
బిహార్ తరహాలో దేశవ్యాప్తంగా ‘ఎస్‌ఐఆర్’ నిర్వహించే యోచనలో ఈసీ
తెలంగాణ సీఈఓ వెబ్‌సైట్‌లో ఎస్‌ఐఆర్ 2002 ఓటర్ల జాబితా ప్రకటన
ఆ జాబితాలోని ఓటర్లు, వారి పిల్లలకు తప్పనున్న పౌరసత్వ రుజువుల కష్టాలు
లేకుంటే నిర్దేశిత 11 పత్రాల్లో ఏదో ఒకటి లేదా ఆధార్ ఇవ్వడం తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరుతో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమాన్ని త్వరలో దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఓటర్ల జాబితాలో చోటు కోసం ఓటరు తనతోపాటు తల్లిదండ్రులిద్దరూ భారత పౌరులేనని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిని ఈసీ సృష్టించడంతో ఈ కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. నిర్దేశిత 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా సమర్పించాలని బిహార్ ఓటర్లను ఈసీ కోరింది.
బిహార్‌లో చివరిసారి 2003లో ఎస్‌ఐఆర్ నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో చోటు పొందిన 4.96 కోట్ల మంది ఓటర్లకు మాత్రం ఈ ధ్రువపత్రాల నుంచి మినహాయింపు కల్పించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. చివరిసారిగా ఉమ్మడి ఏపీలో 2002లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ద్వారా రూపొందించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో వచ్చే ఏడాది ఎస్‌ఐఆర్‌ను నిర్వహించే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎస్‌ఐఆర్– 2002లో రూపొందించిన ఓటర్ల జాబితాను ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తన వెబ్‌సైట్ (https:// ceotelangana.nic.in/)లో పొందుపరిచింది. ఎస్‌ఐఆర్–2002లో ఓటరు పేరు/తమ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయో లేవో ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఓటర్లు తెలుసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా ఓటర్ల పేర్లను సులువుగా వెదకవచ్చు. ఎస్‌ఐఆర్ 2002లో తమ పేరు/తల్లిదండ్రుల పేర్లు ఉన్నట్టు రుజువులు సమరి్పస్తే కొత్త ఎస్‌ఐఆర్‌లో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు కావాలి..
పుట్టిన తేదీ ఆధారంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో పౌరసత్వ రుజువు కోసం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓటర్లను మూడు కేటగిరీలుగా విభజించి బిహార్‌లో దరఖాస్తులను ఈసీ స్వీకరించింది. 1987 జూలై 1కి ముందు భారతదేశంలో పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీతోపాటు పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేసే పత్రం ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేసే పత్రాలను సమర్పించాలి.
2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిండ్రులిద్దరికి సంబంధించిన పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతాన్ని ధ్రువీకరించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన పౌరులైతే సంబంధిత దేశంలోని భారత దౌత్య కార్యాయలం జారీ చేసిన బర్త్ రిజిస్ట్రేషన్‌ను సమర్పించాలి. ఒకవేళ భారత పౌరసత్వం స్వీకరించి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు దాఖలు చేయాలి. ఇతర ఏ దేశ పౌరసత్వం స్వీకరించలేదని స్వీయ ధ్రువీకరణ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 11 పత్రాలతో పాటుగా ఆధార్ కార్డును సైతం రుజువుగా ఎన్నికల సంఘం బిహార్‌లో స్వీకరించింది.
ఈసీ నిర్దేశించిన 11 రకాల పత్రాలు ఇవే..
– కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా గుర్తింపు కార్డు.
– 1987 జూలై 1కి ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థ/బ్యాంకు/పోస్టు ఆఫీసు/ఎల్‌ఐసీ/ప్రభుత్వ రంగ సంస్థ జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు/ధ్రువీకరణ పత్రం/డాక్యుమెంట్.
– జనన ధ్రువీకరణ పత్రం
– పాస్‌పోర్టు
– గుర్తింపు పొందిన బోర్డులు/వర్సిటీలు జారీ చేసిన పదోతరగతి/విద్యార్హత పత్రాలు
– రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్
– ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా కుల ధ్రువీకరణ పత్రం
– నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సెక్స్
– రాష్ట్ర ప్రభుత్వం/స్థానిక సంస్థలు రూపొందించిన ఫ్యామిలీ రిజస్టర్
– ప్రభుత్వం భూమి/ఇళ్లు కేటాయిస్తూ జారీ చేసిన పత్రం