‘కంటి వెలుగు’లో నిర్లక్ష్యం

Doctor Negligence In Kanti Velugu Scheme Warangal - Sakshi

హన్మకొండ చౌరస్తా (వరంగల్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకంలో ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్ష్యం బయటపడింది. కాటరాక్ట్‌ సర్జరీలను మమ అనిపించిన వైద్యులు పూర్తిగా చెకప్‌ చేయకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన రోగులు కంటి చూపు సరిగా లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అయితే.. సర్జరీ సరిగా చేయలేకపోయామని గుర్తించిన వైద్యులు మరుసటి రోజే మరోసారి ఆస్పత్రికి రావాలని ఫోన్‌ చేయడంతో వారి నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రోగుల అనుమానమే నిజం కావడంతో ఆస్పత్రికి చేరుకుని షాక్‌కు గురయ్యారు. హన్మకొండలోని జయ ఆస్పత్రిలో జరిగిన ఘటన వివరాలు రోగులు, వారి బంధువులు తెలిపిన ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటి వెలుగు పథకం కోసం క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు చేసిన వైద్యులు, ఆపరేషన్‌ కోసం ఆయా పథకం అమలవుతున్న ప్రైవేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు.

ప్రాథమిక వైద్య పరీక్షలు చేసుకున్న పలువురు శస్త్రచికిత్స చేసుకోవడానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 18 మంది ఈ నెల 26వ తేదీన హన్మకొండ చౌరస్తాలోని జయ ఆస్పత్రి కి చేరుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్‌ లక్ష్మిరమాదేవి నేతృత్వంలో కాటరాక్ట్‌ శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్‌ చేసిన మరుసటి రోజు డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. అయితే.. ఇంటికి వెళ్లిన రోగులు కట్లు విప్పితే చూపు లేకపోవడంతో కంగుతిన్నారు. భయంతోనే ఆ రాత్రి నిద్రపోయిన బాధితులకు ఉదయమే జయ ఆస్పత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. మీరు అత్యవసరంగా మరొకసారి ఆస్పత్రికి రావాలని, చెకప్‌ చేసి పంపిస్తామని సిబ్బంది సమాచారం అందించారు. అప్పటికే కళ్లు కనిపించకపోవడం.. ఆస్పత్రి నుంచి ఫోన్‌ రావడంతో ఆందోళన చెందిన బాధితులు శుక్రవారం హాస్పిటల్‌కు చేరుకున్నారు. అందులో 11 మందికి మరోసారి కాటరాక్ట్‌  రీఆపరేషన్‌ చేశారు. మిగతా ఏడుగురిని పరీక్షించి ఫర్వాలేదని చెప్పారు.

ఆందోళనకు దిగిన బాధితులు..
రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆపరేషన్‌ చేయడంపై భయాందోళనకు గురైన బాధిత బందువులు ఈ విషయంపై ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ప్రజాసేన అవినీతి స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ పుప్పాల రజనీకాంత్‌ ఆస్పత్రికి చేరుకుని రోగులు, వారి బంధువులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని డీఎంహెచ్‌ఓ హరీష్‌రాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి వైద్యులు, కాసుల కక్కుర్తి కోసం మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్రులను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీఎంహెచ్‌ఓ హరీష్‌రాజు కంటి ఆపరేసన్‌ చేసుకున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. హాస్పిటల్‌లోని ఆపరేషన్‌ థియేటర్, ల్యాబ్‌ ను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసేందుకు అన్ని వసతులు ఉన్నాయని.. అయితే జరిగిన తప్పిదానికి జయ హాస్పిటల్‌ యాజమాన్యానికి నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ల్యాబ్‌ను సీజ్‌ చేశారు. 

రెండోసారి ఆపరేషన్‌ ఎందుకంటే చెప్పలేదు..
20 రోజుల క్రితం నయీంనగర్‌ లష్కర్‌సింగారంలో నిర్వహించిన క్యాంపులో కంటి పరీక్షలు చేసుకున్నాను. అక్కడ వైద్యులు ఆపరేషన్‌ చేయాలన్నారు. జయ ఆస్పత్రిలో ఉందంటే ఈనెల 26న ఇక్కడికి వచ్చాం. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్‌ లక్ష్మిరమాదేవి ఆపరేషన్‌ చేసి గురువారం డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లి కట్టు విప్పితే ఏమి కనిపించడం లేదు. అంతలోనే ఉదయం ఆస్పత్రి ఉంచి ఫోన్‌ వచ్చింది. ఇక్కడికి రాగానే మరోసారి ఆపరేషన్‌ చేశారు. ఎందుకు రెండోసారి చేస్తున్నారని అడిగితే ఎవరూ పట్టించుకోలేదు. – హెచ్‌.పద్మ, గిర్నిబావి, దుగ్గొండి, వరంగల్‌ రూరల్‌   

ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశాం
జయ ఆస్పత్రిలో కంటి పరీక్షలకు సంబంధించిన అన్ని పరికరాలు, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు 250 కంటి ఆపరేషన్లు చేశారు. ఈనెల 26న చేసిన 18మందిలో ఆరుగురికి ఈ రోజు ఇన్ఫెక్షన్‌ అయినట్లు గుర్తించి తిరిగి మెరుగైన చికిత్స అందించారు. ఇంకొందరికి తీవ్రత ఎక్కువ ఉన్నట్లు గుర్తించాం. అయినప్పటికీ 18మందిని హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి ముందు జాగ్రత్త చర్యగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాం. జయ ఆస్పత్రి వైద్యుల నిరక్ష్యంపై విచారణ చేస్తాం. నిర్లక్ష్యమని తేలితే చర్యలు తీసుకుంటాం. – హరీష్‌రాజ్, డీఎంహెచ్‌ఓ, వరంగల్‌ అర్బన్‌

ఫోన్‌ చేసి రమ్మంటే వచ్చాను
రెండు రోజుల క్రితం జయ ఆస్పత్రికి వస్తే కంటి ఆపరేషన్‌ చేసి పంపించారు. ఇంటికి పోయిన మరుసటి రోజు ఫోన్‌ చేసి రమ్మంటే వచ్చాను. కంటికి ఇన్ఫెక్షన్‌ అయింది.. ఇంజక్షన్‌ వేయాలని లోపలికి తీసుకెళ్లారు. మత్తు ఇవ్వడంతో ఆపరేషన్‌ చేశారా.. లేదో తెలియడం లేదు. – కందుల మల్లయ్య, రాంనగర్, హన్మకొండ 

మళ్ళీ ఆపరేషన్‌ చేయాలని లోపలికి తీసుకెళ్లారు
రెండు రోజుల క్రితం మా అత్తకు జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్‌ చేసి ఇంటికి పంపించారు. మళ్లీ ఈ రోజు ఫోన్‌ చేసి అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని చెప్పారు. చెకప్‌ చేయాలంటే మా అత్త కొమురమ్మను తీసుకొచ్చాను. రాగానే కంటి పరీక్షలు చేసి.. మళ్లీ ఆపరేషన్‌ చేయాలని లోపలికి తీసుకెళ్లారు. –  అరుణ, బాదితురాలు కొమురమ్మ కోడలు, ములుగు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top