‘ఉపాధి’ పనుల్లో అవకతవకలు

Disappointment In 'Employment' Activities - Sakshi

సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడ్డ అక్రమాలు 

విచారణకు ఆదేశించిన ప్రిసైడింగ్‌ అధికారి కరుణాకర్‌రెడ్డి

సాక్షి, పాల్వంచరూరల్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నిర్వహించిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడ్డాయి. అవకతవకలపై ఈజీఎస్‌ ప్రిసైడింగ్‌ అధికారి కరుణాకర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. అవకతకలు జరిగిన పంచాయతీల్లో లక్షా నాలుగువేల  రూపా యలు రికవరీ చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం  ఓపెన్‌ఫోరం జరిగింది. ఈజీఎస్‌ కింద 2017 డిసెంబర్‌ 1నుంచి 2018 జనవరి 31 వరకు మండలంలోని 11 పంచాయతీలలో జరిగిన రూ.6 కోట్ల 5 లక్షల19వేల 516 విలువగల పనులు నిర్వహించారు. ఈ పనుల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో అవకతవకలు వెలుగుచూశాయి.

పనులకు రాకున్నా కూలీలకు మస్టర్లు వేసినట్లు, తీర్మానాలు లేకున్నా అనుమతులు ఇవ్వకున్నా అధికంగా భూమి చదును పనులు నిర్వహించారు. మృతి చెంది మూడు సంవత్సరాలైన కూలీకి వేతనం చెల్లించినట్లు, తక్కువ పనులు చేసి ఎక్కువ పని చేసినట్లుగా ఎంబీలో రికార్డులు నమోదు చేసి నట్లు, రైతులకు ఇచ్చిన మొక్కలు సగం కూడా బతకకపోవడం, చేసిన పనుల వద్ద ఉపాధి నేమ్‌ బోర్డులను ఏర్పాటు చేయక పోవడం వంటి పలు అక్రమాలు బయటపడ్డాయి. యానంబైల్‌ పంచా యతీలో పట్టా పాస్‌పుస్తకాలు, ఇతర ఆధారులు లేకుండానే భూమి లెవల్‌ పనులు నిర్వహించారని, ఎక్కడ ఎంత పని చేశారో కూడా రికార్డులో రాయకపోవడం, ప్లే స్లిప్‌లు పంపిణీ చేయలేదు. వంద రోజులు దాటిన తర్వాత కూడా కొంతమంది కూలీలకు పనులు కల్పించి వేతనాలు చెల్లించారు.

ఎడ్ల ఉమ అనే కూలి 18 రోజులు కూలీ పనులు చేసిన వేతనం చెల్లించలేదు. మరి కొంతమంది జాబ్‌కార్డులు అడిగినా ఇవ్వలేదు. ఏపీఓ, ఎంపీడీఓ సంతకాలు లేకుండానే మస్టర్ల పేమెంట్‌ చేశారని, పనిచేయని కూలీకి రూ.421 వేతనం చెల్లించారని, గొగ్గిల శంకర్‌ అనే కూలీ మూడు సంవత్సరాల క్రితం మృతి చెందినా 6 రోజుల వేతనం చెల్లించినట్లు  వెలుగు చూశాయి. దీనిపై విచారణ జరపాలని ప్రిసైడింగ్‌ అధికారి ఆదేశించారు. 37 మంది కూలీలకు రూ.7,450 అడ్వాన్స్‌ పేమెంట్‌ చేసిన విషయం బయటపడింది. సోములగూడెం పంచాయతీలో రూ.1 కోటి 73 లక్షల మంజూరు కాగా ఇందులో కేవలం రూ.77 లక్షల75 వేల పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకుడు గుంత నిర్మాణం చేయని పద్మ అనే మహిళకు పేమెంట్‌ చేశారు. ఒకేరోజు ఒక కూలీకి రెండు మస్టర్లు వేశారు. రెండు రోజులు పనిచేసిన ఒక కూలీకి ఒక రోజు వేతనం చెల్లించారు.

లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో, సోములగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో కూలీలతో చేయాల్సిన గంతులు తీసే పనులను యంత్రాల సహాయంతో నిర్వహించినట్లు బయటపడింది. దీనిపై విచారణ జరపాలని ప్రిసైడింగ్‌ అధికారి ఆదేశాలు జారీచేశారు.  నీటికుంట నిర్మాణంలో 5.25 క్యూబిక్‌ మీటర్లు నిర్మాణం జరుగగా ఎంబీ రికార్డులో మాత్రం 6.04 క్యూబిక్‌ మీటర్లు నమోదు చేసినట్లు బయటపడటంతో విచారణకు ఆదేశించారు. పాండు రంగాపురంలో కూడా మస్టర్లలో అవకతవకలు జరిగినట్లు వెలుగుచూశాయి. ఇలా మిగిలిన పం చాయతీలో కూడా పలు అవకతవకులు జరి గాయి. కార్యక్రమంలో ఈజీఎస్‌ ఏడీలు రాం మోహన్, మధుసూదన్‌రాజు, డీవీఓ. సీహెచ్‌.వెంకటేశ్వర్లు, ఎన్‌.భాస్కర్‌రావు, అనిల్‌కుమార్, ఎంపీడీఓలు అల్బర్ట్, ధన్‌సింగ్, సీఆర్‌పీ  సీహెచ్‌. గంగరాజు, ఏపీఓ.రంగా  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top