నేటి నుంచి మహాసభల కిట్ల పంపిణీ

Distribution of telugu mahasabalu kits from today - Sakshi

మొదటి రోజు 2,000 మందికి అందజేత

విదేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారికి హోటళ్లలోనే పంపిణీ

సమీప జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు

సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలను న భూతో న భవిష్యత్‌ అన్నట్టుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదిక నిర్మాణం, ఎనిమిది స్వాగత ద్వారాల ఏర్పాటు, ప్రత్యేక అలంకరణ, మహనీయుల హోర్డింగ్‌లు తదితర ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. మరోవైపు గురువారం నుంచే ప్రతినిధులకు మహాసభల కిట్‌లు, పాస్‌లను అందజేసేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రవీంద్రభారతిలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన 2000 మంది ప్రతినిధులకు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కిట్‌లను అందజేస్తామన్నారు. జిల్లాల నుంచి వచ్చేవారు నగరానికి చేరుకుని ఉంటే.. వాళ్లు కూడా రవీంద్రభారతిలో కిట్‌లను పొందవచ్చని, శుక్రవారం మధ్యాహ్నం వరకు రవీంద్రభారతిలో కిట్‌లను అందజేస్తారని చెప్పారు. ప్రతినిధులు తమ వద్ద ఉన్న స్లిప్పు, వరుస సంఖ్య చెబితే చాలు.. కిట్‌ అందజేస్తారన్నారు. విద్యా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కిట్‌ల పంపిణీని పర్యవేక్షిస్తారు.

విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు.. వాళ్లు బస చేసే హోటళ్లలోనే కిట్‌లను అందజేస్తారు. సుమారు 8 వేల మంది ప్రతినిధులు, మరో 1,500 మంది అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు మహాసభల్లో పాల్గోనున్నారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే 6,000 మంది ప్రతినిధులకు నగరంలోని పలు హోటళ్లలో బస కల్పించారు. వారికి అక్కడే భోజనం, వసతి ఉంటాయి. అక్కడి నుంచి వేదికలకు వెళ్లేందుకు అకాడమీయే రవాణా సదుపాయాన్ని కల్పించనుంది.

వెయ్యి మంది వలంటీర్లు..
మహాసభల సందర్భంగా ప్రతినిధులకు, అతిథులకు కావలసిన సదుపాయాలను అందజేసేందుకు సాహిత్య అకాడమీ వెయ్యి మంది పరిశోధక విద్యార్థులను వలంటీర్లుగా నియమించింది. వీరు మహాసభల టీషర్టులు, టోపీలు ధరించి ప్రతినిధులకు, అతిథులకు అందుబాటులో ఉంటారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం, ప్రముఖులకు తగిన సేవలు అందజేసేందుకు టూరిజండెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సుమారు 700 మందిని వినియోగించనున్నారు. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న జిల్లాలకు 20 నుంచి 30 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. తెలుగు అధ్యాపకులు, భాషా పండితులు, ప్రతినిధులు, రచయితలు, కవులు వీటిలో ఉచితంగా హైదరాబాద్‌ చేరుకునే సదుపాయం కల్పిస్తారు.

ప్రధాన వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు..
ఎల్బీ స్టేడియంలోని ప్రధాన వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్యఅతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పూర్ణకుంభం, మంగళవాద్యాలతో వేదిక వద్దకు సాదరంగా తోడ్కొని వస్తారు. రాష్ట్ర గవర్నర్‌ సరసింహన్, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, సీఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి స్వాగతోపన్యాసం చేయనున్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. 10 వేల మంది ప్రతినిధులు కూర్చునేందుకు ఏర్పాటు చేయనున్నారు. మరో 20 వేల మంది సాధారణ ప్రజల కోసం గ్యాలరీలో సీట్లు ఏర్పాటు చేయనున్నారు.

తీర్మానాలు ఇవీ..
మహాసభల సందర్భంగా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగు బోధించాలనే తీర్మానం ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో నామ ఫలకాలు తప్పనిసరిగా తెలుగులోనే ఏర్పాటు చేయాలి.
అధికార భాషా సంఘాన్ని బలోపేతం చేయాలి.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలి.
వీటితో పాటు మరికొన్ని తీర్మానాలు ఉండే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top