత్త సమస్యకు దారితీసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.  

భర్తీ చేసే టీచర్‌ పోస్టుల వివరాలు..
కేటగిరీ                    తెలుగు/ఇతర మీడియం    ఉర్దూ మీడియం
స్కూల్‌ అసిస్టెంట్‌              1,754                       196
లాంగ్వేజ్‌ పండిట్‌                 985                         26
పీఈటీ                              374                         42
ఎస్జీటీ                            4,779                       636
మొత్తం                           7,892                      900

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top