ఉపకారానికి ‘ఐఎఫ్‌ఎస్‌సీ’ బ్రేకులు

Difficulties In Scholarship Payments With The Merger Of Banks - Sakshi

 బ్యాంకుల విలీనంతో స్కాలర్‌షిప్‌ చెల్లింపుల్లో ఇబ్బందులు

దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లలో మార్పులు 

సాక్షి, హైదరాబాద్‌ : పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీలో కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. 2016–17, 2017–18 విద్యా సంవత్సరాలకు చెందిన ఉపకారవేతన నిధులను ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ఈక్రమంలో వాటిని విద్యార్థుల ఖాతాకు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేస్తుం డగా మెజారిటీ ఖాతాలకు ఈ ప్రక్రియ విఫలమవుతోంది. దరఖాస్తు సమయంలో వివరాలన్నీ పూరిం చినప్పటికీ ఆన్‌లైన్‌ బదిలీల్లో విఫలం కావడం ఇబ్బందికరంగా మారుతోంది. లోపం ఎక్కడుందనే అంశంపై అధికారులు ఆరా తీయగా బ్యాంకుల ఐఎఫ్‌ ఎస్‌సీ కోడ్‌లలో తప్పులు దొర్లినట్లు గుర్తిం చారు. వాస్తవానికి విద్యార్థులంతా దరఖాస్తులప్పుడు సరైన కోడ్‌లే ఇచ్చినా బ్యాంకుల విలీనప్రక్రియతో అవి మారిపోయాయి.

మెజారిటీ ఖాతాల న్నీ  ఎస్‌బీఐలోనే
రాష్ట్రంలో లీడ్‌ బ్యాంక్‌గా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కొనసాగుతోంది. గతం లో ఈ స్థానంలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) ఉండగా విలీనంతో ఇప్పుడు ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంక్‌గా మారింది. దీంతో ఎస్‌బీహెచ్‌ శాఖల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారిపోయాయి.  రాష్ట్రంలో మెజారిటీ విద్యార్థులు స్టేట్‌బ్యాంకు ఖాతాలనే తెరిచారు. పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇతర బ్యాంకు ఖాతాలు తెరిచినప్పటికీ గ్రామీణ విద్యార్థులకు మాత్రం 91శాతం స్టేట్‌బ్యాంకు ఖాతాలే ఉన్నాయి. ఈక్రమంలో 2016–17 విద్యాసంవత్సరంలో ఫ్రెషర్స్, రెన్యువల్‌ విద్యార్థులు దరఖాస్తుల్లో నమోదు చేసిన స్టేట్‌బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు 78 శాతం మారిపోయాయి.

అదేవిధంగా 2017–18 సంవత్సరంలో కోడ్‌లు మారినప్పటికీ విద్యార్థులకు అవగాహన లేక పాత వాటినే నమోదు చేశారు. ప్రస్తుతం 2016–17 విద్యా సంవత్సరం ఉపకారవేతన బకాయిలను సంక్షేమాధికారులు చెల్లింపులు చేస్తున్నారు. ఈమేరకు టోకెన్లు జనరేట్‌ చేసి ఖజానా శాఖకు పంపుతున్నారు. ఖజానా శాఖ అధికారులు బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేసే క్రమంలో ప్రక్రియ విఫలమవుతుండటంతో ఆయా ఫైళ్లను జిల్లా సంక్షేమాధికారులకు తిప్పి పంపిస్తున్నారు. ప్రస్తుతం 2016–17 సంవత్సరానికిగాను 3.75లక్షల మంది విద్యార్థులకు ఉపకార నిధులు పంపిణీ చేయాలి.అలాగే 2017–18 కి 7.58లక్షల మందికి చెల్లించాల్సి ఉంది. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు తప్పుగా ఉండటంతో ఆయా విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కోడ్‌లను సరిచేసుకున్న తర్వాతే పంపిణీ చేయనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top