
పోలీస్ అమరవీరుని కుటుంబసభ్యురాలిని ఓదారుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
రాష్ట్రంలో తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మతతత్వ నేరాలు పెరగకుండా పోలీసుల కృషి భేష్
నిబద్ధతతో పనిచేసే అధికారులను ప్రభుత్వం గుర్తిస్తుంది... అమరుల కుటుంబాలకు అండగా ఉంటుందన్న సీఎం
పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి హాజరు
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమంలోని అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం అందరికీ తెలుసునని, మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసే అధికారుల కృషిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు.
మంగళవారం గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. పోలీసుల కృషితో ఇప్పుడవి దాదాపు లేకుండా పోయాయి. గ్రేహౌండ్స్ కమాండోలు సందీప్, శ్రీధర్, పవన్ కల్యాణ్‌లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందితే.. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్‌లాల్, నల్లగొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు.
మూడురోజుల కిందట నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా, ప్రమోద్ లాస్ట్ డ్రాన్ శాలరీ అతని పదవీ విరమణ సమయం వరకు కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమ నిధి నుండి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియాం, పోలీస్ సంక్షేమ నిధి నుంచి రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం..’ అని సీఎం చెప్పారు.
దేశానికే ఆదర్శంగా మన పోలీసులు
‘రాష్ట్రంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరగనివ్వకుండా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణను పూర్తి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకే పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ‘ఈగల్’ వింగ్‌ను ఏర్పాటు చేశాం.
కొత్త తరహా నేరాలు సవాలుగా మారుతున్నాయి
ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం గర్వకారణం.
సాంకేతిక రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తెలంగాణకు దక్కిన గౌరవం. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది..’ అంటూ రేవంత్ కితాబునిచ్చారు.
శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి
‘పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చాం. పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్‌ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌లు సారథ్యం వహించడం గర్వించదగ్గ పరిణామం. కీలక విభాగాలను సమర్థవంతంగా నడిపిస్తున్న వారిని చూసి గర్విస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఏడుగురు మహిళా అధికారులు డీసీపీలుగా ఉన్నారు.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లను, ఎస్‌ఐలను రిక్రూట్ చేశాం. రాజకీయ జోక్యం లేకుండా రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించాం. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి సాధ్యం. ఇందులో పోలీసుల పాత్ర కీలకం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం
సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక నష్టపరిహారం అందిస్తున్నాం. తీవ్రవాదులు, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను.. కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐల వరకు కోటి రూపాయలకు, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలకు, డీఎస్పీ, అదనపు ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలకు, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
మనది ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ
డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదని, ‘ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే ఫార్ములాతో మనం ముందుకు వెళుతున్నామని చెప్పారు. ‘చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ‘ఫెయిర్ పోలీసింగ్’ అయితే.. పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ, శాంతిభద్రతలను కఠినంగా కాపాడటం ‘ఫర్మ్ పోలీసింగ్’. విధి నిర్వహణ సరిగా చేస్తూ ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్నీ పొందడమే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’..’ అని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డీజీపీకి అందజేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.