రోజుకు 73 మంది!

Daily 73 Drunk And Drive Cases Files in Hyderabad - Sakshi

చిక్కుతున్నమందుబాబులసంఖ్య ఇదీ..

జైలు శిక్ష విధిస్తున్నా మారని తీరు

డ్రంకన్‌ డ్రైవ్‌లలో భారీగా పట్టుబడుతున్న వైనం

11 నెలల్లో 24,134 మంది డ్రంకన్‌ డ్రైవర్ల పట్టివేత

ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా..ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా మందుబాబుల తీరు మారడం లేదు. కఠిన చట్టాలు అమలు చేసి జైలు శిక్షలు విధిస్తున్నా...భారీగా జరిమానాలు అమలు చేస్తున్నా వారు తాగి వాహనాలు నడపడం మానడం లేదు. దాదాపు ప్రతి రోజు 73 మంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కుతుండడమే ఇందుకు నిదర్శనం. గత 11 నెలల్లో సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో 24,134 మంది పట్టుబడ్డారు. వీరిలో 6564 మందికి జైలు శిక్ష పడింది. అయినా డ్రంకన్‌ డ్రైవర్ల తీరుమారకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగితే వాహనం నడపొద్దని ఎవరైనా చెబితే మందుబాబులకు రుచించదు. వాహనం నడిపి తీరాల్సిందేనని ఉబలాటపడుతుంటారు. రహదారుల్లో వాహనాలపై దూసుకెళుతూ పోలీసులకు చిక్కుతున్నారు. వీరిలో యువతే ఎక్కువగా ఉండటం గమనార్హం. జరిమానాలు విధిస్తున్నా, జైలుకు పంపుతున్నా వీరిలో మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు 24,134 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే నెలకు 2,194 మంది పట్టుబడితే...రోజుకు సరాసరిన 73 మంది ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కుతున్నారు. జైలు శిక్షలను పరిశీలిస్తే ఆయా కమిషనరేట్ల పరిధిలో 11 నెలల్లో 6,564 మంది జైలుకెళ్లగా, నెలకు 596 మంది అంటే రోజుకు 19 మందికి సంకెళ్లు పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల్లో మందుబాబులు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నా వారిలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రైవేట్‌ ఉద్యోగులే ఎక్కువ...
వృత్తుల వారీగా డ్రంకన్‌ డ్రైవర్ల జాబితాను పరిశీలిస్తే ప్రైవేట్‌ ఉద్యోగులే మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో స్వయం ఉపాధి పొందేవారు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వ్యాపారులు, విద్యార్థులు ఉండగా, చివరి స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. 

జైలుకు పంపినా..
ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు సైబరాబాద్‌లో 6,092, రాచకొండలో 472 మంది డ్రంకన్‌ డ్రైవర్లకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. అత్యల్పంగా ఒకరోజు నుంచి అత్యధికంగా 30 రోజుల వరకు డ్రంకన్‌ డ్రైవర్లు జైలు శిక్ష అనుభవించారు. అంతేగాక సైబరాబాద్‌ పరిధిలో 375మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, రాచకొండలో 11 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తాత్కాలికంగా, శాశ్వతంగా రద్దు చేశారు. అయినా వాహనదారుల్లో చెప్పుకోదగ్గ మార్పు రావడం లేదు. ఈ 11 నెలల్లో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన డ్రంకన్‌ డ్రైవర్లలో బ్లడ్‌ ఆల్కాహాల్‌ కంటెంట్‌ ఏప్రిల్‌ నెలలో అత్యల్పంగా 175 ఉంటే, అత్యధికంగా అక్టోబర్‌ నెలలో 550 ఎంజీ ఉన్నట్లుగా బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌లో నిర్ధారణ అయ్యింది.   

కౌన్సెలింగ్‌ కీలకం...
ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కుతున్న వారిలో పరివర్తన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు కౌన్సెలింగ్‌ కీలకపాత్ర పోషించనుంది. ప్రస్తుతం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారిని తొలుత ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రాలకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. తాగి నడిపితే ఎదురయ్యే పర్యవసనాలు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులపై అవగాహన కలిగిస్తున్నారు. మరోవైపు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన హృదయ విదారక ప్రమాద ఘటనలను చూపించి వారికి జీవితంపై ఆశలు రేకెత్తించి మార్పు తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ  విజయ్‌కుమార్, దివ్యచరణ్‌రావు పేర్కొన్నారు.

చిక్కుతున్నమందుబాబుల సంఖ్య ఇదీ
11 నెలల్లో సైబరాబాద్,రాచకొండ పరిధిలో24,134 మంది డ్రంకన్‌ డ్రైవర్ల పట్టివేత
6,564 మందికి జైలు శిక్ష,386 డ్రైవింగ్‌ లైసెన్స్‌ల రద్దు
అయినా మారని తీరు
కౌన్సెలింగ్‌ ఇస్తున్నా ప్రయోజనం శూన్యం

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులిలా...
సైబరాబాద్‌: 18,280,  
రాచకొండ: 5,854  
మొత్తం:24,134

జైలు శిక్షలిలా...
సైబరాబాద్‌: 6092
రాచకొండ: 472  
మొత్తం: 6,564

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top