వైద్యం బదలాయింపు.. | district a range of medical health department medical office merger in andhra | Sakshi
Sakshi News home page

వైద్యం బదలాయింపు..

May 31 2014 2:22 AM | Updated on Sep 2 2017 8:05 AM

జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో అక్కడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని వైద్య విభాగ కార్యాలయాలు సీమాంధ్రలో కలవనున్నాయి.

ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో అక్కడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని వైద్య విభాగ కార్యాలయాలు సీమాంధ్రలో కలవనున్నాయి. అక్కడ పనిచేస్తున్న 437 మంది సిబ్బంది జిల్లా కేంద్రానికి తిరిగి రానున్నారు. ఆ ఏడు మండలాల్లోని ఎనిమిది పీహెచ్‌సీలు, 44 సబ్‌సెంటర్లు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆధీనంలోకి వెళ్తాయి. ఏడు మండలాల్లో 17 క్లస్టర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోకి మూడు క్లస్టర్లు వెళ్తున్నాయి. ఈ హెల్త్‌సెంటర్లలో ప్రస్తుతం 520 పోస్టులు ఉండగా 437 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాలు మూడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు ఎనిమిది, సబ్‌సెంటర్ భవనాలు 44, ప్రసూతి భవనాలు నాలుగు, ఉద్యోగుల క్వార్టర్లు ఏడు ఏపీలోకి వెళ్తున్నాయి.

 జిల్లా కేంద్రానికి రానున్న ఉద్యోగులు...
 జిల్లా కేంద్రానికి రిపోర్టు చేయనున్న ఆ ఏడు మండలాల్లోని ఉద్యోగుల వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ -1, మెడికల్ ఆఫీసర్-17, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ -2, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్-1,  పబ్లిక్ హెల్త్ నర్సు -1, కంటి వైద్యానికి సంబంధించిన ఆఫీసర్లు -2, హెల్త్ ఎడ్యుకేటర్స్-2,  హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్-7, హెడ్‌నర్సులు-2, స్టాఫ్ నర్సులు -29, హెల్త్ సూపర్‌వైజర్స్ (పురుషులు)-4, హెల్త్ సూపర్‌వైజర్స్ (మహిళలు)- 11, సీనియర్ అసిస్టెంట్స్-4, ఏఎన్‌ఎంలు-33, సెకండ్ ఏఎన్‌ఎంలు -39, ఏఎన్‌ఎంలు(పురుషులు)- 24, జూనియర్ అసిస్టెంట్ -2, ఫార్మసిస్ట్-12, ల్యాబ్‌టెక్నీషియన్స్ -13, కంప్యూటర్ ఆపరేటర్స్-2, క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ -14, డ్రైవర్లు -5, డీఈఓ -3, సెక్యూరిటీ గార్డ్స్-3, ఆశ వర్కర్లు-204 మందిని డీఎంహెచ్‌వో కార్యాలయంలో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

 ఇప్పటికిప్పుడు వీరిని జిల్లాకేంద్రానికి రప్పించడం వల్ల అక్కడి రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మూడు, నాలుగునెలల వరకు వీరిని కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రి మాత్రం జిల్లాలోనే ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాల్లోని 136 గ్రామాలు, 211 కుగ్రామాలకు చెందిన 1,16,796 మంది ప్రజలు ఈ హెల్త్ సెంటర్లలో వైద్యసేవలు పొందుతున్నారు. ఇప్పుడు వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది.

 విలీనంతో చిక్కులు...
 ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాల ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటి వరకు వారికి అత్యంత దగ్గరగా భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఉండేది. పెద్ద ప్రమాదం సంభవిస్తే దగ్గరిలో కొత్తగూడెంలో సింగరేణి ప్రధానాస్పత్రి, ప్రభుత్వాస్పత్రి, జిల్లాకేంద్రప్రభుత్వాస్పత్రికి వచ్చేవారు. ఇప్పుడు వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు, తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రికి వెళ్లాల్సి ఉంటుంది. అంతదూరంలోని ఆస్పత్రులకు వెళ్లడం కష్టమని గిరిజనులు వాపోతున్నారు. ఏజెన్సీలోని ఆ ఏడు మండలాల్లో వర్షాకాలంలో ఎక్కువగా విషజ్వరాలు వస్తుంటాయి. అటువంటి సమయంలో జిల్లా వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి సకాలంలో వైద్యం అందించే వారు..ఇకమీదట ఆ పరిస్థితి ఉండకపోవచ్చని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement