విలక్షణ ధర్మపురి

Dharmapuri assembly constitution overview - Sakshi

గతంలో నాలుగు నియోజకవర్గాల సమూహం 

2009లో ఆరు మండలాలతో ‘ధర్మపురి’ 

బీసీల ఓట్లే ఇక్కడ కీలకం  

నియోజకవర్గ ఏర్పాటు నుంచి ‘కొప్పుల’కే పట్టం 

ఈసారి ఎవర్ని ఆదరిస్తుందో!!!

 సాక్షి ,గొల్లపల్లి(ధర్మపురి): ధర్మపురి... నాలుగు నియోజకవర్గాల నుంచి విడిపోయి 2009లో ఆరు మండలాలతో పురుడుపోసుకున్న నియోజకవర్గం. మేడారం, చొప్పదండి, బుగ్గారం, జగిత్యాల నియోజకవర్గాల్లో ఉన్న గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం, వెల్గటూరు, ధర్మారం సంపూర్ణ మండలాలను కలిపి ధర్మపురి(ఎస్సీ) నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. గతంలో ఆయా నియోజకవర్గాల నుంచి హేమాహేమీలే పరిపాలించారు. పలుమార్లు స్వతంత్రులే సత్తాచాటగా... టీడీపీ– కాంగ్రెస్‌ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ సాగింది. ధర్మపురి ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగుతున్న ‘కొప్పుల ఈశ్వర్‌’ కే ఇక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో బీసీ ఓటర్లే అధికంగా ఉండడంతో వారిని ఆకర్షించే పనిలో పడ్డారు ఆయా పార్టీల అభ్యర్థులు. 

ఇదీ ముఖచిత్రం... 
జగిత్యాల  ,జిల్లా ధర్మపురి నియోజకవర్గం 2009కి ముందు వేర్వేరు నియోజకవర్గాల్లో ఉండేది. మేడారం, చొప్పదండి, జగిత్యాల, బుగ్గారం నియోజకవర్గాల నుంచి పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్, ధర్మారం, బుగ్గారం, ధర్మపురి మండలాలను విడదీసి ధర్మపురి(ఎస్సీ) నియోజకవర్గాన్ని 2009లో ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల సరిహద్దుగా ఈ జిల్లా ఉంటుంది. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సరిహద్దు ప్రాంతాలుగా నియోజకవర్గంలోని గ్రామాలు ఉంటాయి. నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురిలో శ్రీ లక్ష్మినృసింహస్వామి, నియోజవర్గంలోని సగభాగంలో గోదావరి నది ప్రవహిస్తుంటాయి. శాతవాహనులు ఏలిన కోటిలింగాల ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఇప్పుడు ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌తో పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 129 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 2,02,666 ఓటర్లున్నారు. పురుషులు 99,775మంది, మహిళలు 1,02,883 ఉన్నారు. మొత్తంగా నియోజకవర్గంలో 62శాతం బీసీఓట్లు ఉండగా...23ఎస్సీ, 15ఇతర వర్గాల ఓట్లు ఉన్నాయి. దీంతో అభ్యర్థుల గెలుపోటముల్లో బీసీలే కీలకం కానున్నారు. 

నాలుగు నియోజకవర్గాల ప్రాంతం... 
ప్రస్తుత ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, ధర్మారం, గొల్లపల్లి మండలాలు పునర్విభజనకు ముందు జగిత్యాల, చొప్పదండి, మేడారం, బుగ్గారం నియోజకవర్గాల్లో ఉండేవి. గొల్లపల్లి మండలంలోని ఎనిమిది గ్రామాలు జగిత్యాల నియోజకవర్గంలో, 17గ్రామాలు చొప్పదండిలో ఉండేవి. ధర్మపురి మండలంలోని సిరికొండ గ్రామం ఒక్కటే చొప్పదండి పరిధిలో ఉండేది. మిగితా గ్రామాలు బుగ్గారం పరిధిలో ఉండేవి. పెగడపల్లి మండలంలోని 4 గ్రామాలు జగిత్యాలలో, 5 మేడారంలో, 17గ్రామాలు చొప్పదండి పరిధిలోకి వచ్చేవి. వెల్గటూర్‌ మండలంలోని 19 గ్రామాలు మేడారంలో, 5చొప్పదండిలో, 2బుగ్గారంలో ఉండేవి. ధర్మారం మండలం సంపూర్ణంగా మేడారంలో ఉండేది. 2009 నుంచి ఇవన్నీ కలిపి సంపూర్ణంగా ధర్మపురి నియోజకవర్గంగా ఏర్పడ్డాయి.

