
సాక్షి, హైదరాబాద్: అక్కడా ఉంటాం.. ఇక్కడా ఉంటాం.. ఇదీ ప్రభుత్వ వైద్యుల తీరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూనే కాసుల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ దర్శనమిస్తున్నారు. మరికొంత మంది వైద్యులు మరో అడుగు ముందుకేసి ఓపీలోని కొంతమందిని తమ సొంత క్లినిక్/ఆసుపత్రికి మళ్లిస్తున్నారు. ఇది జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధం. అయినా ఆ శాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఓపీకి వచ్చే వందలాది రోగులను తూతూమంత్రంగా విచారించి పంపుతున్నారు. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న చులకనభావం బలపడుతోంది.
ఓపీ నుంచి సొంత క్లినిక్‌లకు...
గ్రేటర్ పరిధిలో గాందీ, ఉస్మానియా, నిలోఫర్, సరోజని, ఈఎన్‌టీ, ఛాతీ ఆసుపత్రి, ప్లేట్లబురుజు, ఫీవర్ ఆసుపత్రి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆసుపత్రి, మానసిక ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైద్య, విధాన పరిషత్ పరిధిలోని కింగ్ కోఠి, కొండాపూర్, మలక్‌పేట్, నాంపల్లి, గోల్కొండ, వనస్థలిపురం, బార్కాస్, డబీపూర, సీతాఫల్‌మండీ, అంబర్‌పేట్ (Amberpet) తదితర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సుమారు 3 వేలకుపైగా వైద్యులు, టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. ఇందులో కొంతమందికి సొంతంగా క్లినిక్‌లు ఉండగా, మరికొంత మంది ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్, ఆన్ కాల్‌పై వైద్య సేవలందిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో గైనిక్, పీడియాట్రిక్, కిడ్నీ, గుండె తదితర కీలక విభాగాల వైద్యులు (Doctors) ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీకి వచ్చిన రోగులను తమ సొంత క్లినిక్‌లకు రావాలని సూచిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లతో ఒప్పందం
ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బందితో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. రోగులకు అవసరం ఉన్నా, లేకున్నా కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అవి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేవని, బయట చేయించుకోవాలని పంపిస్తున్నారు. దీంతో రోగులు ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
సమయపాలన ఏదీ..?
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమయపాలన ఉండటంలేదు. ఉదయం పది గంటలు దాటిన తర్వాత కూడా వైద్యులు విధులకు వస్తుంటారు. ఉదయం 8 గంటల నుంచి ఓపీ చీటీ కోసం లైన్‌లో నిలబడి, తర్వాత వైద్యుడి కోసం ఎదురుచూసిన రోగులను ఒక్క నిమిషంలో విచారించి పంపిస్తున్నారు. పీహెచ్‌సీ, క్లస్టర్, ఇతర ఆసుపత్రుల్లో ఓపీలో గంట నుంచి గంటన్నర మాత్రమే ఉంటున్నారు. మరికొంత మంది ముందుగానే సెలవు చీటీ రాసి ఇస్తున్నారు. ఎవరైనా ఆకస్మిక తనిఖీకి వస్తే సెలవు చీటీ పనిచేస్తుంది. లేదంటే డ్యూటీకి వచ్చినరోజు మిగిలిన అన్ని రోజులకు కలిపి ఒకేసారి సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చదవండి: ఆ హెర్బల్ డ్రగ్స్‌తో డేంజర్!
స్కేలు సరిపోవడంలేదు..
ప్రభుత్వ వైద్యులకు ఇప్పుడున్న స్కేల్ సరిపోవడం లేదు. ఎయిమ్స్, నిమ్స్ వైద్యులతో సమానంగా వేతనాలు ఇచ్చి ప్రైవేటు ప్రాక్టీస్ బంద్ చేయాలంటే బాగుంటుంది. సాయంత్రం 4 గంటల తరువాత ప్రైవేటు కన్సల్టెంట్‌గా ఉండే అవకాశం ఇతర రాష్ట్రాల్లో ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు (డీఎంఈ), డీఎంహెచ్‌ఓలకి ఫిర్యాదు చేయవచ్చు. ఎథిక్స్ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు.
– శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు