తెలుగు రాష్ట్రాల్లో ఇం‘ధన’హాసం

Diesel High Price Selling In Hyderabad Got Third Place - Sakshi

పెట్రోల్‌లో అమరావతి.. 

డీజిల్‌లో హైదరాబాద్‌ అగ్రగామి

రోజువారీ ధరల సవరణతో సైలెంట్‌ బాదుడు  

సాక్షి,  హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలు ‘ఇంధనం’ ధరల్లో దేశంలోని మెట్రో నగరాల్లో సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. పెట్రోల్‌ ధరలో ఏపీ రాజధాని ‘అమరావతి’, డీజిల్‌ ధరలో తెలంగాణ రాజధాని ‘హైదరాబాద్‌’ టాప్‌లో ఉన్నాయి. డీజిల్‌ ధరలో అమరావతి, పెట్రోల్‌ ధరలో హైదరాబాద్‌ దేశంలో మూడో స్థానంలో ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రో ఉత్పత్తులపై పన్నుల మోత తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది. రోజువారీగా రెండు మూడు లీటర్లు వినియోగించే వారికి పెద్దగా భారం పడనప్పటికీ.. వందల లీటర్లు వినియోగించే  వారికి మాత్రం ఆర్థికంగా భారంగానే ఉంది. దీంతో ఇంధనాన్ని భారీగా వినియోగించే వారు పన్ను తక్కువ ఉన్న ప్రాంతాల నుంచి బల్క్‌గా  తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
 

పన్నుల వాత ఇలా.. 
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరల్లో దాదాపు సగానికి పైగా పన్నుల రూపంలోనే ఉన్నాయి. మొత్తం ధరల్లో పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం పన్ను పోటు పడుతోంది. ఇందులో పెట్రోల్, డీజీల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ భారం పడుతోంది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 విధిస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాట్‌ కింద పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌ 27 శాతం పన్నుగా వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 32 శాతం వ్యాట్‌ విధిస్తుండగా.. అదనంగా ప్రతి లీటర్‌పై రూ.2 వ్యాట్‌ కూడా వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.2 అదనపు వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రో, డీజీల్‌ ధరల దూకుడుకు కళ్లెం లేకుండా పోయింది. అదే పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో పెట్రోల్‌పై 32 శాతం, డీజిల్‌పై 21 శాతం, తమిళనాడులో పెట్రోల్‌పై 34 శాతం, డీజిల్‌పై 25 శాతం పన్ను విధిస్తున్నారు. గత పదిరోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు రోజు వారి సవరణతో దూకుడుగా ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top