వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Review with officials on flood damage | Sakshi
Sakshi News home page

వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్‌

Sep 5 2025 1:06 AM | Updated on Sep 5 2025 1:06 AM

CM Revanth Reddy Review with officials on flood damage

పంట నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి. చిత్రంలో మహేశ్‌ కుమార్‌ గౌడ్, మదన్‌మోహన్‌రావు

బాధితులందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది: కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌ భరోసా

వందేళ్లలో రాని వరదలొచ్చి భారీ నష్టం జరిగింది.. మళ్లీ వరదలు వచ్చి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం  

దీనికోసం అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి 

విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లాలో అమలు చేసే విధానం

రాష్ట్రమంతటికీ విస్తరిస్తాం మీ కష్టాలు చూసి తగిన సాయం 

అందించేందుకే వచ్చా.. ఇళ్లు కూలిపోయిన పేదలకు ప్రత్యేక కోటా కింద ఇళ్లు మంజూరు చేస్తాం 

కొడంగల్‌తో సమానంగా కామారెడ్డి అభివృద్ధి చేస్తామని వెల్లడి 

కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలిసి పర్యటన 

వరద నష్టంపై అధికారులతో సమీక్ష

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ‘వందేళ్లలో రాని వరదలొచ్చి పెద్ద నష్టమే జరిగింది. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లాలో అమలు చేసే విధానం రాష్ట్రమంతటికీ విస్తరిస్తాం. ఇందుకు ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సమగ్ర నివేదిక రూపొందించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 

కామారెడ్డి జిల్లాలో గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు చూసి తగిన సాయం అందించాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చానని చెప్పారు. మళ్లీ వరదలు వచ్చి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. 

జిల్లా అధికారులంతా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్తవ నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ఇక్కడ అమలు చేసే ప్రణాళిక రాష్ట్రమంతటికీ విస్తరించేందుకు ఉపయోగపడుతుందని, విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లా మోడల్‌గా నిలవాలని చెప్పారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్‌ రావ్‌లతో కలిసి సీఎం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ రివ్యూ చేశారు.  

రైతులను ఓదార్చిన సీఎం 
సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లింగంపేట మండలంలోని లింగంపల్లి కుర్దు వద్ద వరదలతో దెబ్బతిన్న వంతెనను, బూరుగిద్ద వద్ద కొట్టుకుపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అక్కడి నుంచి కామారెడ్డి పట్టణంలో ముంపునకు గురైన జీఆర్‌ కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. 

ఇప్పటికే ప్రభుత్వపరంగా సాయం అందించామని, ఫార్మా, బీడీ కంపెనీల ద్వారా పిల్లల అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమీకృత కలెక్టరేట్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్, ఎంపీ సురేష్‌ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మదన్మోహన్‌రావ్, లక్ష్మీకాంతరావ్, భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌తో వరద నష్టంపై సుదీర్ఘంగా సమీక్షించారు. 

వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. నివేదికలు మార్గదర్శకాలకు లోబడి ఉంటేనే కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సాయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. లేకపోతే మన ప్రతిపాదనలు తిరస్కారానికి గురై మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుందన్నారు. 

వరదలతో మైనర్, మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడిందని, తక్షణమే మరమ్మతులు చేశామన్నారు. అంతకుముందు తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌ శివారులోని హెలిపాడ్‌ వద్ద దిగిన రేవంత్‌రెడ్డికి షబ్బీర్‌అలీ, జిల్లా కలెక్టర్‌ సంగ్వాన్‌ స్వాగతం పలికారు. 
 
పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ 
కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు సంబంధించి పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ లోపు అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి జరిగిన నష్టాలపై సరైన నివేదిక రూపొందించాలన్నారు. అలాగే, శాశ్వత పరిష్కారం చూపడానికి అయ్యే వ్యయానికి సంబంధించిన నివేదికలు కూడా తయారు చేయాలని ఆదేశించారు. 

వారం రోజుల్లో రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో కలిసి మంత్రి సీతక్క సమీక్ష చేస్తారని, ఆ లోపు నివేదికలు రూపొందించాలన్నారు. ఆ తరువాత తాను అందరితో కలిసి సమీక్ష చేస్తానని తెలిపారు. వరదలతో ఇసుక మేటలు వేసిన పొలాలను సరి చేయడానికి అధికారులంతా సమన్వయం చేసుకుని ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

యూరియా పంపిణీలో మార్పులు చేయాలి 
సహకార సంఘంలోనే యూరియా పంపిణీ చేయడం వల్ల వేలాది మంది రైతులు రావడం, వారికి సరిపోవడం లేదంటూ నెగెటివ్‌ ప్రచారం జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాకాకుండా రెండు మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని తెరిచి అక్కడి రైతులకు అక్కడే యూరియా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. 

అధికారుల మధ్య సరైన సమన్వయం, సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రభుత్వం బద్నాం అవుతోందన్నారు. ఆస్పత్రుల్లో వైద్యుల హాజరుకోసం ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం అమలు చేయాలని వైద్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వైద్యులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 

కొడంగల్‌తో సమానంగా కామారెడ్డి 
కామారెడ్డి నియోజక వర్గాన్ని కొడంగల్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలు చూడాలి కాబట్టి ప్రజలు స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి చెబితే తనకు చెప్పినట్టేనని, ఆయన సహకారంతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులను, రోడ్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్లు కూలిపోయిన పేదలకు ప్రత్యేక కోటా కింద ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిçస్తున్నామని, అలాగే పశువులు చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement