అసమ్మతి సెగలు | Disagreement MLA Candidates In Khammam | Sakshi
Sakshi News home page

అసమ్మతి సెగలు

Oct 3 2018 7:13 AM | Updated on Oct 3 2018 7:13 AM

Disagreement  MLA Candidates In Khammam - Sakshi

సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): టీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ప్రకటన తర్వాత నెమ్మదిగా బయటపడిన అసమ్మతి ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది. సిట్టింగులకే టీఆర్‌ఎస్‌ టికెట్లు ఇవ్వడంతో వివిధ పార్టీల నుంచి వచ్చిన ఆశావహులు భగ్గుమన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేని సమయంలో పార్టీ నుంచి పోటీచేసిన వారు సైతం ఈసారి టికెట్లు ఆశించారు. అయితే సిట్టింగులకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రకటించిన అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఇప్పటికీ అసమ్మతి సెగలు చల్లారలేదు. గత ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అసమ్మతులు రెండు రోజుల్లో సర్దుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా అసంతృప్తి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో మరింతగా రగులుకుంటోంది. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య  సోమవారం టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.

ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తుమ్మల అనుచరుడిగా ఉన్న అబ్బయ్య రాజీనామా చేసిన తెల్లవారే (మంగళవారం) ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో 30 మంది టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. వీరిలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. గత ఎన్నికల్లో కోరం కనకయ్యకు శ్రీనివాస్‌ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇల్లెందు నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. కాగా గతంలో సీపీఐ తరపున బూర్గంపాడు ఎమ్మెల్యేగా, ఇల్లెందు నుంచి ఒకసారి సీపీఐ తరపున, మరోసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఊకె అబ్బయ్య టికెట్‌ అంశం ప్రస్తావనకు రాకుండా బేషరతుగా కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

∙పినపాక నియోజకవర్గంలో సైతం రాజకీయ సమీకరణలు మారే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి నుంచి బూర్గంపాడు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వట్టం రాంబాబు, బూర్గంపాడు జెడ్పీటీసీ బుట్టా విజయ్‌గాంధీ టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని, అభ్యర్థిని మార్చాలని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. టికెట్ల ప్రకటన తరువాత కూడా వారు అదే పంథాలో ఉన్నారు. అభ్యర్థిని మార్చి వేరెవరికి టికెట్‌ ఇచ్చినా సహకరిస్తామని, పాయంనే బరిలో ఉంచితే ఓడిస్తామని చెబుతున్నారు. వట్టం రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అసమ్మతి కార్యకర్తలు సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే వట్టం రాంబాబును రెబల్‌ అభ్యర్థిగా బరిలో దించేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో పినపాక నియోజకవర్గంలోనూ రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి పనిచేస్తున్న ఉద్యమకారులు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీతో పాటు అభ్యర్థులపై గుర్రుగా ఉన్నారు.

∙ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్‌ కూటమిలో పేర్లు ప్రకటించిన తర్వాత మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్ల రేసులో పోటీ తీవ్రంగా ఉంది. కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ మధ్య పోటీ తీవ్రంగా ఉండగా, సీపీఐ ఈ సీటును గట్టి గా కోరుతోంది. అశ్వారావుపేట నుంచి కారం శ్రీ రాములు, కోలా లక్ష్మీనారాయణ, ధన్‌జూనాయ క్, సున్నం నాగమణి, బాణోత్‌ పద్మావతి పోటీ పడుతున్నారు. ఇల్లెందు నుంచి చీమల వెంకటేశ్వ ర్లు, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, బాణోత్‌ హరిప్రి య, డాక్టర్‌ రామచందర్‌నాయక్‌ పోటీలో ఉన్నా రు. అయితే కొత్తగూడెం, ఇల్లెందు నుంచి టికెట్లు రానివారు రెబల్‌గా అయినా సరే పోటీలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement