రెండేళ్లలో ఉస్మా‘నయా’ | CM Revanth orders completion of new Osmania Hospital construction | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో ఉస్మా‘నయా’

Oct 23 2025 6:02 AM | Updated on Oct 23 2025 6:02 AM

CM Revanth orders completion of new Osmania Hospital construction

ఉన్నతాధికారులతో బుధవారం తన నివాసంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వందేళ్ల అవసరాలకు తగినట్లుగా కొత్త ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై బుధవారం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. 

ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్టు గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణాలు ఉండాలని, అవసరమయ్యే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి ప్రణాళికలో మార్చురీ గది నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. రోడ్డుకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని సూచించారు. 

రోడ్ల పనులు వేగంగా పూర్తి చేయాలి 
ఆసుపత్రి చుట్టూ ముందుగా రోడ్లు నిర్మించి, స్థానికులకు ఇబ్బందులు కలగకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు కూడా ఇప్పటినుంచే రూపొందించాలని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్‌ శాఖ అధికారులతో వెంటనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ఈ కమిటీ ప్రతి పది రోజులకోసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తూ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్‌ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. 

హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణం పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. వచ్చే జూన్‌ నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, కార్యదర్శి మాణిక్‌రాజ్, డీజీపీ శివధర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వికాస్‌రాజ్, క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, ఇలంబర్తి, ముషారఫ్‌ అలీ ఫరూఖీ, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, డీఎంఈ నరేంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement