
బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘గాంధీ సరోవర్’ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదలాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువల స్ఫూర్తిని చాటేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ అయ్యారు.
98.20 ఎకరాలు కేటాయించండి
మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ’నిర్మించ తలపెట్టామని, ఇందుకు గాను అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, మ్యూజియం, శాంతి విగ్రహం వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ల్యాండ్ స్కేపింగ్, ఘాట్లు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే వినోద ప్రదేశాలను కూడా అభివృద్ధి చేస్తామని రేవంత్ చెప్పారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా ఈ సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.