
సగానికిపైగా వాటిలో అధిక సూక్ష్మక్రిములు
హైదరాబాద్ దుకాణాల్లో కలుషిత హెర్బల్ డ్రగ్స్
170 ఔషధాలు పరీక్షించిన ఐసీఎంఆర్ – ఎన్‌ఐఎన్
సాక్షి, సాగుబడి: హైదరాబాద్‌లోని హెర్బల్ డ్రగ్స్ దుకాణాల్లోని ఔషధాలు సూక్ష్మ క్రిములతో కలుషితం అయిపోయాయట. భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్)కి చెందిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో వెల్లడైన వాస్తవాలివి. ఎన్‌ఐఎన్ పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగం శాస్త్రవేత్త ముళ్లపూడి వెంకట సునీత సారథ్యంలో 9 మంది శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. ఇది తాజా అధ్యయనం. అధ్యయన ఫలితాలతో కూడిన సమగ్ర వ్యాసం సైన్స్ డైరెక్ట్ వారి జర్నల్ ఆఫ్ హెర్బల్ మెడిసిన్‌లో ప్రచురితమైది.
ముప్పు ఏమిటి?
ప్రజలు విరివిగా వాడే 170 రకాల మూలికా ఔషధాల నమూనాలను హైదరాబాద్ మహాన గరం పరిధిలోని పలు రిటైల్ మందుల షాపుల నుంచి సేకరించి అధ్యయనం చేశారు. అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ బ్యాక్టీరియల్ అనలిటికల్ మాన్యువల్ సూచించిన ప్రామాణిక పద్ధతుల్లో మైక్రోబయలాజికల్ రిస్క్ అసెస్‌మెంట్ చేశారు. ఈ ఔషధాలు రోజుకు ఎంత మేరకు జబ్బును కలిగిస్తాయో తెలుసుకోవడానికి రిస్క్ రేంజర్ టూల్‌ను వినియోగించారు.
ముప్పు ఎందుకు?
ఈ మూలికా ఔషధాల్లో ఎస్చెరిచియా కోలి, ఫీకల్ కోలిఫామ్స్, స్టెఫిలోకాకస్, సూడోమోనాస్, సాల్మొనెల్లా, ఈస్ట్, మౌల్డ్స్ తదితర సూక్ష్మ క్రిములు యూఎస్ ఫార్మకోపియా అనుమతించే పరిమితులకు మించిన స్థాయిలో కనిపించాయి. 170 మూలికా ఔషధాలపై ఎఫ్‌డీఏ (FDA) ప్రమాణాల ప్రకారం పరీక్షలు చేస్తే అందులో 52.4% ఔషధ నమూనాల్లో అధిక స్థాయిలో సూక్ష్మక్రిములు ఉన్నట్లు వెల్లడైంది. 110 ఘన రూపంలో ఉన్న నమూనాలను పరీక్షిస్తే వీటిలో 63.6% ఔషధ నమూనాల్లో ప్రమాణాలకు మించి సూక్ష్మక్రిములు ఉన్నాయి.
ఎంత ముప్పు?
కలుషిత మూలికా ఔషధాలను వాడే విని యోగదారుల ఆరోగ్యానికి ఎంత మేరకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది? అనే అంశాన్ని రిస్క్ రేంజర్ టూల్ ద్వారా శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఈ సూక్ష్మక్రిములతో కూడిన మూలికా ఔషధాలను తీసుకునే వారు జీర్ణకోశ వ్యాధులు, తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడే ముప్పు ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
చదవండి: పసిమొగ్గల బర్త్ డే గార్డెన్
కింకర్తవ్యం?!
ఈ అధ్యయనం ద్వారా వెల్లడైన గణాంకాల ఆధారంగా మన దేశంలో మూలికా ఔషధాల తయారీ, నిల్వ పద్ధతులకు సంబంధించి కఠినమైన నాణ్యతా ప్రమాణాలను రూపొందించే ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.