ఏపీలో 18.63 లక్షల మంది జాబ్ కార్డులు తొలగించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పోర్టల్‌లో నమోదైన వివరాలు
కనీస సమాచారం ఇవ్వకుండా ఎడాపెడా జాబ్‌కార్డుల తొలగింపు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 18.63 లక్షల కార్డులు ఔట్
గత 40 రోజుల్లోనే ఏకంగా 16 లక్షల కార్డులపై దెబ్బ
ఉపాధి పనులకు దూరమై అల్లాడుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలు
పేదల ఉపాధిలోనూ గ్రామాల్లో చిచ్చు రగిలిస్తున్న అధికార పార్టీ నేతలు..
ఈ–కేవైసీ ప్రక్రియ ముసుగులో వందల కొద్దీ కార్డుల ఏరివేత
తమకు గిట్టనివారి, ప్రత్యర్థి పార్టీ మద్దతుదారుల జాబ్‌కార్డులు ఇష్టానుసారంగా తొలగింపు
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామసభలో చర్చించాకే తగిన నిర్ణయం తీసుకోవాలి
లబ్ధిదారులు ఉపాధి పనులకు రావడం లేదని జాబ్ కార్డులు తొలగించకూడదు..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే గ్రామాల్లో ‘ఉపాధి’ కరువు.. పనిదినాల్లో కోతలు
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య 233 నిరుపేద కుటుంబాల ఉపాధి హామీ జాబ్ కార్డులను చంద్రబాబు ప్రభుత్వ తొలగించింది. మార్చిలో గ్రామంలో 570కి పైగా జాబ్‌కార్డులు ఉండగా ఇప్పుడు 346 మాత్రమే మిగిలాయి. కార్డుల తొలగింపుపై కనీస సమాచారం ఇవ్వలేదని బాధితులు ‘సాక్షి’ ఎదుట వాపోయారు.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ట మండలం పెదారికట్లలో గత ఏడున్నర నెలల వ్యవధిలో 350 కుటుంబాల ఉపాధి జాబ్ కార్డులను తొలగించారు. గ్రామంలో ఇప్పుడు 820 కార్డులే మిగిలాయి.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లిలో 247 కుటుంబాల జాబ్ కార్డులను తొలగించారు.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురంలో 337 కుటుంబాల జాబ్ కార్డులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది.
కర్నూలు జిల్లా గొనెగండ్ల మండలం గంజిహలిలో ఏప్రిల్ నుంచి 421 కుటుంబాల జాబ్‌కార్డులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది.
కాకినాడ జిల్లాలో 73,359, అన్నమయ్య జిల్లాలో 67,485, ప్రకాశం జిల్లాలో 50,926, కర్నూలు జిల్లాలో 44,499, శ్రీసత్యసాయి జిల్లాలో 40,785 కుటుంబాలు.. ఇలా ప్రతి చోటా వేల కుటుంబాల ఉపాధి హామీ జాబ్‌కార్డులను గత ఏడున్నర నెలల వ్యవధిలో బాబు ప్రభుత్వం ఊడగొట్టింది!
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలన్నింటినీ నీరుగార్చి, పేదలను నిలువునా ముంచిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ఉపాధి హామీ’ని కూడా నిరుపేదలకు దక్కకుండా చేçస్తూ పేదల పొట్టకొడుతున్నారు. నిరుపేద కుటుంబాలకు కనీసం సమాచారం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులను తొలగిస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్‌పోర్టల్ వివరాల ప్రకారమే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18.63 లక్షల మంది జాబ్ కార్డులను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది.
ఒక్క అక్టోబరు 8వ తేదీ నుంచే దాదాపు 16 లక్షల మంది పేదలు జాబ్‌కార్డులు కోల్పోయినట్లు వివిధ స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ముసుగులో చాలా గ్రామాల్లో అధికార టీడీపీ నేతలు తమకు గిట్టనివారితోపాటు ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారుల జాబ్‌కార్డులను ఇష్టానుసారంగా తొలగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో అధికార పార్టీ నేతలు సూచించిన వారిని నియమించింది. వీరంతా జాబ్ కార్డుల తొలగింపులో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

జాబులు లేవు.. జాబు కార్డులూ మాయం!