విలక్షణ తీర్పు... 
మేడారం, చొప్పదండి, బుగ్గారం, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు 1957లో ఏర్పాటయ్యాయి. మేడారం 1957, 1962లో జనరల్‌గా ఉండేది. 1967నుంచి ఎస్సీస్థానంగా మారిపోయింది. 2008 ఉపఎన్నిక వరకు 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 2004నుంచి మేడారంలో ప్రాతినిథ్యం వహించిన కొప్పుల ఈశ్వర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 2009లో ధర్మపురి(ఎస్సీ)రిజర్వుడు కావడంతో ఇటువైపు దృష్టి పెట్టారు. 1957లో ఏర్పడిన చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా సీహెచ్‌. రాజేశ్వర్‌రావు(పీడీఎఫ్‌)తరఫున గెలుపొందారు. తరువాత కాంగ్రెస్‌ నుంచి 1962లో బండారి రాములు, 1978లో ఐఎన్‌సీ(ఐ) నుంచి న్యాలకొండ శ్రీపతిరావు, 1983లో గుర్రంమాధవరెడ్డి(ఇండింపెండెంట్‌)గెలిచారు. 1985,86,94లో టీడీపీ నుంచి న్యాలకొండ రాంకిషన్‌రావు హ్యాట్రిక్‌ సాధించి, కేబినెట్‌లో స్థానం సంపాదించారు. తరువాత 1999లో కాంగ్రెస్‌ నుంచి కోడూరి సత్యనారాయణగౌడ్‌ గెలుపొందారు.

2004లో టీడీపీ నుంచి సానమారుతి విజయం సాధించారు.2009 నుంచి చొప్పదండి నుంచి కొన్ని గ్రామాలు విడిపోయి ధర్మపురిలో కలిశాయి. ఇక బుగ్గారం జనరల్‌ స్థానం అయినప్పటికీ స్వతంత్రుల హవా కొనసాగింది. దివంగత శాసనసభాపతి జి. నారాయణరావు మహరాణి గంజ్, మాజీ మంత్రి కే.వీ. కేశవులు సిర్పూర్‌ ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించారు. 1957లో బద్ధం ఎల్లారెడ్డి, 1962లో ఏనుగు నారాయణరెడ్డి, 1972లో జోగిని దామోదర్‌రావు ఇండిపెండెంట్లుగా విజయం సాధించారు. 1978లో ఇందిరా ప్రభంజనంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అంబల్ల రాజారాం, 1983లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడకుంట్ల గంగారాంను గెలిపించారు. 1985లో టీడీపీ నుంచి శికారి విశ్వనాథంకు పట్టం కట్టారు. 1989లో ఇండింపెండెంట్‌ అభ్యర్థి జువ్వాడి రత్నాకర్‌ రావును గెలిపించారు. 1994లో శికారి విశ్వనాథం(టీడీపీ), జువ్వాడి రత్నాకర్‌రావు(కాంగ్రెస్‌), పోటీచేయగా టీడీపీకి విజయం అందించారు. 1996, 2004లో రత్నాకర్‌రావు శాసనసభకు ఎంపికయ్యారు. తరువాత 2009లో బుగ్గారం ధర్మపురిలో విలీనమైంది. 

టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా... 
2009లో ఏర్పడిన ధర్మపుని నియోజకవర్గం ఎస్సీస్థానానికి రిజర్వుడు కావడంతో కాంగ్రెస్‌ నుంచి మాజీ జెడ్పీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీఆర్‌ఎస్‌ నుంచి మేడారం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల బరిలో దిగారు. కాగా నూతన నియోజకవర్గంలో ప్రజలు కొప్పులకే పట్టం కట్టారు. తరువాత 2010 ఉప ఎన్నిక, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి కొప్పుల ఈశ్వర్‌ హ్యాట్రిక్‌ సాధించారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేబినెట్‌లో చీఫ్‌విప్‌గా కొనసాగారు. 

ప్రముఖులు ఇక్కడి నుంచే... 
ధర్మపుని నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల నుంచి చాలా మంది ప్రముఖులు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావుది ధర్మపురి మండలం తిమ్మాపూర్‌. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జగిత్యాల తాజా, మాజీ ఎమ్మెల్యే తాటిపత్రి జీవన్‌రెడ్డిది పెగడపల్లి మండలం బతికెపల్లి. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సాన మారుతిది వెల్గటూరు మండలం గొల్లకోట స్వస్థలం. బీజేపీ రాష్ట్ర నాయకుడు, ప్రస్తుత పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి స్వస్థలం ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్‌పేట్‌.

ఈసారి బరిలో వీరే.. 
ధర్మపురి నియోజకవర్గం నుంచి ఈ సారి టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు టికెట్‌ రాగా.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరుసగా మూడుసార్లు ద్వితీయస్థానంలో ఉంటూ వచ్చిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఇంకా అధిష్టానం టికెట్‌ కేటాయించకపోయినా... ప్రచారంలో జోరుగా తిరుగుతున్నారు. ఈ సారి తనకే ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి టిక్కెట్‌ దక్కించుకున్న కన్నం అంజయ్య తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇంకా పలు పార్టీలకు చెందిన నాయకులు టికెట్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  

ప్రజలతో సత్సంబంధాలు ఉండేవి! 
గొల్లపల్లి: ఆయన రాజకీయంలో ఆరితేరారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా.. ఓసారి మంత్రిగా కొనసాగారు. ఇప్పటికీ ఆయన రాజకీయాలను శాసిస్తున్నారు. ఆయనే మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు.రాజకీయాలు,ఎన్నికలపైనాటి..నేటిపరిస్థితులనుఆయన‘సాక్షి’తోపంచుకున్నారు. 
                                           

నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఓ సారి మంత్రిగా పనిచేశాను. మా ప్రభు త్వంతో ప్రజలకు సత్సంబంధాలు ఉండేవి. ఏ విషయం ఉన్నా.. ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు కలిసి చర్చించేవాళ్లం. ఇప్పుడలాంటిది కనిపించడం లేదు. ప్రజలకు.. నాయకులకు... ప్రభుత్వానికి గ్యాప్‌ వచ్చి ంది. మంత్రులకు కూడా విలువలేకుండా పోయింది. అధికారులదే హవా నడుస్తోంది. మంత్రులకు అధికారులే భయపడటం లేదు. ఓ చిన్నపనిని నా దగ్గరి స్నేహితుడని ఓ మంత్రికి చెబితే అదీ పూర్తికాలేదు. అదేమంటే ప్రభుత్వంలో ‘మాదేం నడుస్తుందే.. అంతా ఆ పెద్దాయనే.. (సీఎం కేసీఆర్‌ ) చూసుకుంటున్నడు. మేం నిమిత్తమాత్రులం..’ అన్నారు. ఇప్పటి ఎన్నికల్లో అంత డబ్బుదే హవా నడుస్తోంది .సేవ అనే మాటకు అర్థం లేకుండాపోయింది.

