తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఆ శాఖ డెరైక్టర్ జనరల్ అకున్ సబర్వాల్ తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఆ శాఖ డెరైక్టర్ జనరల్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఇందులో భాగంగా 96 ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో సోదాలు చేసి, పలు అనుబంధ మెడికల్ షాపులను సీజ్ చేయటంతోపాటు, యజమానులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. వివరాలు.. నగరంలోని సెంచరీ హాస్పిటల్ (బంజారాహిల్స్), లోటస్ ఆస్పత్రి (కూకట్‌పల్లి), ఇన్నోవా హాస్పిటల్ (తార్నాక), ల్యాండ్‌మార్క్ ఆస్పత్రి (హైదర్‌నగర్) లతో పాటు జిల్లాల్లో తనిఖీలు చేశారు.
అవి.. ఆదిలాబాద్‌లోని హనుమాన్ ఆస్పత్రి, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని విజయలక్ష్మి క్లినిక్, వరంగల్ జిల్లా హన్మకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ ఆస్పత్రి, కరుణ శ్రీ నర్సింగ్‌హోం, మెదక్ జిల్లా సిద్దిపేటలోని శ్రీనివాస ఆర్థోపెడిక్ ఆస్పత్రి, దేవి నర్సింగ్‌హోం, ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీచంద్రశేఖర హోమియో క్లినిక్, శ్రీవెంకట్రామ నర్సింగ్ హోం, నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని రవి మెడికల్స్, మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎస్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, నవోదయ హాస్పిటల్, నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడలోని డాక్టర్ షైన్ హాస్పిటల్, శ్రీరాజ రాజేశ్వర నర్సింగ్‌హోం తదితర ప్రాంతాల్లో తనిఖీలు సాగాయి.
తనిఖీల సందర్భంగా మందులను అధిక ధరలకు విక్రయించడం, నాణ్యతలేని మందులను విక్రయించడం, కోల్డ్ స్టోరేజ్, పరిశుభ్రత, రికార్డులు సరిగ్గా లేకపోవడం వంటివి గుర్తించారు. కొన్ని ఆస్పత్రుల్లో పేషెంట్లకు 7 రోజుల కోసం మందులిచ్చి నెల రోజులకు ఇచ్చినట్టుగా లెక్కలు చూపించారు. ఆయా ఆస్పత్రుల నిర్వాహకులకు నోటీసులను జారీ చేశారు.
(వెంగళరావునగర్)