రాష్ట్రంలో యాక్టివ్ జాబ్ కార్డులున్న దాదాపు 48 లక్షల కుటుంబాలకు చెందిన 75 లక్షల మంది నిరుపేదలు ఏటా ఉపాధి హామీ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. పథకం ద్వారా దాదాపు రూ.7 వేల కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. పథకం ఖర్చులో 90 శాతం మేర కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఓ కుటుంబంలో ఎవరైనా ఉపాధి పనులకు హాజరు కావాలంటే జాబ్‌కార్డు ఉండాలి. ఒకసారి జాబ్ కార్డు మంజూరు చేశాక తొలగించాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఏడాది ఆగస్టు ఒకటిన ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు తొలగింపు నిబంధనలపై రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక జవాబు..
అంతేగానీ సాధారణ పద్ధతిలో జాబ్‌కార్డులు తొలగించకూడదని మాస్టర్ సర్క్యులర్ 3.4లో పేర్కొంది. గ్రామసభ నిర్వహించి బహిరంగ చర్చ అనంతరమే తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. కొద్ది రోజులు పనులకు హాజరు కాకపోయినా జాబ్‌కార్డులు తొలగించవద్దని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. ఆధార్, బ్యాంకు ఖాతాలతో లింక్ చేసుకోలేదనే కారణాలతో జాబ్‌కార్డులు రద్దు చేసే నిబంధన ఏదీ లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించింది.
జాబ్‌కార్డులపై కేంద్రం నిబంధనలివీ..
⇒ఏ జాబ్‌కార్డునూ సాధారణ పద్ధతిలో రద్దు చేయకూడదు.
⇒పనులకు డిమాండ్ లేకపోవడం లాంటి కారణంతో రద్దు చేయకూడదు.
⇒జాబ్ కార్డులున్న కుటుంబం ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లడం, నకిలీ అని నిరూపణ కావడం, నకిలీ పత్రాల ఆధారంగా నమోదు చేయడం లాంటి సందర్భాల్లో మాత్రమే తగిన ధ్రువీకరణ తరువాతే తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలి
⇒జాబ్‌కార్డుకి సంబంధించి చేర్పులు/తొలగింపులు/రద్దులను బహిరంగంగా ప్రకటించి గ్రామసభ/వార్డు సభకు సమర్పించాలి. ప్రోగ్రామ్ అధికారికి నివేదించాలి.
‘ఉపాధి’కి బాబు సర్కార్ కోత!
⇒రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – సెప్టెంబరు మ«ధ్య ఉపాధి హామీ పనుల కల్పన తగ్గడం వల్ల ఆర్నెల్ల వ్యవధిలో ఏకంగా రూ.435.40 కోట్ల మేర నష్టపోయినట్లు లిబిటెక్ లాంటి స్వచ్ఛంద సంస్థలు నిర్ధారించాయి.
⇒గత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్లలో ఉపాధి హామీ ద్వారా 17.95 కోట్ల పనిదినాలు కల్పించగా ఇప్పుడు అదే సమయంలో 15.51 కోట్ల పనిదినాల
కల్పన మాత్రమే జరిగింది.
⇒ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధి హామీ లబ్ధిదారులు గత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్లలో నాలుగు కోట్ల పనిదినాలు పొందగా ఈ ఏడాది 3.23 కోట్ల పనిదినాలు మాత్రమే లబ్ధి పొందారు. మొత్తంగా ఎస్సీలు 18.7 శాతం మేర ఉపాధి కోల్పోయారు. పని దినాలు తగ్గిపోవడంతో ఎస్టీలు 17.6 శాతం, ఇతరులు 11.3 శాతం మేర ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది.