అప్పడు ప్రజలు మాటకు కట్టుబడి ఉండేవారు. ఒక్కసారి మాట ఇస్తే ఓటు వేసేవారు. ఇప్పుడు అందరికీ జై కొడుతున్నారు. ప్రజలతో నాయకులకు ప్ర త్యక్ష సంబంధాలు లేనే లేవు.  ఫేస్‌బుక్, వాట్సాప్‌ పాపులర్‌ అయ్యింది. మా హయాంలో కోరుట్లలో ఒక్కసారి మీటింగ్‌ పెట్టాను. సీఎంతో మాట్లాడాలని ప్రజలు కోరారు. అప్పటి సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డికి ఫోన్‌ చేసి అక్కడికక్కడే ప్రజలతో మాట్లాడించాను. ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఇగ ఈ సీఎం ఉన్నడు..! కొండగట్టు వద్ద బస్సు ప్రమాదం జరిగి 65మంది చనిపోయినా.. కనీసం తొంగిచూడలేదు..!! అంతపెద్ద సంఘటనకే స్పందించకుంటే ఇగ దేనికి స్పందిస్తడు..? అప్పటికి ఇప్పటికీ బాగా తేడా వచ్చింది. ఎస్సై, సీఐ, ఎమ్మార్వో బదిలీ కావాలన్నా డబ్బే అవసరమైతంది. అధికారులదే రాజ్యం అయింది.

1989 ఎన్నికల్లో నేను రూ.1.40లక్షలు వెచ్చించి ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యాను. ఇప్పడు రూ. 5కోట్ల నుంచి రూ.10 కోట్లు వెచ్చిస్తున్నారు. వారు గెలికాచక మళ్లీ ఆ డబ్బును ప్రజల నుంచే రాబట్టుకుంటున్నారు. ప్రజాసేవ కోసం ఇప్పడు పోటీచేయటం లేదు. సంపాదనే ధ్యేయంగా పోటీ చేస్తున్నారు. నిజాయితీ అనేది ఏ స్థాయిలో కనిపించటం లేదు. భూరికార్డుల పేరుతో కొత్త పాస్‌బుక్కులు రైతులకు ఇచ్చారు. సవరణచేయడానికి లంచం తీసుకున్నారు. కొత్తబుక్కుల్లో తప్పులు దొర్లుతే రైతులను పీడించుకుని లంచాలు మేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం తీరు.

 క్రైం ఫ్లాష్‌బ్యాక్‌ 

పెద్దపల్లి తొలి ఎమ్మెల్యే హత్య
పెద్దపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన ముదిగంటి కొండాల్‌రెడ్డి పదవీకాలం ముగిసిన తర్వాత హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన కొండాల్‌రెడ్డి 1952లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 1957 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో కలిసి పనిచేశారు. అయితే గ్రామంలో వ్యక్తిగత కక్ష్యల కారణంగా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొండాల్‌రెడ్డిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఆ కేసులో ముగ్గురికి హైకోర్టు యావజ్జీవకారగార శిక్ష విధించింది. ప్రస్తుతం శిక్ష అనుభవించి విడుదలైన అనంతరం వృద్ధాప్యంతో కేసులో ఉన్నవారందరూ మరణించారు. ఆకాలంలో బాహుబలిని పోలిన కొండాల్‌రెడ్డి సుమారు ఆరున్నర ఫీట్ల ఆజానుభావుడు. ఆహారం సైతం భారీగా తీసుకునే వారు. భారీ కాయుడైన కొండాల్‌రెడ్డిని చూసి గ్రామంలో ప్రజలు భయపడేవారు. ఆ కాలంలోనే కొండాల్‌రెడ్డికి లైసెన్స్‌ రివాల్వర్‌ ఉండేదని గ్రామస్తులు చెబుతుంటారు. 

ముదిగంటి 
కొండాల్‌రెడ్డి (ఫైల్‌) 

సీనియర్‌ సిటీజన్‌ వాయిస్‌... 

1952నుంచి ఓటు వేస్తున్నా...
గోదావరిఖని(రామగుండం): ఆశ కోసం కాదు ఆశయం కోసం వచ్చే నాయకులను ఎమ్మెల్యేగా ఎన్నుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి.1952నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నా. అప్పటికీ... ఇప్పటికి ఎన్నికల జరిగే పద్ధతిలో చాలా తేడా వచ్చింది. 1952లో కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత పీవీ.నర్సింహారావు సీపీఐ కార్యకర్త బద్ధం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు అం టే ఓటర్లలో ఏమేరకు చైతన్యం ఉందో అర్థం అవుతోంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top