సర్పంచ్ బరిలో ముచ్చటగా మూడోతరం..
బాన్సువాడ రూరల్: ఇబ్రాహీంపేట్ గ్రామంలో వుద్దెర కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ కుటుంబానికి చెందిన మూడోతరం సైతం సర్పంచ్ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఇబ్రాహీంపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గ్రామానికి చెందిన వుద్దెర గంగప్ప 1957 నుంచి 1983 వరకు సుమారు 26 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీలుగా ఉన్న పోచారం, రాంపూర్, రాంపూర్ తండా, ఇబ్రాహీంపేట్ తండా, పులికుచ్చతండాలు 1984 వరకు ఉమ్మడి ఇబ్రాహీంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉండేవి. ఆ తర్వాత రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో మరో అవకాశం కోసం 2001 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. 2001లో సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో గంగప్ప కోడలు వుద్దెర కళావతి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచి ఐదేళ్లు పదవిలో ఉన్నారు. ఆమె 2019లో ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మళ్లీ సర్పంచ్ రిజర్వేషన్ బీసీ మహిళ వచ్చింది. దీంతో ఈసారి వుద్దెర కుటుంబానికి చెందిన మూడో తరం వ్యక్తిని బరిలో నిలిపారు. కళావతి పెద్ద కోడలు సంధ్యారాణి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె ఎంఏ, బీఈడీ చదివి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఓటర్లు వుద్దెర కుటుంబానికి చెందిన మూడో తరాన్ని ఆదరిస్తారో లేదో ఈనెల 17న తేలిపోనుంది.
ఓటర్లు 573.. అభ్యర్థులు 12..
మాచారెడ్డి : ఆ పంచాయతీ చిన్నదైనా పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. 573 ఓట్లున్న జీపీలో సర్పంచ్ పదవికోసం 12 మంది పోటీపడుతుండడం గమనార్హం. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం పంచాయతీల పునర్విభజన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిన్నచిన్న తండాలు కూడా పంచాయతీలుగా మారాయి. మాచారెడ్డి మండలంలోని కాకులగుట్టతండా, చెరువుకొమ్ముతండా, బ్రాహ్మణపల్లి తండాలను కలిపి కాకులగుట్ట తండా కేంద్రంగా పంచాయతీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఓటర్లు 573 మంది ఉన్నారు. ఇందులో 268 మంది పురుషులు, 305 మంది మహిళలున్నారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. మూడు తండాల నుంచి 12 మంది పోటీ పడుతున్నారు. మాలోత్ గంగోత్రి, బూక్య సునీత, విస్లావత్ జమున, బూక్య అనురాధ, గుగులోత్ వనిత, అజ్మీర మంజుల, బానోత్ శోభ, బూక్య జ్యోతి, బూక్య సునీత, బూక్య రజిత, గుగులోత్ రాజీ, మాలోత్ తులసీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మాచారెడ్డి : మండలంలోని గజ్యానాయక్ తండా చౌరస్తా గ్రామ పంచాయతీ బరిలో వార్డు సభ్యులుగా భార్యాభర్తలు జనపాల అనురాధ, నారాయణ పోటీ చేస్తున్నారు. అయితే వేరువేరు వార్డులనుంచి బరిలో ఉన్నారు. భార్య ఐదో వార్డునుంచి భర్త ఎనిమిదో వార్డునుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఇద్దరికీ గ్యాస్ స్టౌ గుర్తే రావడం గమనార్హం.
సర్పంచ్ బరిలో ముచ్చటగా మూడోతరం..


