ఎక్కడున్నా.. ఊరు ముచ్చటే! | - | Sakshi
Sakshi News home page

ఎక్కడున్నా.. ఊరు ముచ్చటే!

Dec 8 2025 7:56 AM | Updated on Dec 8 2025 7:56 AM

ఎక్కడ

ఎక్కడున్నా.. ఊరు ముచ్చటే!

బలాబలాలు తెలుసుకుంటూ..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి మనసు సొంతూరి ఎన్నికల గురించి ఆలోచిస్తోంది. ఊర్లో సర్పంచ్‌గా ఎవరు పోటీ చేస్తున్నారు? వార్డు సభ్యులుగా ఎవరెవరు బరిలో ఉన్నారు? అంటూ ఆరా తీస్తున్నారు. పోటీ చేసేవారిలో తమ స్నేహితులో, బంధువులో ఉంటే వారికి తమ మద్దతు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల అయితే గల్ఫ్‌లో ఉన్న వారు తలా కొంత డబ్బు జమ చేసి తమ స్నేహితులకు ఎన్నికల ఖర్చుల కోసం పంపిస్తున్నారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ వారిని గెలిపించాలంటూ ఊళ్లోని తమ స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి వేడుకుంటున్నారు.

జిల్లానుంచి వేలాది మంది దుబాయి, అబుదాబీ, మస్కట్‌, కువైట్‌, ఇరాక్‌, మలేషియా తదితర దేశాలకు వలస వెళ్లారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతూనే ఉన్నారు. అప్పట్లో నక్సలైట్ల గొడవలు ఎక్కువగా ఉండి పోలీసులు, నక్సల్స్‌ మధ్య నలిగిపోయిన పల్లె యువత చాలా మంది గల్ఫ్‌ బాట పట్టారు. అప్పటి నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సొంతూళ్లలో పంచాయతీ ఎన్నికలు నడుస్తుండడంతో గల్ఫ్‌లోని వలస జీవులు ఇక్కడి ఎన్నికల గురించి ఆసక్తి చూపుతున్నారు. గల్ఫ్‌ వెళ్లి వచ్చిన వారు కూడా చాలా మంది ఎన్నికల బరిలో నిలిచారు. వారికీ గల్ఫ్‌ వలస జీవులు స్నేహహస్తం అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఓ గ్రామానికి చెందిన యువకుడు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. గల్ఫ్‌లో ఉన్న అతడి స్నేహితులు తలా కొంత జమ చేసి దాదాపు రూ.3 లక్షలు పంపించారు. పాల్వంచ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వారు గల్ఫ్‌ నుంచి తమ స్నేహితుడికి ఎన్నికల ఖర్చుల కోసం రూ. లక్ష పంపించారు. అంతేగాక తమ కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఉన్న తమ బంధువులు, ఇతర స్నేహితులకు ఫోన్లు చేసి మనోడికి మద్దతు ఇవ్వాలంటూ ప్రాదేయపడుతున్నారు. అక్కడెక్కడో ఎడారి దేశంలో ఉన్న వారు ఫోన్లు చేసి బతిమాలుతుంటే కాదనలేకపోతున్నారు.

ఉత్తర తెలంగాణలో గల్ఫ్‌ వలస వెళ్లిన గ్రామాలు రెండు వేలకు పైగా ఉంటాయని అంచనా. కొన్ని గ్రామాల్లో అయితే ఇంటికొకరు గల్ఫ్‌కు వెళ్లారు. ఇప్పటికీ వెళుతూనే ఉన్నారు. కొన్నిచోట్ల అయితే మూడు తరాల వారు గల్ఫ్‌ బాట పట్టారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మొదలైన నుంచి ఎవరు నామినేషన్లు వేస్తున్నారు? ఎవరి బలం ఎంత? ఎవరి మధ్య పోటీ ఉంటుంది? ఎవరు గెలిచే అవకాశాలున్నాయి? అన్న విషయాలపై ఫోన్లు చేసి కనుక్కుంటున్నారు. అలాగే ఊరుకు సంబంధించి సామాజిక మాధ్యమ గ్రూపులలో తమ వాయిస్‌ వినిపిస్తున్నారు. ఊరు అభివృద్ధి కోసం అవగాహన ఉన్న వారిని గెలిపించమని కొందరు వాయిస్‌ మెసేజ్‌లు పెడుతున్నారు. మరికొందరు తమ స్నేహితుడు, బంధువుకు మద్దతు ఇవ్వాలంటూ ప్రచారం చేస్తున్నారు. తొలి విడత నామినేషన్లు మొదలైన నాటి నుంచి గల్ఫ్‌ వలస జీవులు ఎప్పటికప్పుడు తమ ఊరి రాజకీయాల గురించి, ఇరుగుపొరుగు గ్రామాల్లోని రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారు. వేల మైళ్ల దూరంలో ఉన్నా తమ మనసంతా సొంతూరుమీదే ఉందని చాటుతున్నారు.

పల్లెపోరుపై గల్ఫ్‌లో ఆసక్తి

పంచాయతీ ఎన్నికల గురించి

తెలుసుకుంటున్న వలస జీవులు

బరిలో నిలిచిన బంధుమిత్రులకు

మద్దతుగా అక్కడి నుంచే ప్రచారం

ఫోన్లు చేసి మనోడిని గెలిపించాలంటూ విజ్ఞప్తి

సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు

ఉపాధి కోసమో.. ఉద్యోగాల కోసమో వలసవెళ్లినవారి మనసు సొంతూరు చుట్టే తిరుగుతోంది. పంచాయతీ ఎన్నికల గురించి తెలుసుకుంటున్నారు. తమవారు బరిలో ఉంటే.. వారికి ఓటేసి గెలిపించాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేస్తూ తమవారిని గెలిపించాలని కోరుతున్నారు.

ఎక్కడున్నా.. ఊరు ముచ్చటే!1
1/1

ఎక్కడున్నా.. ఊరు ముచ్చటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement