నేపాల్‌లో జట్టుకడుతున్న 10 పార్టీలు
కాఠ్మండు: నేపాల్‌లో మార్చి ఐదో తేదీన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా 10 లెఫ్ట్ పార్టీలు విలీనం కావాలని నిర్ణయించుకున్నాయి. విలీనం కాబోతున్న పార్టీల్లో సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్), సీపీఎన్(యునిఫైడ్ సోషలిస్ట్) సైతం ఉన్నాయి. కాఠ్మండులోని బ్రికుతిమండప్‌లో బుధవారం ఈ మేరకు పది పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. నేపాల్‌లో దశబ్దాల తరబడి పోరాడిన మావోయిస్ట్ సెంటర్ పార్టీ ఇకపై విలీనం తర్వాత తన పేరులోని మావోయిస్ట్ అనే పదాన్ని తొలగించుకోనుంది.
దేశంలో అవినీతి, వారసత్వ రాజకీయలు, రాజకీయ అస్థిరతలతో విసిగిపోయిన జెన్ జెడ్ యువత సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ ధాటికి ప్రభుత్వం కుప్పకూలడం తెల్సిందే. ఇదే ఊపులో జెన్ జెడ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్న అంచనాలతో 10 లెఫ్ట్ పార్టీలు ఇలా ఒకే రాజకీయ పార్టీగా అవతరిస్తుండటం గమనార్హం. కొత్త పార్టీకి నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ అని పేరు పెట్టనున్నారు. ఎన్నికల చిహ్నంలో ఐదు నక్షత్రాల గుర్తు ఉండనుంది. సీపీఎన్ నేత, మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ దహాల్ ప్రచండ కొత్త పార్టీకి కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు.


