గ్యాస్‌ సబ్సిడీ తిప్పలు ..! | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సబ్సిడీ తిప్పలు ..!

Published Mon, Apr 15 2019 7:16 AM

Customers Facing Cooking Gas Subsidy Amount Credit Problems - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం చుక్కలు చూపిస్తోంది. ఎల్పీజీ సిలిండర్‌ డోర్‌ డెలివరీ జరిగి పక్షం రోజులు గడిచినా నగదు బదిలీ కింద సబ్సిడీ సొమ్ము బ్యాంక్‌ ఖాతాల్లో జమ కావడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం పేదల పాలిట శాపంగా తయారైంది. డీబీటీ పథకం అమలు ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్‌ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమవుతూ వచ్చింది. తాజాగా కొన్ని మాసాలుగా తిరిగి పాత పరిస్థితి పునరావృత్తం అవుతోంది. సబ్సిడీ సొమ్ము 25 రోజులు దాటినా జమ కాని పరిస్థితి నెలకొంది. కొందరికి అసలు సబ్సిడీ జమ  నిలిచిపోయింది. సంబంధిత లబ్ధిదారులు డిస్ట్రిబ్యూటర్‌ను సంప్రదిస్తే సరైన స్పందన లభించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి ధర చెల్లించి...
వినియోగదారులకు వంటగ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీపై డోర్‌ డెలివరీ జరుగుతున్న పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ సిలిండర్‌ ధర మినహాయించి మిగిలిన సొమ్ము నగదు బదిలీ కింద వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. ఇదీ కేవలం ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఆ తర్వాత సిలిండర్లపై సబ్సిడీ వర్తించదు. బ్యాంక్‌లో సైతం నగదు జమ కాదు. ఇదీలా ఉండగా సబ్సిడీ సిలిండర్‌కు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయడం పేదలకు ఆర్థిక భారంగా తయారైంది. ఆ తర్వాత సబ్సిడీ ధరపోనూ మిగిలిన నగదు తిరిగి బ్యాంక్‌ ఖాతాలో జమ అయినా ముందు చెల్లింపు కష్టతరంగా తయారైంది. తాజా గా ఆ డబ్బు కూడా జమకాకపోవడంతో వినియోగదారులకు మరింత ఆర్థిక ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

29.21లక్షల పైనే..
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 28.21లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. మొత్త 125 ఏజెన్సీల ద్వారా ప్రతిరోజు డిమాండ్‌ ను బట్టి ఆయిల్‌ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అవుతోంది. అక్కడి నుంచి బుకింగ్‌ ద్వా రా వినియోగదారులకు డోర్‌ డెలివరీ జరుగుతోంది. ప్రధానంగా ఐఓసీకి సంబంధించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు, హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో వంట గ్యాస్‌ ధర
ఎల్పీజీ సిలిండర్‌ ధర    : రూ.762.35
బ్యాంకులో జమ    : రూ. 257.79

Advertisement

తప్పక చదవండి

Advertisement