నల్లని మబ్బు చల్లని కబురేనా? | Sakshi
Sakshi News home page

నల్లని మబ్బు చల్లని కబురేనా?

Published Thu, Sep 19 2019 1:03 AM

Cumulonimbus Clouds Are Causing Weather Changes In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొన్న రామగుండంలో 26 సెంటీమీటర్లు.. నిన్న నల్లగొండలో 20 సెంటీమీటర్లు.. ఇలా రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతతో కుమ్మేస్తు న్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిర్ణీత ప్రాంతాల్లో ఒకేసారి కుండపోతగా కురుస్తుండటానికి క్యుములో నింబస్‌ మేఘాలే కారణం. సాధారణంగా వేస విలో అధికంగా వచ్చే క్యుములోనింబస్‌ మేఘాలు వానాకాలంలోనూ ఏర్పడ్డాయంటే.. వాతా వరణంలో వచ్చిన మార్పులే కారణమని అధి కారులు పేర్కొంటున్నారు. నల్లగొం డలో అప్పటికప్పుడు పరిస్థితులు మారిపోయి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి తక్కువ సమయంలో 20సెం.మీ. వర్షం కురిసింది.

ఎలా ఏర్పడతాయంటే..
క్యుములోనింబస్‌ మేఘాలు సహజంగా తేమ గాలులు, పొడిగాలులు వ్యతిరేక దిశలో వచ్చి ఒకేచోట కలవడం వల్ల ఏర్పడతాయి. సాధారణ మేఘాలు సమాంతరంగా వ్యాపిస్తే, క్యుములో నింబస్‌ మేఘాలు మాత్రం భూమి నుంచి పైకి నిట్టనిలువుగా 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడ తాయి. ఇవి ఏర్పడితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వస్తాయి. తక్కువ సమయంలో కుంభవర్షం కురుస్తుంది. ఇటీవల రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసిన అన్ని సంద ర్భాల్లోనూ క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడ్డా యని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు చెబుతున్నారు. ఆగ్నేయం నుంచి తేమ గాలులు, ఉత్తర దిక్కు నుంచి పొడిగాలులు వచ్చి సంఘర్షించుకోవడం వల్ల నల్లగొండలో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడ్డాయని వివరించారు.

వాతావరణంలో అనూహ్యమార్పులు..
భూతాపం కారణంగా వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడుతున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాల కాలం ఈ నెలాఖరుకు ముగియాల్సి ఉండగా, అక్టోబర్‌ వరకూ కొనసాగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ అధికారులు అంటున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఉంటుంది. అంటే సకాలంలో నైరుతి ప్రవేశించి ఉంటే ఈ నెలాఖరుకు వర్షాలు తగ్గుముఖం పట్టాలి. కానీ సీజన్‌ దారితప్పడంతో వచ్చే నెల వరకు కొనసాగే పరిస్థితి నెలకొంది. గతేడాది మే 29న నైరుతి రుతుపవనాలు కేరళను తాకితే, ఈసారి జూన్‌ 8న తాకాయి. దీనివల్ల ఈసారి జూలై 20 వరకు తెలంగాణలో వర్షాలే కురవలేదు. దీనివల్ల పత్తి సాగు ఆలస్యమైంది. ఆలస్యం కారణంగా పత్తికి గులాబీ రంగు పురుగు సోకింది. కాగా, ఆగస్టులోనే వరినాట్లు పడాల్సి ఉండగా, సెప్టెంబర్‌లోనూ కొనసాగుతున్నాయి. అక్టోబర్‌ వరకు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. ఇలా సీజన్‌ ఆలస్యం కావడం వల్ల వ్యవసాయ పంటలపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల పంటల ఉత్పాదకత, నాణ్యత పడిపోయే ప్రమాదం ఉంది. చీడపీడలు పట్టిపీడిస్తాయి. 

జ్వరాల విజృంభణ..
కాలం కాని కాలంలో వర్షాలు కురవడం వల్ల దోమలు పెరుగుతాయి. విషజ్వరాలు వ్యాపిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జ్వరాలు పెరిగాయి. డెంగీ ప్రభావం తెలంగాణ అంతటా కనిపిస్తోంది. భూతాపం వల్ల ఎండల తీవ్రత పెరిగింది. 2018లో 8 వడగాడ్పుల రోజులు నమోదైతే, ఈ ఏడాది వేసవి కాలంలో ఏకంగా 44 వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. అతి ఎండలు, అతి వర్షాలు రెండూ కూడా వాతావరణంలో మార్పుల వల్లే ఏర్పడుతున్నాయని రాజారావు అంటున్నారు. గ్లోబల్‌వార్మింగ్‌ వల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురుస్తుంటాయి. ఉదాహరణకు ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురవగా, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షం కురిసింది. దేశంలోనూ ఇటువంటి పరిస్థితే ఉందని, వాతావరణంలో మార్పులే ఇందుకు కారణమని మరో వాతావరణ విశ్లేషకుడు కమలనాథ్‌ పేర్కొన్నారు.

బలహీనపడిన ఎల్‌నినో..
జూన్, జూలై వరకు రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు పుంజుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పుడు వర్షాలు తక్కువ పడడానికి ఎల్‌నినో మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఎల్‌నినో మరింత బలహీనంగా మారింది. దీంతో వర్షాలు మరింత పుంజుకున్నాయని కమల్‌నా«థ్‌ చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో భూమధ్య రేఖ దగ్గర జల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే లానినో అంటారు. ఎలినినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లానినో వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. పసిఫిక్‌ మహా సముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావం ఆసియా దేశాలపై పడుతుంది. ఫలితంగా ఇక్కడి సముద్రపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఏడాదీ ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో నైరుతి రుతుపవనాలు బలïßహీనం అయ్యాయి. ఈసారి వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఎల్‌నినో అని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఫలితంగా కీలకమైన జూన్, జూలై నెలల్లో లోటు వర్షపాతం నమోదై వ్యవసాయ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఆగస్టు నుంచి బలహీన పడడంతో వర్షాలు పుంజుకోవడం జరిగిందని అంటున్నారు.  

Advertisement
Advertisement