మతవాదం ప్రమాదం

The danger of religiousism - Sakshi

      అంబేద్కర్‌ మనుమడు ప్రొఫెసర్‌ ఆనంద్‌ తెల్‌తుంబ్డే

     హిందుత్వాన్ని ఒక జీవన విధానంగా సుప్రీంకోర్టు నిర్వచించడంతో గందరగోళం 

     మహబూబ్‌నగర్‌లో ‘విరసం’రాష్ట్ర మహాసభలు ప్రారంభం 

     ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు 

జెడ్పీ సెంటర్‌ (మహబూబ్‌నగర్‌): మతవాదం దేశానికి చాలా ప్రమాదకరమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనుమడు ప్రొఫెసర్‌ ఆనంద్‌ తెల్‌తుంబ్డే అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో విప్లవ రచయిత సంఘం (విరసం) 26వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగే ఈ మహాసభలను ఆనంద్‌ ప్రారంభించి మాట్లాడారు. దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు హిందుత్వాన్ని ఒక జీవన విధానంగా నిర్వచించడంతో గందరగోళం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. 1920 దశకంలోనే∙దళిత , కమ్యూనిస్టు ఉద్యమాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు హెగ్డేవార్‌ ఇటలీలో గడిపిన సమయంలో అక్కడ ఫాసిజం ధోరణిని అధ్యయనం చేసి భారతదేశంలో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు.

ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌కు అధినేత అయిన గోల్వార్కర్‌ హిందుత్వం మరింత పాతుకుపోవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అలాగే, సావర్కర్‌ అండమాన్‌ జైలులో ఉండి వలసవాదులను నిరోధిస్తానని చెప్పి పుణ్యభూమి అనే భావన ద్వారా క్రిస్టియన్లు భారతీయులు కాదని చెప్పారన్నారు. అయితే, హిందుత్వం కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రమే పరిమితం కాలేదని కాంగ్రెస్‌ స్థాపనతో కూడా ముందుకొచ్చిందని తెలిపారు. మతాన్ని మార్కెట్‌కు ముడిపెట్టిన బీజేపీతో సమానంగా రాహుల్‌గాంధీ కూడా హిందుత్వం కాగడా పట్టుకున్నారని ఆనంద్‌ విమర్శించారు. ప్రత్యేకించి ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు ప్రచారంలో దూకుడుగా 2019 ఎన్నికల దిశగా వెళ్తున్నాయని చెప్పారు. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా మున్ముందు హిందూ రాజ్యంగా మార్చడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

విరసం లేకుండా తెలుగు సాహిత్యం లేదు: హరగోపాల్‌  
విప్లవ రచయితల సంఘం (విరసం) లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించడం కష్టమని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. మానవత్వం మీద విశ్వాసముండే పాత్రను ప్రతీ ఒక్కరూ పోషించాలని, ఈ పాత్రను విరసం సభ్యులు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. అలాగే, ప్రజలను సమీకరించడంతోపాటు సమాజాన్ని మార్చే చారిత్రక బాధ్యత విరసంపై ఉందన్నారు. విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, ప్రొఫెసర్లు పాణి, కాశీం, ఎక్బాల్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పాలనతో పేట్రేగిపోతున్న బ్రాహ్మణీయ హిం దూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని  చెప్పారు. సంస్కృతి, మతం పేరుతో దేశంలోని రచయితలు, మేధావులపై ఆర్‌ఎస్‌ఎస్, హిందూత్వ శక్తులు దాడులు చేస్తున్నాయని విమర్శించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ విరసం రాష్ట్ర మహాసభలకు తమ సంఘీభావం ప్రకటించారు. అలాగే, కళాకారులతో కలసి అమరవీరుల త్యాగాలు మరువలేమని, గోమాత ఎవరు అనే పాటలు పాడి సభికులను అలరించారు. ఇంకా సభల్లో విరసం సభ్యులు వరవరరావు, బాసిత్, ఎక్బాల్, కాశీం, అరసవెల్లి కృష్ణ, గీతాంజలి, రాంకీ, రాజేంద్రబాబు, రాఘవాచారి, ప్రసాద్‌రావు, చెంచయ్య, ఉదయమిత్ర తదితరులు పాల్గొన్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top