డిండికి నీటిని తరలించొద్దు

Do Not Move Water to Dindi: Palumaru Study Platform - Sakshi

నాగర్‌కర్నూల్‌: పాలమూరు పథకంలో ఎత్తిపోసే నీటిని నల్గొండ జిల్లా పరిధిలోని డిండికి నీటిని తరలించే ప్రయత్న చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక ఉద్యమాల ద్వారా 2013లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి 72 జీఓ సాధించుకున్నామని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్‌ వాళ్లు తొందరపడి జీఓ ఇచ్చారని మంత్రి నిరంజన్‌రెడ్డి వాఖ్యానించడం చూస్తే ఈ జీఓ రావడం ఇష్టం లేనట్లుందన్నారు. అయితే ముందుగా అనుకున్న విధంగా ఎగువ ప్రాంతమైన జూరాల నుంచి కాకుండా దిగువ ప్రాంతమైన శ్రీశైలం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఒకప్పుడు జూరాల నుంచి పాకాలకు నీరు తరలిద్దామని మాట్లాడిన సీఎం కేసీఆర్‌ పాలమూరు పథకానికి జూరాలలో నీరుదొరకదని మాట్లాడడం కేవల వివక్ష మాత్రమే అన్నారు.

దీనివల్ల నార్లాపూర్, ఏదుల, వట్టెం, రిజర్వయర్లలో భూములు, ఇళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఎదుల నుంచి డిండికి నీటిని తరలించేందుకు పాలమూరు–డిండి పథకాన్ని ప్రారంభించారని దీని వల్ల ఉల్పర, సింగరాజు పల్లి, ఎర్రవల్లి, ఇర్విన్‌ రిజర్వాయర్లకు వేలాది ఎకరాల కల్వకుర్తి ఆయకట్టు మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. ఏదుల రిజర్వాయర్‌ నుంచి నల్గొండ జిల్లా శివన్నగూడెం ప్రాంతానికి నీరు తలించే ప్రక్రియను కృష్ణ నీటితో కాకుండా కాళేశ్వరం నీటితో చేయాలన్నారు. శివన్న గూడెం 385 మీటర్ల ఎత్తులో ఉండగా కాళేశ్వరం పథకం పరిధిలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌ 490 మీటర్ల ఎత్తులో ఉన్నందున గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం సులభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు నుంచి డిండికి నీళ్లు తీసుకెళ్లం అని ప్రకటించినా పనులు మాత్రం వేగవంతంగా జరగుతున్నాయని అన్నారు.

 గోదావరి నీటిని ఖమ్మం, నల్గొండ జిల్లాలతోపాటు రంగారెడ్డి జిల్లాదాకా తెచ్చే ప్రణాళికలను రూపొందించాలన్నారు. అదే విధంగా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. మల్లన్న సాగర్‌లో ఇచ్చిన పరిహారం ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  యురేనియం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. అమెరికా లాంటి దేశాలే యురేనియం పై నిషేదం విధించాయన్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో కలిసి నల్లమలలో తిరుగుతున్నామని, యురేనియం వల్ల ఏం నష్టం జరగబోతుందో ప్రజలకు వివరిస్తామన్నారు. సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు శంకర్, అశోక్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top