డెంగీ డేంజర్

డెంగీ డేంజర్

 • సిటీకి దోమకాటు

 •  రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య

 •  మూడు రోజుల్లోనే ఉస్మానియాలో  23 మంది చేరిక

 •  ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులకూ లక్షణాలు

 • అఫ్జల్‌గంజ్/ సాక్షి, సిటీబ్యూరో: నగరంపై డెంగీ మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. కేవలం మూడు రోజుల్లో  23 మంది డెంగీ లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో, మరో ఇద్దరు చిన్నారులు నిలోఫర్‌లో చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లో డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఓవైపు రోజురోజుకూ ప్రధాన ఆస్పత్రుల్లో డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంటే మరో వైపు జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్రతరం కావడం, అత్యవసర సేవలు సైతం స్తంభించడం ఆందోళన కలిగిస్తోంది.

   

  దోమకాటు కారణంగా నగరంలో విషజ్వరాలు, డెంగీ ప్రబలుతున్నాయి. ఆగస్టులో 53 డెంగీ కేసులు నమోదు కాగా అందులో 6 కేసులు పాజిటివ్‌గా తేలాయి. సెప్టెంబర్‌లో అత్యధికంగా 104 కేసులు నమోదు కాగా అందులో 8 కేసులు పాజిటివ్‌గా నిర్ధారించారు. ఇక అక్టోబర్‌లో 13వ తేదీ వరకు ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో డెంగీ ప్రభావం తగ్గిపోయిందని భావించిన వైద్యాధికారులకు 14, 15, 16వ తేదీల్లో అనూహ్యంగా 23 కేసులు నమోదు కావడం విస్మయానికి గురిచేసింది. మల్లేపల్లి, బంజారాహిల్స్, అఫ్జల్‌గంజ్, సికింద్రాబాద్, నాంపల్లి, జీడిమెట్ల, ధారూర్ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రోగులు డెంగీ లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపించారు.

   

  నర్సింగ్ విద్యార్థినులకు సైతం...  ఉస్మానియా ఆసుపత్రి నర్సింగ్ స్కూల్‌లో నర్సింగ్ కోర్సు అభ్యసిస్తున్న ఇద్దరు విద్యార్థినులు విషజ్వరంతో బాధపడుతూ బుధవారం ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. వీరికి డెంగీ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రి వైద్యులు శాంపిల్స్ సేకరించి వైద్యపరీక్షలకు పంపించారు.

   

  చర్యలేవీ..?  డెంగీ మహమ్మారి అన్ని ప్రాంతాలకూ వేగంగా విస్తరిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం నివారణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్తీలు, కాలనీల్లో వ్యాధులకు కారణమైన దోమల నివారణ, పారిశుధ్యం పనులు చేపట్టడంలో బల్దియా అధికారులు విఫలమవుతున్నారు. దోమల నివారణ కోసం ఫాగింగ్ చర్యలే లేవని మూసీనది పరివాహక ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు.  

   

  ఆస్పత్రిలోనూ దోమల బెడద  ఉస్మానియా ఆస్పత్రి పరిసరాల్లోనూ డెంగీ దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆస్పత్రి వార్డుల  మధ్యే మురుగు నీరు ప్రవహిస్తుండటం, పేరుకపోయిన చెత్తను రోజుల తరబడి తొలగించకపోవడంతో దోమల బెడద ఎక్కువైందని ఆస్పత్రి వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నగరంలోని బంజారాహిల్స్, కూకట్‌పల్లి, అఫ్జల్‌గంజ్, అంబర్‌పేట్, మలక్‌పేట్, రామంతాపూర్, లంగర్‌హౌస్, మాణికేశ్వరినగర్, గుడిమల్కాపూర్, గోల్నాక, భోలక్‌పూర్ తదితర బస్తీల్లో  దోమలు స్వైరవిహారం చేస్తున్నట్లు స్వయంగా ఎంటమాలజీ విభాగం అధికారులే స్పష్టం చేస్తున్నారు. బస్తీల్లో రోజుల తరబడి ఫాగింగ్ చేయక పోవడానికి తోడు పారిశుధ్య కార్మికులు ఇటీవల సమ్మెకు దిగడం వల్ల అవి మరింత విజృంభిస్తున్నాయి.

   

  ఈ లక్షణాలు ఉంటే అనుమానించవచ్చు..  తీవ్రమైన జ్వరం (అంటే 102 డిగ్రీలకుపైగా), తలనొప్పి, కండరాల నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం, వంటి లక్షణాలు ఉంటే డెంగీ జ్వరంగా అనుమానించవచ్చు. ప్రస్తుతం నమోదు అవుతున్న తీవ్రమైన జ్వరాలన్ని డెంగీ కాదు. రెండు, మూడు రకాల వైరస్‌ల కలయిక వల్ల జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కొత్త తరహా జ్వరాలన్నీ డెంగీ లక్షణాలను పోలి ఉంటాయి. ‘ఎలీసా’ పరీక్ష చేయించుకున్న తర్వాతే నిర్ధారించుకోవాలి.

   -  డాక్టర్ నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి

   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top